ఇప్పుడే వద్దని అమ్మాయిలు… ఎప్పుడా అని అబ్బాయిలు

ఇప్పుడే వద్దని అమ్మాయిలు… ఎప్పుడా అని అబ్బాయిలు

30 ఏండ్లు దాటినా సోలో బతుకుకే ఆడపిల్లల మొగ్గు
ధ్యాసంతా చదువు, కెరీర్ మీదనే
తగిన వరుడు దొరికే దాకా వెయిటింగ్
పిల్ల దొరకడం లేదంటూ మగవాళ్ల కలవరం
మ్యారేజ్ బ్యూరోల చుట్టూ చక్కర్లు
పెం డ్లి కాక పెరుగుతున్న అబ్బాయిల సూసైడ్స్‌‌అనుకున్న

‘ఇప్పుడే నాకు పెండ్లికి తొందరేంది? కెరీర్ ముఖ్యం’ అని అమ్మాయిలు చెబుతుంటే… ‘లగ్గం చేసుకుందమంటే పిల్ల దొర్కుతలేదు.. ఏజ్​ మీదపడితే ఇంకా కష్టం’ అని అబ్బాయిలు మనాది పెట్టుకుంటున్నారు. కొన్నేళ్లుగా పెండ్లి విషయంలో ఆడ, మగవాళ్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు 30 ఏండ్లు దాటుతున్నా పెండ్లికి ఒప్పుకోని అమ్మాయిల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంటే.. అటు 30 ఏండ్లు దాటకముందే ఇంకా తమకు పెండ్లయితలేదని కలవరపడే అబ్బాయిల సంఖ్య అదే స్థాయిలో పెరిగిపోతోందని ఓ స్టడీలో తేలింది. ఒక వైపు తమ అభిప్రాయాన్ని కాదనే పెద్దలపై ఏకంగా పోలీసులకు అమ్మాయిలు ఫిర్యాదులు చేస్తుంటే.. తమకు లగ్గమైతలేదని అబ్బాయిలు సూసైడ్​ చేసుకుంటున్న సంఘటనలూ ఉన్నాయి. హయ్యర్​ స్టడీస్, కొలువులు, సెటిల్మెంట్, మంచి అబ్బాయి దొరికాలిగా.. వంటి వివిధ కారణాలు చెప్తూ అమ్మాయిలు 30ఏండ్ల దాటినా సోలో బతుకే సో బెటర్​ అంటున్నారు. అబ్బాయిలు మాత్రం ఇంకా తమకు బ్యాచిలర్​ లైఫ్​  ఎన్నాళ్లంటూ కుంగిపోతున్నారు.

హైదరాబాద్‌‌, వెలుగుఈ తరం అమ్మాయిలు పెండ్లీడు దాటుతున్నా పెండ్లి చేసుకునేందుకు పెద్దగా ఇంట్రస్ట్​ చూపడం లేదు. ‘అప్పుడే పెండ్లేంది?’ అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. అబ్బాయిలు మాత్రం పిల్ల కోసం  మ్యారేజ్​ బ్యూరోల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ  ‘పెండ్లికాని ప్రసాద్​’లుగా మిగిలిపోతామేమోనని ఆందోళన చెందుతున్నారు.

రిజెక్ట్​ చేస్తున్న అమ్మాయిలు

ఒకప్పుడు తల్లిదండ్రులు చూపించిన వరుడినే మరో మాట లేకుండా వివాహం చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రస్తుతం 30 ఏండ్లు వచ్చినా అమ్మాయిలు పెండ్లికి నిరాకరిస్తున్నారు. పెద్దలు ఎన్ని సంబంధాలు తెచ్చినా వారు రిజెక్ట్​ చేస్తున్నారు. అప్పుడే పెండ్లి చేసుకుంటే స్వేచ్ఛను కోల్పోతామని చాలా మంది అమ్మాయిలు భావిస్తున్నారు. ముఖ్యంగా సిటీ అమ్మాయిల్లో ఈ భావన ఎక్కువగా ఉంది. చాలా మంది గర్ల్స్​ పెళ్లంటే నూరేండ్ల పంట కాదు జీవితాంతం మంట అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సైకాలజిస్టులు చెప్తున్నారు. చేసేదేమీ లేక అమ్మాయిల అభిప్రాయానికే తల్లిదండ్రులు యెస్‌‌ చెబుతున్నారు. ఒక వేళ బలవంత పెట్టినా ప్రతిఘటిస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. నవంబర్‌‌ 17న ఇష్టం లేకున్నా అమ్మానాన్నలు వివాహం చేస్తున్నారని వికారాబాద్‌‌ జిల్లాలో ఓ యువతి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇంకా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాలని, తన పెండ్లి ఆపాలని కంప్లెయింట్‌‌ చేసింది.

ఇలాంటి వరుడైతే ఓకే.. కానీ..!

కెరీర్, కాబోయే భర్త విషయంలో అమ్మాయిలు చాలా క్లారిటీగా ఉంటున్నారు. తాము అనుకున్న లక్షణాలున్న వరుడు దొరికేదాకా ఆగుతున్నారు. ఒకవేళ అలాంటి అబ్బాయి దొరికినా.. ఏ మాత్రం తొందరపడటం లేదు. లైఫ్​లో సెటిలయ్యాకే పెండ్లి చేసుకోవాలని ఫిక్స్​ అవుతున్నారు. ఎలాంటి అబ్బాయిని అమ్మాయిలు కోరుకుంటున్నారంటే..

