ఫీల్డ్లో సర్వే నంబర్లు తెలియక ఏఈవోలకు ఇక్కట్లు

ఫీల్డ్లో సర్వే నంబర్లు తెలియక ఏఈవోలకు ఇక్కట్లు

మహబూబ్​నగర్, వెలుగు:రాష్ట్రంలో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి, దిగుబడి ఎంత వస్తుందో అంచనా వేసేందుకు ప్రభుత్వం మూడేళ్లుగా పంటల నమోదు చేపడుతోంది. ఈసారి ఏఈవోలు ఫీల్డ్​కు వెళ్లి సర్వే నంబర్ల ఆధారంగా పంటలు నమోదు చేయాలని, ఆగస్టు 31వ తేదీ వరకు దీన్ని పూర్తి చేయాలని డెడ్​లైన్​పెట్టింది. క్షేత్రస్థాయిలో ఏఈవోలు పంటల నమోదుకు వెళ్తున్నా, సర్వే నంబర్లను ఐడెంటిఫై చేయడం కష్టంగా మారింది. ఒకే సర్వే నంబర్​మీద ఐదారు బై నంబర్లు ఉండటం.. ఏ రైతు ఏ సర్వే నంబర్ మీద పొజిషన్​లో ఉన్నాడో తెలియక ఆన్​లైన్​లో ఎంట్రీ చేయడం తలకు మించిన భారంగా మారింది. దీనికితోడు రెవెన్యూ డిపార్ట్​మెంట్​ నుంచి సహాయకులు లేకపోవడంతో ఈ ప్రాసెస్​ లేట్​అవుతోంది. తెలంగాణలో 63 లక్షల మంది రైతులు ఉండగా, 2,602 అగ్రికల్చర్​ క్లస్టర్లు ఉన్నాయి. వీటిలో 2,400 మంది రెగ్యులర్​ ఏఈవోలు, 202 మంది అవుట్​సోర్సింగ్​కింద వర్క్​ చేస్తున్నారు. వీరంతా ప్రస్తుతం సర్వే నంబర్ల ఆధారంగా పంటలు నమోదు చేసేందుకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఫీల్డ్​లో తిరుగుతున్నారు. ఒక్కో ఏఈవో క్లస్టర్​పరిధిలోని 4,500 నుంచి 5,500 ఎకరాల వివరాలను ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలి. అది కూడా రైతు పొలం నుంచే జీపీఎస్​ ఆధారంగా యాప్​లో అప్​లోడ్​ చేయాలి. కానీ ఫీల్డ్​లో రెవెన్యూ ఆఫీసుల నుంచి వీరికిచ్చిన సర్వే నంబర్ల ఆధారంగా పంటలు ఉండటం లేదు. ఏ పొలం ఏ రైతుదో తెలియడం లేదు. పంట సాగు చేస్తున్న రైతును పిలిపించి అడిగినా ఫలానా సర్వే నంబర్​అని చెబుతున్నారే తప్ప బై నంబర్లుగా ఉన్న వాటి గురించి తెల్వదని అంటున్నారు. వీటి గురించి తెలిసిన వీఆర్ఏలు సమ్మెలో ఉండటంతో సర్వేలో పాల్గొనడం లేదు. దీంతో పంటల నమోదుకు వెళ్తున్న అగ్రికల్చర్​ఆఫీసర్లు సర్వే నంబర్ల ఆధారంగా పంట వివరాలు నమోదు తమ వశమైతలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజులో కనీసం 40 నుంచి 50 ఎకరాల వివరాలు కూడా ఆన్​లైన్​లో ఎంట్రీ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. 31వ తేదీ వరకు ఇది కంప్లీట్​ చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్​ఐదు రోజుల కిందట డెడ్​లైన్​పెట్టడంతో ఆందోళనకు గురవుతున్నారు. పైగా రోజూ మీ ఏరియాలో ఎన్ని పంటల వివరాలు ఎంట్రీ చేశారు.. బ్యాలెన్స్​ఎంత ఉందని స్టేట్​ఆఫీషియల్స్​జిల్లా అగ్రికల్చర్​ఆఫీసర్లకు వాట్సప్​ మెసేజ్​లు పెడుతున్నారు. వారు జిల్లాల వాట్సాప్​గ్రూపుల్లో ఏఈవో వైజ్​గా ఫార్మాట్ ​తయారుచేసి ఇంత పెండింగ్​ఉందంటూ పోస్టులు చేస్తున్నారు. అలాగే కమిషనరేట్​ నుంచి జిల్లాలకు స్పెషల్​ఆఫీసర్లను ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. దీని వల్ల ఏఈవోలు ఒత్తిడికి గురవుతున్నారు. మరో వారం రోజుల్లో ఇది పూర్తి చేయలేమని పాలమూరు జిల్లాకు చెందిన జిల్లా ఏఈవోలు ఇటీవల జిల్లా అగ్రికల్చర్​ఆఫీసర్​కు వినతిపత్రం ఇచ్చారు.

