తొంభై శాతం చిత్రాలు సక్సెస్

తొంభై శాతం చిత్రాలు సక్సెస్

టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలతో రికార్డులు సృష్టించిన దర్శకులెవరంటే ముందుగా చెప్పేది దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావుల పేర్లు మాత్రమే. ఆ తర్వాత చెప్పేది.. కచ్చితంగా ఎ.కోదండరామిరెడ్డి పేరు. కొన్ని దశాబ్దాల పాటు తన ఫిల్మ్ మేకింగ్ టాలెంట్‌తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా కోదండరామిరెడ్డి కెరీర్ గ్రాఫ్ నుంచి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

1950లో నెల్లూరు జిల్లా మైపాడులో ఒక వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించారు కోదండరామిరెడ్డి. ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదువుకున్నారు. చిన్ననాటి నుంచే నాటకాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం తర్వాత సినిమాలవైపు మళ్లింది. దాంతో పీయూసీ మధ్యలోనే ఆపేసి మరీ మద్రాసు రైలెక్కేశారు. అయితే నటన కంటే డైరెక్షన్ బెటరని ఎవరో చెప్పడంతో వి.మధుసూదనరావు దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. 

ఏడేళ్లు అసిస్టెంట్‌ డైరెక్టర్‌‌గా, అసోసియేట్ డైరెక్టర్‌‌గా, కో డైరెక్టర్‌‌గా పనిచేశాక ‘రామ్ రాబర్ట్ రామ్’ అనే సినిమాని డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చింది రామిరెడ్డికి. అయితే కొత్త దర్శకుడు కావడంతో రిస్క్ తీసుకోవడం ఎందుకని నిర్మాతలు వెనక్కి తగ్గడంతో ఆ చాన్స్ చేజారింది. ఎట్టకేలకి 1980లో ‘సంధ్య’ సినిమాతో మెగాఫోన్ పట్టారాయన. సుజాత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అంత సక్సెస్ కాకపోయినా, కోదండరామిరెడ్డికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

కోదండరామిరెడ్డి కెరీర్‌‌ని మలుపు తిప్పిన సినిమా ‘న్యాయం కావాలి’. చిరంజీవి, రాధిక లీడ్ రోల్స్ చేశారు. శారద, జగ్గయ్య కీలక పాత్రలు పోషించారు. ప్రేమించి మోసం చేసినవాడిపై ఓ అమ్మాయి చేసే న్యాయపోరాటమే ఈ సినిమా. దీన్ని రామిరెడ్డి తెరకెక్కించిన విధానం అందరికీ నచ్చేసింది. సినిమా మంచి విజయం సాధించింది. దీంతో ఆయన ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 

తన కెరీర్‌‌ మొత్తంలో 94 సినిమాలు తీశారు కోదండరామిరెడ్డి. వాటిలో తొంభై శాతం చిత్రాలు విజయం సాధించాయి. కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, పల్నాటి సింహం, ఖైదీ రుద్రయ్య, అనసూయమ్మగారి అల్లుడు, నారీ నారీ నడుమ మురారి, భార్గవరాముడు, బొబ్బిలి సింహం, ప్రెసిడెంటుగారి పెళ్లాం, అల్లరి అల్లుడు.. ఇలా చెప్పుకుంటే ఎక్కువ హిట్సే ఉంటాయి. 

అందరి కంటే ఎక్కువగా చిరంజీవితోనే సినిమాలు తీశారు కోదండరామిరెడ్డి. ‘న్యాయం కావాలి’తో మొదలైన వీరి ప్రయాణం ఇరవై అయిదు సినిమాల వరకు సాగింది. అభిలాష, ఖైదీ, చాలెంజ్, విజేత, రాక్షసుడు, దొంగమొగుడు, పసివాడి ప్రాణం, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ లాంటి చాలా హిట్స్ వచ్చాయి వీరి కాంబినేషన్‌లో. ఇక నవలల ఆధారకంగా ఎక్కువ చిత్రాలు తెరకెక్కించిన రికార్డు కూడా కోదండరామిరెడ్డిదే.

తెలుగులో ఇళయరాజాను భారీ కమర్షియల్ సినిమాలకు సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన క్రెడిట్ కోదండరామిరెడ్డిదే అంటారంతా. ఆయన తీసిన రాక్షసుడు, అభిలాష, చాలెంజ్ లాంటి సినిమాలకు రాజానే మ్యూజిక్ అందించారు. అవన్నీ మ్యూజికల్ హిట్సే. 

బాలకృష్ణతో బొబ్బిలిసింహం తీసిన తర్వాత ఇక వరుస పరాజయాలు ఇబ్బంది పెట్టాయి కోదండరామిరెడ్డిని. దాంతో ఉండేకొద్దీ సినిమాల సంఖ్య తగ్గింది. 2009లో పున్నమి నాగు అనే సినిమాని డైరెక్ట్ చేశారు. ‘కాస్కో’ అనే సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఇక ఆ తర్వాత ఏ సినిమా చేయలేదు.

కోదండరామిరెడ్డికి ఇద్దరు కొడుకులు.. సునీల్, వైభవ్. సునీల్ బిజినెస్‌మేన్. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ‘సీతాకది’ మూవీలో నెగిటివ్ రోల్‌లో నటించాడు. రెండో కొడుకు వైభవ్‌కి మాత్రం చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉంది. రాజశేఖర్‌‌తో తీసిన ‘మొరటోడు నా మొగుడు’ సినిమాలోని ఓ పాటలో, నాగార్జున ‘ఇద్దరూ ఇద్దరే’లోని ఒక సీన్‌లో నటించాడు. అతన్ని హీరోగా పెట్టి ‘గొడవ’ అనే సినిమా తీశారు కోదండరామిరెడ్డి. ఆ తర్వాత అతను చాలా సినిమాల్లో నటించాడు. నటుడిగానే కంటిన్యూ అవుతున్నాడు. 

కథల ఎంపికలో నేర్పు, ఫిల్మ్ మేకింగ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక శైలి, కమర్షియల్ ఫార్మాట్‌ని అవపోసన పట్టిన అనుభవం.. ఇవన్నీ కలిసి కోదండరామిరెడ్డిని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌‌ని చేశాయి. సో ఎన్నాళ్లైనా ఎన్నేళ్లయినా.. ఆయన పేరు టాలీవుడ్‌లో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన సక్సెస్‌ స్టోరీని వినిపిస్తూనే ఉంటుంది.