ఇక 9.30 గంటలకు స్కూళ్లు.. టైమింగ్స్​లో మార్పు

ఇక 9.30 గంటలకు స్కూళ్లు..   టైమింగ్స్​లో మార్పు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైమరీ స్కూళ్ల టైమింగ్స్  మారాయి. ఇక నుంచి ఉదయం 9.30 గంటలకే బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్కూల్  ఎడ్యుకేషన్  డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైమరీ స్కూళ్లు (ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి) ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 నిమిషాల వరకూ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు (ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి) ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకూ కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

అప్పర్  ప్రైమరీ స్కూళ్లలోని ప్రైమరీ సెక్షన్లకూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 నిమిషాల వరకు బడులు కొనసాగుతాయని తెలిపారు. కాగా, ఇదివరకు ప్రైమరీ స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ, అప్పర్  ప్రైమరీ స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకూ ఉండేవి. అయితే, హైస్కూల్స్  మాత్రం పాత టైం టేబుల్  ప్రకారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకూ కొనసాగుతాయి. రాష్ట్రంలోని అన్ని మేనేజ్ మెంట్ల పరిధుల్లోని స్కూళ్లు ఈ టైమ్ టేబుల్ అమలు చేసేలా ఆర్జేడీలు, డీఈఓలు చూడాలని ఆదేశాలిచ్చారు. 

జంట నగరాల్లో పాత టైం టేబులే

హైదరాబాద్, సికింద్రాబాద్  జంట నగరాల పరిధిలో మాత్రం పాత టైం టేబులే కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రైమరీ స్కూళ్లు ఉదయం 8.45 నుంచి మధ్యాహ్నం 3.45 గంటల వరకూ, అప్పర్  ప్రైమరీ స్కూళ్లు ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగుతాయి. నగరంలోని ట్రాఫిక్ నేపథ్యంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే.. జంట నగరాల్లో కొంత ముందుగానే బడులు ప్రారంభమవుతాయి. 

కొత్త టైమింగ్స్​పై టీచర్  సంఘాల అభ్యంతరం

ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ స్కూల్  టైమింగ్స్ మార్చడం అశాస్ర్తీయమని, ఆ దిశగా జారీచేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని టీఎస్​యూటీఎఫ్​, టీఆర్టీయూ, టీఎస్టీయూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ టైం టేబుల్  కొద్దిమంది టీచర్లకు మాత్రమే ఉపయోగపడొచ్చని, స్టూడెంట్లకు, పేరెంట్స్ కు ఏమాత్రం ఉపయోపడదని పేర్కొన్నాయి. కాగా, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పుడు  చర్చించి నిర్ణయించిన టైమింగ్స్​ను మార్చడం విచారకరమని యూటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి అన్నారు. టైమింగ్స్  మారుస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని టీఆర్టీఎఫ్  రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి కటకం రమేశ్,  పాత టైమింగ్సే కొనసాగించాలని టీఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి కోరారు.