పక్షవాతంతో మంచం పట్టాడు.. సక్కగనే ఉన్నడని డాక్టర్​ సర్టిఫికెట్​

పక్షవాతంతో మంచం పట్టాడు.. సక్కగనే ఉన్నడని డాక్టర్​ సర్టిఫికెట్​

బిడ్డలా చూసుకుంటున్న భార్య
పింఛన్​కు దూరమై కష్టాలు

తిరుపతి మంచం మీదనుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్నానని, వికలాంగుడినంటూ సర్టిఫికెట్​ ఇవ్వాలని అప్లై చేసుకున్నాడు. సదరం క్యాంపుకు కూడా వెళ్లి వచ్చాడు. అయితే అతడు పర్​ఫెక్ట్ ​గానే ఉన్నాడని, జీరో డిజబులిటీ అంటూ ఓ మెడికల్​ ఆఫీసర్ ​సర్టిఫికెట్​లో మెన్షన్​ చేశాడు. దీంతో  పింఛన్​కోసం దరఖాస్తు చేసుకుంటే మనిషిని కాకుండా ఆ సర్టిఫికెట్​ ఆధారంగా అర్హుడు కాదని తేల్చారు. తాము ఏమీ చేయలేమని, సర్టిఫికెట్​ ఇస్తే పింఛన్​ వచ్చేలా చేస్తామని అధికారులు అంటున్నారు.

కొడిమ్యాల, వెలుగు: కష్ట సుఖాల్లో కలకాలం తోడుంటానని చేసిన బాసలకు ఆ భార్య కట్టుబడి ఉంది. 15 నెలల కిందట రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిని మంచం పట్టిన భర్తను కన్నబిడ్డలా చూసుకుంటోంది. ఔట్​సోర్సింగ్​ జాబ్​చేస్తూ  పిల్లలను చదివిస్తోంది. సాయం చేసేవారు లేక ఒంటిచేత్తో కుటుంబభారాన్ని మోస్తోంది. సర్కారు అయినా తన భర్తకు పింఛన్​ ఇచ్చి ఆదుకుంటుందనుకుంటే ఓ ఆఫీసర్​ అతడికి ఏమీ కాలేదని, బాగానే ఉన్నాడని సర్టిఫికెట్​ఇచ్చి పొట్టగొట్టిండు.

మంచాన పడేసిన యాక్సిడెంట్​

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపెల్లికి చెందిన రొడ్డ తిరుపతి-– సుమలత దంపతులకు కొడుకు అదిత్య, కూతుర్లు శ్రీనిధి, మహి ఉన్నారు. తిరుపతి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. సుమలత నాచుపెల్లి  జేఎన్టీయూ లో ఔట్ సోర్సింగ్ జాబ్​ చేస్తోంది.  ఎంతో ఆనందంగా సాగుతున్న వీరి జీవితాన్ని ఒక రోడ్డు ప్రమాదం కష్టాల కడలిలోకి నెట్టింది. 2019 ఫిబ్రవరిలో నాచుపెల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి నడుం కింది భాగం పని చేయడం లేదు. ఎన్నో హాస్పిటల్స్​లో చూపించి ,10 లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది.

అన్నీ తానై..

చిన్నపాటి గొడవలకే కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్న ఈ రోజుల్లో భర్త మంచానికే పరిమితమైనా కుటుంబ భారాన్ని మోయడానికి సిద్ధమైంది సుమలత. మంచం దిగి కాలు కింద పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న భర్త తిరుపతికి  అన్నీ తానై సపర్యలు చేస్తోంది. అన్ని పనుల్లో అండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. తెల్లవారుజామునే లేచి అతడికి అవసరమైన పనులతో పాటు, వంట,  ఇంటి పనులన్నీ జాబ్​కు వెళ్లే టైం కంటే ముందే కంప్లీట్​ చేసుకుంటుంది. అన్నీ రెడీ చేసి పిల్లలకు నాన్నను చూసుకోమని చెప్పి వెళ్లిపోతుంది. సుమలత ఒక్కరే పని చేస్తుండడంతో ఆమెకు వచ్చే వచ్చే పది వేల జీతంతో కుటుంబాన్ని నెట్టుకురాలేకపోతున్నారు. ఇంటి ఖర్చులకు,  పిల్లల చదువుకు కూడా సరిపోవడం లేదు. భర్త మందులకు, ట్రీట్​మెంట్​కు అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

For More News..

11 మున్సిపాలిటీలపై కేంద్రం ఫోకస్

64 మందితో 24గంటల సర్జరీ

కూలీల తరలింపునకు 13 కోట్లు ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం