
ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారిని శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు వారి గోత్రనామాల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీష్ శంకర్ కు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం హరీష్ శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి అనుబంధ ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఇక హరీష్ సినిమాల విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు.
ఈ భారీ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్పటికే ఓ హీరోయిన్ గా పూజా హెగ్డే కన్ఫర్మ్ కాగా.. రెండో హీరోయిన్ గా మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ ను తీసుకున్నారని టాక్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం చేయనున్నారు. ఇక హరీష్, పవన్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ కావటంతో ఇప్పుడు అందరి దృష్టి ఉస్తాద్ భగత్ సింగ్ పై పడింది.