ఇంటర్నెట్​సౌకర్యం ఇయ్యలె..
సర్వే నంబర్ల ఆధారంగా పంటల నమోదుకు మొబైల్​యాప్​ను క్రియేట్​చేసి లింక్​ను ప్రభుత్వం ఏఈవోలకు పంపింది. లింక్​ ద్వారా యాప్​ను మొబైల్​లో డౌన్​లోడ్​చేసుకోవాలని చెప్పింది. కానీ 1.5 జీబీ ఇంటర్నెట్ డేటా ఫెసిలిటీ మాత్రమే కల్పించారు. ఈ డేటాతో జీపీఎస్​ఆన్​చేసి వివరాలు నమోదు చేస్తుంటే మధ్యలోనే నెట్​అయిపోతోంది. మధ్యలో ఫోన్​కాల్స్​ రిసీవ్​ చేసుకుంటే యాప్​మళ్లీ ఫస్ట్​నుంచి లాగిన్​ అడుగుతోంది. దీంతో ఆ టైంలో నమోదు చేసిన వివరాలు మొత్తం మళ్లీ ఫస్ట్​ నుంచి చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల మారుమూల ప్రాంతాల్లో నెట్​రావట్లేదు. అక్కడ పంటల వివరాలు నమోదు చేయడం లేదు. రైతుబంధు, రైతుబీమా, ఇతర వ్యవసాయానికి సంబంధించిన డేటాను ఆన్​లైన్​లో ఎంట్రీ చేయడానికి 2017లో ఏఈవోలకు ట్యాబ్​లు ఇవ్వగా ప్రస్తుతం అవి పనిచేయడం లేదు. దీంతో ఏఈవోలు వారి సొంత ఫోన్ల నుంచే వివరాలు నమోదు చేస్తున్నారు. విలేజ్​లలో నెట్​వర్క్​ వచ్చిపోతుండటంతో ఇబ్బందులు వస్తున్నాయి.

యాప్​లో టెక్నికల్ ​మిస్టేక్స్​
ప్రొక్యూర్​మెంట్​టైంలో ఆన్​లైన్​లో ఎంట్రీ చేసిన వివరాల ఆధారంగానే పంటలను ప్రభుత్వం కొననుంది. ఆన్​లైన్​లో పంట వివరాలు లేకుంటే ఆ పంటను గవర్నమెంట్​సెంటర్​లో కొనరని స్పష్టం చేసింది. ప్రస్తుతం భారీ వర్షాలకు గోదావరి నదికి వరదలు రావడం వల్ల కరీంనగర్, వరంగల్, మంచిర్యాల, ఖమ్మం, నిర్మల్, ములుగు, జయశంకర్​భూపాలపల్లి ఇతర జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మహబూబ్​నగర్​ జిల్లాలోని చెరువుల్లో ఇంకా నీళ్లు చేరలేదు. వీటికింద చాలా పంటలు ఇంకా వేయలేదు. అయితే, ఈ వివరాలను ఎంట్రీ చేసేందుకు యాప్​లో ‘నో క్రాప్’ అనే అప్షన్​ను అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో ప్రస్తుతం పంటలు వేయకుండా ఉన్న పొలాల వివరాలు ఎంట్రీ చేయడం లేదు. ఈ నెల చివరి వారం వరకు కొన్నిచోట్ల వరి, మక్కలు వేయనున్నారు. ఆ  వివరాలు ఆన్​లైన్​లో నమోదు చేసే అవకాశం లేకపోవడంతో ఈ పంటలు అమ్ముకునేందుకు రైతులు ప్రైవేట్​ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

గడువు పెంచాలి
పంట నమోదుకు గ్రామాలకు వెళ్లడానికి చాలాచోట్ల రోడ్డు సౌకర్యం లేదు. 50 శాతం మంది మహిళా ఏఈవోలు ఉన్నారు. ఫిజికల్​గా తిరిగి చేసే పని కాబట్టి సెప్టెంబరు 31 వరకు గడువు ఇవ్వాలి. ట్యాబ్​లు సమకూర్చడంతోపాటు వీఆర్ఏను అసిస్టెంట్​గా ఇవ్వాలి. అవసరమైన అన్ని వసతులు కల్పిస్తేనే అనుకున్న టైంలోగా పని పూర్తి చేయగలం. 
–శ్రీనివాస్ ​గౌడ్, స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ అగ్రికల్చర్​ ఎక్స్​టెన్షన్​ఆఫీసర్స్​ అసోసియేషన్​ సెంట్రల్​ ఫోరం