హీరో శ్రీవిష్ణు, రీతూ వర్మ జంటగా హసిత్ గోలి తెరకెక్కించిన చిత్రం ‘శ్వాగ్’. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 4న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘మిగతా సినిమాల కంటే దీనికి ఓ వంతు ఎక్కువ కష్టపడ్డాం. అంతే గట్టిగా హిట్ కొట్టబోతున్నాం. సినిమా చూసి పిచ్చెక్కిపోతారు. ఇది నా ప్రామిస్. సినిమా నచ్చితే రెండు చప్పట్లు కొట్టండి. అలాంటి చప్పట్ల నుంచి స్ఫూర్తి పొంది ఇక్కడి వరకూ వచ్చా. కథతో పాటు చక్కని కామెడీ, ప్యూర్ ఎమోషన్ ఉన్నాయి. సినిమా చూశాక పేరెంట్స్‌కి ఫోన్ చేసి, వాళ్లని సినిమాకు తీసుకెళతారు’ అని చెప్పాడు.
‘నా గత సినిమాలకి పూర్తి భిన్నంగా ఇది ఉండబోతోంది. నా క్యారెక్టర్స్ కూడా కొత్తగా ఉంటాయి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని రీతూ వర్మ చెప్పింది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘ఇందులో శ్రీవిష్ణు పోషించిన పాత్రలు దేనికవే యూనిక్‌గా ఉంటాయి. హసిత్ అద్భుతంగా తీశాడు’ అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘శ్రీ విష్ణు, వివేక్ గార్లు నాకు గురు సమానులు. వాళ్ల సపోర్ట్‌తోనే నా జర్నీ కంటిన్యూ చేస్తున్నా. తను హీరో అవ్వాలని కాకుండా కథ హీరో అవ్వాలని శ్రీ విష్ణు నటించారు. అక్టోబర్ 4న బెస్ట్ ఇంటర్వెల్, బెస్ట్ క్లైమాక్స్, బెస్ట్ మూవీని చూడబోతున్నారు. చాలా ఆత్మవిశ్వాసంతో ఈ మాట చెప్తున్నా. దసరా అయ్యాక కూడా చూస్తూనే ఉంటారనేది నా నమ్మకం’ అని చెప్పాడు.
దర్శకులు వివేక్ ఆత్రేయ, అనుదీప్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. హీరోయిన్ దక్ష, నటి శరణ్య ప్రదీప్, ఎడిటర్ విప్లవ్ నైషదం తదితరులు పాల్గొన్నారు.