హైదరాబాద్ నిజాం ఇనిస్టిట్ట్యూట్ఆఫ్మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆస్పత్రిలో వారం రోజుల్లో 500 మంది చిన్నారులకు గుండె సంబంధిత టెస్టులు చేశామని డైరెక్టర్ ఎన్. బీరప్ప చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి 500 మంది చిన్నారులు నిమ్స్ కు వచ్చారన్నారు. ఇప్పటి వరకు 15 సర్జరీలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. బ్రిటన్ వైద్యుల బృందంతో గుండె సంబంధిత సర్జరీలు చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా బ్రిటన్ వైద్యుల బృందాన్ని లీడ్ చేసిన డాక్టర్ రమణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిమ్స్ లో చిన్న పిల్లల కోసం ఉచితంగా ప్రతి గురువారం ప్రత్యేకంగా క్యాంప్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు.
చార్లీస్ హార్ట్ హీరోస్ పేరుతో ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. నిమ్స్ మిలీనియం బ్లాకులో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. శిశువుల నుంచి ఐదేండ్లలోపు పిల్లలకు గుండెలో రంధ్రం, గుండె సంబంధ వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు. బ్రిటన్ వైద్యుడు రమణ దున్నపునేని ఆధ్వర్యంలో పదిమంది వైద్య బృందంతోపాటు నిమ్స్ కార్డియాథోరాసిక్ విభాగాధిపతి అమరేశ్వరరావు, నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు పాల్గొంటున్నట్లు వివరించారు.
వారం రోజులుగా చిన్నారులకు నిమ్స్ లో UK టీమ్ సర్జరీలు చేసిందన్నారు డాక్టర్స్ టీమ్ లీడర్ డాక్టర్ రమణ. ప్రతిరోజు వెయ్యిమంది చిన్నారులు నిమ్స్ కు వస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు లేక నిమ్స్ కు వస్తున్నారని చెప్పారు. చిన్న పిల్లల చికిత్స రిస్క్ తో కూడుకున్నదని వివరించారు. ఒక్కో చిన్నారికి పుట్టిన 24 గంటల్లో సర్జరీలు చేయాల్సిన కేసులు కూడా ఉంటాయన్నారు. యూకే డాక్టర్స్ టీమ్ బృందానికి ప్రభుత్వం మంచి సపోర్ట్ చేసిందన్నారు. నిమ్స్ లో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు చిన్నారులకు ఫ్రీ టెస్టులు చేస్తున్నారని తెలిపారు.