సోమశిల భక్తులకు సౌలతులు కల్పిస్తాం : భారతీ హోళికేరి

సోమశిల భక్తులకు సౌలతులు కల్పిస్తాం : భారతీ హోళికేరి
  • పురావస్తు శాఖ డైరెక్టర్  భారతీ హోళికేరి

కొల్లాపూర్, వెలుగు: కృష్ణా తీరంలోని సోమశిల లలితా సోమేశ్వరస్వామి ఆలయాలను అభివృద్ధి చేసి భక్తులకు సౌలతులు కల్పిస్తామని పురావస్తు శాఖ డైరెక్టర్  భారతీ హోళికేరి తెలిపారు. సోమవారం సంబంధిత శాఖ అధికారులతో కలిసి ఆమె సోమశిలను సందర్శించారు. సోమశిలకు వచ్చే భక్తులకు విశ్రాంతి గృహాలు ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు కోరారు. 

ప్రైవేట్  కాటేజీల్లో రూమ్స్​ రేట్లు వేలల్లో ఉన్నాయని ఆమెకు వివరించారు. భక్తులు రాత్రి బస చేసేందుకు డార్మెటరీలు నిర్మించాలని,  దేవాలయ సముదాయంలో క్యూ లైన్  నిర్మించాలని కోరారు. మహా శివరాత్రికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, భక్తుల సౌలత్​ కోసం విశ్రాంతి గృహాలు నిర్మించాలని స్థానికులు, ఆలయ కమిటీ సభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావును కోరడంతో, ఆయన ఆదేశాలతో డైరెక్టర్​ ఆలయాన్ని పరిశీలించారు. 

ఆలయ ప్రాంగణంలోని పురాతన రాతి శిల్పాలను చూశారు. వసతి గృహాల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూ లైన్  కోసం రైలింగ్  ఏర్పాటు చేయిస్తామన్నారు. ఆలయ ప్రాంగణంలోని పురావస్తు శాఖ మ్యూజియం, అతిథి గృహాన్ని పరిశీలించి, ప్రభుత్వ అనుమతి లేకుండా సొంత నిర్ణయాలతో ఎలాంటి రిపేర్లు చేయవద్దని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.