
హైదరాబాద్ నాంపల్లి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. ఆస్పత్రిలో నిన్న 92 మంది చిన్నారులకు టీకాలు వేశారు. దీంతో 32 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. రెండు నెలల బాబు చనిపోయాడు. ప్రస్తుతం పిల్లలు నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పిల్లల పరిస్థితిపై నీలోఫర్ సూపరింటెండెంట్ మురళీ కృష్ణ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. వ్యాక్సిన్ తర్వాత జ్వరం రాకుండా ఇవ్వాల్సిన మందు పారాసిటమాల్ కు బదులు ట్రెమడాల్ టాబ్లెట్లు ఇచ్చారన్నారు. పిల్లలకు ఆ టాబ్లెట్ డోస్ ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురయ్యారన్నారు మురళీ కృష్ణ. చిన్నారులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.
నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు జీహెచ్ ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్. చిన్నారుల అస్వస్థతకు కారణాలపై విచారణ జరుపుతున్నామన్నారు. వాక్సిన్ వికటించలేదని చెప్పారు.
నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు బీజేపీ నేతలు. టీకాలు వికటించి చిన్నారి చనిపోవడం దురదృష్ట కరమన్నారు. అవగాహన లేకుండా మందులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చిన్నారుల అస్వస్థతకు సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతుందన్న డాక్టర్లు…. త్వరగా కోలుకునేందుకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.