V6 News

Prabhas: జపాన్లో భారీ భూకంపం.. డార్లింగ్ ఫ్యాన్స్లో టెన్షన్.. టెన్షన్.. డైరెక్టర్ మారుతి క్లారిటీ

Prabhas: జపాన్లో భారీ భూకంపం.. డార్లింగ్ ఫ్యాన్స్లో టెన్షన్.. టెన్షన్.. డైరెక్టర్ మారుతి క్లారిటీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం జపాన్లో ఉన్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి జపాన్‌‌లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 12న అక్కడ విడుదలవుతున్న నేపథ్యంలో ప్రభాస్‌‌ స్పెషల్‌‌ స్క్రీనింగ్‌‌కు హాజరయ్యారు.

ఈ క్రమంలోనే సోమవారం (డిసెంబర్ 08) సాయంత్రం జపాన్ ఉత్తర తీరంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భారీ భూకంపం కారణంగా జాపాన్ ఈశాన్య తీరంలో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా ప్రభాస్‌ క్షేమంగా ఉన్నారని డైరెక్టర్ మారుతి రిప్లై ఇవ్వడంతో అభిమానులు కాస్త ఉపశమనం పొందారు. 

‘జపాన్‌లో భారీ భూకంపం వచ్చింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. మా హీరో ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు. ఈరోజు సాయంత్రం రిటర్న్ అవుతాడా?’ అని ఓ అభిమాని డైరెక్టర్ మారుతిని అడుగుతూ పోస్ట్‌ పెట్టాడు.

ఈ మెసేజ్కి డైరెక్టర్ మారుతి స్పందిస్తూ.. ‘ప్రభాస్‌తో ఇప్పుడే మాట్లాడాను. భూకంపం వచ్చిన ప్రాంతంలో ఆయన లేరు. ఆయన క్షేమంగా ఉన్నారు. ఆందోళన చెందకండి’ అని రిప్లై ఇచ్చారు. ఈ గుడ్ న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఇటీవలే బాహుబలి స్పెషల్‌‌ స్క్రీనింగ్‌‌కు హాజరైన ప్రభాస్.. అక్కడి అభిమానుల ప్రేమకు ఫిదా అయినట్లు తెలిపారు. ప్రత్యేకంగా వాళ్లతో ముచ్చటించారు. ప్రభాస్‌‌ మాట్లాడుతూ ‘ఎంతో ఎమోషనల్‌‌గా ఉంది. గత పదేళ్లుగా ఈ మూమెంట్‌‌ కోసం ఎదురుచూస్తున్నా. రాజమౌళి గారి ఫ్యామిలీ, శోబు గారి ఫ్యామిలీ ఇక్కడి ప్రేక్షకుల లవ్‌‌, ఎమోషన్‌‌ గురించి చెప్పారు. ఇప్పుడు  జపాన్‌‌ మా అందరికీ సొంత దేశంలా మారింది. మీ ఆదరణకు థ్యాంక్స్‌‌. ఎన్నో ఏళ్ల తర్వాత మిమ్మల్నందరినీ ఇలా డైరెక్ట్‌‌గా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను’ అని ప్రభాస్ చెప్పారు. 

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే, హను రాఘవాపుడితో ఫౌజి, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాల షూటింగ్స్‌‌తో ప్రభాస్‌‌ బిజీగా ఉన్నారు. సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం, కల్కి 2898 ఏడీ పార్ట్ 2 సినిమాలు చేయాల్సి ఉంది.