కాబోయే భర్త తల్లిదండ్రులకు దూరంగా సిటీలో జాబ్​ చేయాలి. గ్రామాలను అంటిపెట్టుకుని ఉండొద్దు.
హైదరాబాద్‌‌, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో సెటిలైతే ఇంకా మంచిది.
ఎన్ని ఆస్తులున్నా వ్యాపారం చేసే అబ్బాయికంటే జాబ్​ చేసేవాడే కావాలి.
తనకంటే మంచి చదువు చదివి ఉండాలి. మంచి జీతం సంపాదిస్తూ ఉండాలి.
వ్యవసాయం చేసే వ్యక్తి వద్దు. సివిల్‌‌, మెకానికల్‌‌ ఉద్యోగాల కంటే సాఫ్ట్‌‌వేర్‌‌ ఉద్యోగులైతేనే మేలు. సర్కారు కొలువైతే ఇంకా బెటర్​.

అబ్బాయిలకు పెండ్లి బెంగ

ఓ వైపు పెళ్లీడు దాటినా అమ్మాయిలు పెళ్లికి నో చెబుతుంటే.. మరో వైపు అబ్బాయిలు మాత్రం తమకు పెండ్లి కావడం లేదని బెంగ పెట్టుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం సంపాదించేసరికి ఏజ్‌‌ బార్‌‌ అవుతుందని, అప్పుడు పిల్ల దొరుకుతదో లేదని కలవరపడుతున్నారు. ‘ఉద్యోగం సంపాదించేసరికి సగం జీవితం గడిచిపోతోంది. పెండ్లికి దూరంగా ఉండి ఎంత సాధిస్తే ఏం లాభం. పిల్ల దొరకడంలేదు. పెండ్లికావడంలేదు’ అని అబ్బాయిలు మదనపడుతున్నారు. 35 నుంచి 40 ఏండ్లు దాటినా పెండ్లి కావడంలేదని మనస్తాపానికి గురవుతున్నారు. ఇంకొందరు మాత్రం ఏకంగా 20 నుంచి 25 ఏండ్లకే పెండ్లి కోసం మ్యారేజ్​ బ్యూరోల చుట్టూ తిరుగుతున్నారు. ‘మావోడికి పిల్లను ఉంటే చూసిపెట్టుండ్రి’ అంటూ వాళ్ల తల్లిదండ్రులు తమకు తెలిసినవాళ్లందరికీ చెబుతున్నారు. కొన్ని కుటుంబాల్లోనైతే అమ్మాయిలు తక్కువగా ఉండటంతో అబ్బాయిలకు పిల్ల దొరకడం చాలా కష్టంగా మారింది.  తనకు పెండ్లి కావడం లేదన్న మనస్తాపంతో జనవరి 24న హైదరాబాద్​లోని ఓల్డ్ హఫీజ్ పేటకు చెందిన  రమేశ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి వయసు  20 నుంచి 25ఏండ్ల లోపు మాత్రమే. ఈ మధ్యనే హైదరాబాద్​లోని ఫారూఖ్​నగర్​కు చెందిన మహ్మద్​ షరీఫ్​, రామంతపూర్​కు చెందిన నిఖిల్​ కూడా ఇలానే సూసైడ్​ చేసుకున్నారు. వాళ్లిద్దరి వయసు కూడా 23 నుంచి 27ఏండ్ల లోపే. ఏపీలోని విజయనగరానికి చెందిన 30 ఏండ్ల సురేశ్​ కూడా పెండ్లి కావడంలేదన్న బెంగతోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

వాళ్లు చేసుకోకపోవడంతో వీళ్లకు కావడంలేదు

ఇప్పటిదాకా 11వేల పెండ్లిళ్లు చేశాను. గతంలో మాదిరి ఇప్పుడు అమ్మాయిలు చెప్పంగనే పెండ్లి చేసుకోవడంలేదు. తొందరపడి ఒప్పుకోవడంలేదు. వారికి నచ్చిన వ్యక్తి దొరికే వరకు ఆగుతున్నారు. చాలా మంది అమ్మాయిలు తాము చెబితే వినే వాడు కావాలని కోరుకుంటున్నారు. 100లో 98మంది ఇలానే ఉన్నారు. అమ్మాయిలు 30 ఏండ్లు వచ్చే వరకు పెండ్లిళ్లు చేసుకోకపోవడంతో అబ్బాయిలకు వధువులు దొరకడం లేదు.                                                      – నారాయణశాస్త్రి, శ్రీనివాస్‌‌ మ్యారేజ్‌‌ బ్యూరో, హైదరాబాద్‌‌

అనుకున్న వరుడు దొరక్క ఆగుతున్నరు

పెండ్లికి అమ్మాయిలు ఏ మాత్రం తొందరపడటం లేదు. మ్యారేజ్‌‌ లైఫ్‌‌ను సెక్యూరిటీగా ఫీల్‌‌ కావడంలేదు. వాళ్లకు సెట్‌‌ అయ్యే అబ్బాయి దొరికే దాకా వెయిట్‌‌ చేస్తున్నారు. నమ్మకమైన, స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నారు. 30 ఏండ్లు వచ్చేదాకా ఆగుతున్నారు. ఇక అబ్బాయిలు చదువు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏజ్‌‌ బార్‌‌ అవుతోంది. అబ్బాయిల పెండ్లిళ్లు 35 నుంచి 40 మధ్య అవుతున్నాయి. దీంతో వారు ఇబ్బందిగా ఫీల్‌‌ అవుతున్నారు. కొన్ని వర్గాల్లో వారికి పిల్ల దొరకడం కష్టంగా మారింది.                                                                                         – హిప్నో కమలాకర్‌‌, సైకాలజిస్ట్‌‌

మరిన్ని వార్తల కోసం