అమెరికాలోని బే ఏరియా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ చిప్ డిజైన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సినాప్సిస్ (Synopsys) భారీగా ఉద్యోగులను తొలగించే నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇంజనీరింగ్ అండ్ డిజైన్ సంస్థ అయిన అన్సిస్ (Ansys)ను సొంతం చేసుకున్న తర్వాత.. సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ “రీస్ట్రక్చరింగ్ ప్లాన్”ను ఆమోదించింది. ఈ ప్రణాళికలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం అంటే 2వేల మందికి పైగా ఉద్యోగులను లేఆఫ్ చేయాలని ఫిక్స్ అయ్యింది.
తాజా లేఆఫ్స్ వల్ల కంపెనీకి 300 నుండి 350 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ ఖర్చులో ప్రధాన భాగం సేవరెన్స్ చెల్లింపులకే వెళ్తుంది. కెలిఫోర్నియా రాష్ట్రంలోని సన్నీవేల్ ప్రధాన కార్యాలయంలోనే 175 మంది ఉద్యోగులను తొలగించనున్నారు. వీరిలో 55 మంది R&D ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తుండగా.. మిగతావారు మేనేజ్‌మెంట్, లీగల్, డేటా సైన్స్, ఐటీ సపోర్ట్, అకౌంటింగ్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు చెందిన వారుగా తేలింది.
సినాప్సిస్ 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సుమారు 20వేల మంది ఉద్యోగులను కలిగి ఉన్నప్పటికీ.. వారిలో 80 శాతం మంది అమెరికా వెలుపల పని చేస్తున్నారు. మరోవైపు అన్సిస్‌లో 6,500 మంది ఉద్యోగులు ఉన్నారు. 35 బిలియన్ డాలర్ల విలువైన ఈ విలీన ఒప్పందం జులైలో పూర్తయింది. దీంతో ప్రస్తుతం ఉద్యోగుల తొలగింపులకు వెళ్లింది చిప్ తయారీ సంస్థ. ఆగస్టులో వచ్చిన నిరాశాజనక ఆర్థిక ఫలితాలతో స్టాక్ ధర దాదాపు 35% పడిపోయింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 74 బిలియన్ డాలర్లకు చేరింది.
ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చిప్ డిజైన్ రంగం మళ్లీ వేగంగా పుంజుకుంటున్నదని, అలాగే AI, హార్డ్‌వేర్ ఇన్నోవేషన్‌ల దిశలో జరిగే మార్పులకు పెద్ద కంపెనీలు వ్యూహాత్మకంగా స్పందిస్తున్నాయని చెబుతోందని నిపుణులు అంటున్నారు.
