- ఒక సామాన్య కార్యకర్త ప్రధానిగా ఎదిగారంటూ కితాబు
- వివాదాస్పదం కావడంతో తాను ఎప్పుడూ ఆర్‌ఎస్‌ఎస్‌కు
- వ్యతిరేకమేనని వివరణ
న్యూఢిల్లీ: ఆర్ఎస్‌ఎస్, ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. శనివారం ఒక పాత ఫొటోను సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. అందులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చొని ఉండగా, అక్కడే కింద మోదీ కూర్చొని ఉన్నారు.
దీనికి ఒక సామాన్య కార్యకర్త దేశ ప్రధానిగా ఎదిగారంటూ దిగ్విజయ్ క్యాప్షన్ ఇచ్చారు. ‘‘నాకు ఓ సైట్‌లో ఈ ఫొటో దొరికింది. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకప్పుడు లీడర్ల దగ్గర కింద కూర్చున్న ఒక ఆర్ఎస్‌ఎస్ కార్యకర్త.. సీఎంగా, ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి. ఇది ఆ సంస్థకు ఉన్న శక్తి” అంటూ ప్రశంసించారు.
అయితే ఈ పోస్టు కాస్తా వివాదాస్పదం కావడంతో దిగ్విజయ్ తర్వాత క్లారిటీ ఇచ్చారు. ‘‘ఆర్ఎస్‌ఎస్, మోదీకి నేను ఎప్పుడూ వ్యతిరేకమే. నా పోస్టును తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను కేవలం ఆ సంస్థ బలమైనది అని చెప్పాను. అలా ఒక సంస్థను ప్రశంసించడం కూడా తప్పేనా?” అని ప్రశ్నించారు.
కాగా, పార్టీలో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందంటూ వారం కింద రాహుల్ గాంధీకి దిగ్విజయ్ సూచించారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, మోదీపై ప్రశంసలు కురిపించడంతో ఆయన తీరుపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది.
రాహుల్‌పై బీజేపీ విమర్శలు..
దిగ్విజయ్ పోస్టు నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ‘‘కాంగ్రెస్ నాయకత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నదని, పార్టీలో ప్రజాస్వామ్యం లేదని దిగ్విజయ్ సింగ్ నిజాలను చెప్పారు. దీనికి సమాధానం చెప్పే ధైర్యం రాహుల్ గాంధీకి ఉందా?” అని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ సవాల్ విసిరారు.
‘‘కాంగ్రెస్ పూర్తిగా ఒక కుటుంబ పార్టీగా మారిపోయిందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన వ్యక్తే పార్టీలో అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. వేరే నేతలు ఎదిగే అవకాశం ఇవ్వడం లేదు’’ అని బీజేపీ లీడర్ గౌరవ్ వల్లభ్ అన్నారు.
