రాష్ట్రంలో పవర్​లోకి రావాలంటే.. ఎస్సీ, ఎస్టీ సీట్లలో 25 గెలవాలె

రాష్ట్రంలో పవర్​లోకి రావాలంటే..  ఎస్సీ, ఎస్టీ సీట్లలో 25 గెలవాలె
  • బీజేపీ రాష్ట్ర నేతలకు జాతీయ నేతల దిశానిర్దేశం
  • ఆ వర్గాలకు మోదీ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించండి
  • వారికి కేసీఆర్ చేసిన మోసాల్ని ఎండగట్టాలని పిలుపు
  • ఈ నెల 20 నుంచి ప్రతి నియోజకవర్గంలో సభలు

హైదరాబాద్, వెలుగు: మోడీ సర్కార్ ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ఆ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో దక్కిన పదవులను రాష్ట్ర ప్రజలకు వివరించాలని బీజేపీ జాతీయ నేతలు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. అదే టైమ్​లో రాష్ట్రంలో ఈ వర్గాలకు కేసీఆర్ చేసిన మోసాన్ని ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాలపై సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ మీటింగ్​లో రాష్ట్ర పార్టీ ఎలక్షన్ ఇన్​చార్జ్ ప్రకాశ్​జవదేకర్, రాష్ట్ర పార్టీ ఇన్​చార్జ్​లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, స్టేట్ బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, జవదేకర్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ లు రాష్ట్ర నేతలకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ పవర్​లోకి రావాలంటే 31 రిజర్వుడు సీట్లలో కనీసం 25 సీట్లు గెలుచుకునేలా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ను గద్దె దించి, బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో ఈ సీట్లు కీలకమని స్పష్టం చేశారు. ఈ స్థానాల్లో గెలుపుకోసం కేంద్రం తరఫున, జాతీయ పార్టీ తరఫున ఎలాంటి సహకారం అందించడానికైనా రెడీగా ఉన్నామన్నారు. అక్కడ పార్టీని బూత్, మండల స్థాయిలో పటిష్టపరిచేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సెగ్మెంట్లలో పార్టీ గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలో ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ నెల 20 నుంచి వచ్చే సెప్టెంబర్ 15వ తేదీ వరకు ప్రతి నియోజకవర్గంలో కనీసం 5 వేల మందికి తగ్గకుండా సభలు నిర్వహించాని జాతీయ నేతలు ఆదేశించారు. మోదీ కేబినెట్ లోని 12 మంది ఎస్సీ మంత్రులను రాష్ట్రంలోని ఒకే వేదికపైకి తీసుకువచ్చి బీజేపీ దళితులకు రాజకీయంగా ఎంతగా ప్రాధాన్యతనిచ్చిందో రాష్ట్ర ప్రజలకు వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. అదే విధంగా కేంద్రంలోని ఎస్టీ మంత్రులతో ఎస్టీ సెగ్మెంట్లలో మీటింగ్​లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి రిజర్వుడ్ సీటు నుంచి పార్టీ తరఫున పోటీ చేసే ముగ్గురు బలమైన నేతల పేర్లతో లిస్ట్​రెడీ చేయాలని సూచించారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు ఇన్​చార్జ్​లను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులో ఒకరు జాతీయ పార్టీ తరఫున, ఇంకొకరు రాష్ట్ర పార్టీ తరఫున ఉంటారని వివరించారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ నియామకాలను రాష్ట్ర పార్టీ ప్రకటిస్తుందన్నారు. సమావేశంలో ఎస్సీ నియోజకవర్గాల కమిటీ కన్వీనర్ జితేందర్ రెడ్డి, ఎస్టీ నియోజకవర్గాల కమిటీ కన్వీనర్ గరికపాటి మోహన్ రావు, ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఉన్నతాధికారులతో సమావేశం

రాష్ట్రంలోని రిటైర్డ్ బ్యూరోక్రాట్లతో ప్రకాశ్ జవదేకర్, మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. శుక్రవారం హైదరాబాద్​ బంజారా హిల్స్ లోని ఓ స్టార్ హోటల్ లో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో నిధులు ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయి.. ఏయే స్కీమ్ లలో ఎలాంటి స్కామ్​లు జరుగుతున్నాయనే విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఈ విషయాలపై ఒక సమగ్రంగా నివేదిక రూపొందించి జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఇయ్యాల ఇందిరా పార్కు వద్ద బీజేపీ ధర్నా

డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులైన పేదలందరికి పంచాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇందిరా పార్కు వద్ద రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ నేతలు ప్రకాశ్ జవదేకర్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తో పాటు రాష్ట్ర ముఖ్య నేతలు ఇందులో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ధర్నా జరుగనుంది.