న్యూఢిల్లీ: బ్యాంకులు లేదా నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నుంచి ఆన్లైన్లో లోన్లు (డిజిటల్ లెండింగ్) తీసుకోవడం దేశమంతటా పెరుగుతోంది. ఎన్బీఎఫ్సీలు డిజిటల్ పర్సనల్ లోన్ మార్కెట్‌కు వెన్నెముకగా మారాయి. 2025–-26 ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో (హెచ్1) నాలుగు కోట్ల డిజిటల్ పర్సనల్ లోన్లు మంజూరయ్యాయి. వీటి విలువ రూ.97,381 కోట్లని ఫిన్‌టెక్ అసోసియేషన్ ఫర్ కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ (ఫేస్) స్టడీ రిపోర్ట్ వెల్లడించింది.
ఇది మొత్తం పర్సనల్ లోన్ వాల్యూమ్‌లో 80శాతం కాగా, మొత్తం మంజూరైన విలువలో 19శాతానికి సమానం. గత ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో 5.9 కోట్ల లోన్లు జారీ అయ్యాయి. విలువ రూ.78,084 కోట్ల నుంచి రూ.97,381 కోట్లకు పెరిగింది. ఈసారి లోన్ సగటు టికెట్ సైజు కూడా పెరిగింది.
గత ఏడాది హెచ్1లో రూ.13,327 ఉండగా, ఈసారి హెచ్1లో రూ.15,177 కు చేరింది. కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ మెరుగుపడుతున్నందున, ఎక్కువ డబ్బు తీసుకుంటున్నారు. ఎగవేతలు తగ్గుతున్నాయి. డీపీడీ (90 రోజులకు పైగా బకాయిలు ఉన్నవి) 90 ప్లస్ 2.1శాతానికి మెరుగుపడింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 5.99 కోట్ల యాక్టివ్ అకౌంట్లకు గాను మొత్తం డిజిటల్ పర్సనల్ లోన్ బుక్ విలువ రూ.1.28 లక్షల కోట్లుగా ఉంది.
లోన్ల విలువలో 60 శాతం మొత్తం 35 ఏళ్ల లోపు కస్టమర్ల ఖాతాలో పడింది. మహిళల వాటా17శాతం ఉంది. దాదాపు 53శాతం మంది కస్టమర్లు టైర్–3 నగరాల నుంచి ఉన్నారు. చిన్న నగరాలవాసులు కూడా భారీగా లోన్లు తీసుకుంటున్నారు. డిజిటల్ లోన్లు అన్ని ప్రాంతాల వారికీ అందుతున్నాయని ‘ఫేస్’ సీఈఓ సుగంధ్ సక్సేనా అన్నారు. ఆన్లైన్ లోన్ల వల్ల అధిక వడ్డీ వసూలు చేసేవారికిపై ఆధారపడటం తగ్గుతోందని చెప్పారు.
ఎందుకు పెరుగుతున్నాయంటే..
స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరగడం, యూపీఐని విస్తృతంగా ఉపయోగించడం, ఆధార్, బ్యాంక్ స్టేట్‌మెంట్ అగ్రిగేటర్లు, అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా మెరుగైన డేటా అందుబాటులోకి రావడంతో డిజిటల్ లెండింగ్ దూసుకుపోతోంది. వడ్డీ రేట్లు తగ్గడం కూడా లెండర్లకు కలిసి వస్తోంది.
కేవైసీ ప్రక్రియ సులువుగా మారడం, ఏఐ- ఆధారిత క్రెడిట్ స్కోరింగ్ టెక్నాలజీల వల్ల నిమిషాల్లో లోన్వస్తోంది. ఈఎంఐలు కూడా ఆన్లైన్లో కట్టే సదుపాయం వచ్చింది. దీంతో లోన్ల మంజూరులో బ్యాంకులతో ఎన్బీఎఫ్సీలు పోటీ పడుతున్నాయి. పండుగ సీజన్ డిమాండ్, సంవత్సరాంతపు ఖర్చుల వల్ల కూడా లోన్లు పెరిగాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ లోన్లు రికార్డుస్థాయికి చేరే అవకాశం ఉందని ఫేస్ స్టడీ రిపోర్ట్ అంచనా వేసింది.
