గుండెనొప్పితోనే 50 మందిని కాపాడిన ఆర్టీసీ బస్సు డ్రైవర్.. ఆ తర్వాత..

గుండెనొప్పితోనే 50 మందిని కాపాడిన ఆర్టీసీ బస్సు డ్రైవర్.. ఆ తర్వాత..

అది ఆర్టీసీ బస్సు.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళుతుంది.. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. కల్లూరు ప్రాంతం దగ్గరకు రాగానే.. బస్సు నడుపుతున్న డ్రైవర్ కు గుండెనొప్పి వచ్చింది. బస్సులో ప్రయాణికులు.. మరో వైపు డ్రైవర్ కు గుండెనొప్పి.. అంత బాధలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు డ్రైవర్ శ్రీనివాసరావు. ఒంట్లో బాగోలేదని తెలిసిన వెంటనే.. బస్సును నేరుగా కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. 

ఒంట్లో బాగోలేదని ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. వెంటనే ఆస్పత్రికి సిబ్బంది ట్రీట్ మెంట్ ప్రారంభించారు.. తీవ్ర గుండెపోటు కారణంగా ఆస్పత్రిలోనే.. నిమిషాల్లోనే కన్నుమూశాడు ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరావు. ఒంట్లో బాగోలేదని.. ఏదో తేడాగా ఉందని సరైన సమయంలో గుర్తించటంతో.. బస్సులోని 50 మంది ప్రయాణికులను కూడా కాపాడినట్లు అయ్యింది.

వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా వేంసూరు మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన కాకాని శ్రీనివాసరావు సత్తుపల్లి ఆర్టీసీ డిపో పరిధిలోని అద్దె బస్సుకు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలో సత్తుపల్లి నుండి ఖమ్మం వైపు ప్రయాణికులతో వెళ్తుండగా గుండెలో నొప్పి వస్తుండటంతో బస్సును కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆపాడు.

 ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తీవ్ర గుండెపోటుకు గురై శ్రీనివాసరావు మృతి చెందాడు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం కలిగించకుండా గుండెపోటుకు గురైనప్పటికీ ఆస్పత్రి వద్ద బస్సును సురక్షితంగా నిలిపడంతో పెను ప్రమాదం తప్పింది. శ్రీనివాస రావుకు విధుల పట్ల ఉన్న నిబద్ధతను ప్రశంసిస్తూనే ప్రయాణికులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.