బీఆర్ఎస్, ఆప్ మధ్య ఆర్థిక లావాదేవీలు వెల్లడిస్త : సుఖేశ్ చంద్రశేఖర్

బీఆర్ఎస్, ఆప్ మధ్య ఆర్థిక లావాదేవీలు వెల్లడిస్త : సుఖేశ్ చంద్రశేఖర్

న్యూఢిల్లీ, వెలుగు:  మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ విడుదల చేశారు. తాను హైదరాబాద్ లోని బీఆర్ఎస్ హెడ్ ఆఫీసులో రూ.15 కోట్లు ఇచ్చింది.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన అరుణ్ రామచంద్ర పిళ్లైకి అని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్సీ స్టిక్కర్ తో బీఆర్ఎస్ ఆఫీసులో పార్క్ చేసిన రేంజ్ రోవర్ (6060 నెంబర్) కారులో ఆ డబ్బులు పెట్టినట్లు తెలిపారు. ఈ మేరకు రెండు పేజీల లేఖను సుఖేశ్ రిలీజ్ చేశారు. బీఆర్ఎస్, ఆప్ మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించి వచ్చే వారం వాట్సాప్ చాట్స్ ను రిలీజ్ చేస్తానని.. సోమవారం సీబీఐ, ఈడీకి మొదటి చాట్ ను అందజేస్తానని అందులో పేర్కొన్నారు. ‘‘గత వారం చెప్పినట్టుగా 703 పేజీల వాట్సాప్ చాట్ ను త్వరలో విడుదల చేస్తాను. ఇందులో నాకు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కు మధ్య జరిగిన చాట్స్​ ఉంటాయి. ఈ వివరాలు స్టార్టర్స్ మాత్రమే. ఇందులో బీఆర్ఎస్ ఆఫీసులో రూ.15 కోట్లు ఇవ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ఇచ్చిన ఆదేశాలు.. డబ్బులు అందిన తర్వాత బీఆర్ఎస్ లీడర్ అంగీకారం, ధ్రువీకరణ టోకెన్ వివరాలు ఉంటాయి” అని తెలిపారు. 

వాట్సాప్ చాట్స్ లో అన్ని బయటపడ్తయ్..  

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న సౌత్ గ్రూప్, ఆ గ్రూపుతో సంబంధం ఉన్న నేతతో కేజ్రీవాల్ కు ఉన్న అనుబంధాన్ని తన వాట్సాప్ చాట్స్ స్పష్టంగా వెల్లడిస్తాయని సుఖేశ్ లేఖలో పేర్కొన్నారు. ఆ బీఆర్ఎస్ లీడర్ ‘15 కేజీల ఘీ’ పేరుతో రూ.15 కోట్లను ఏపీకి చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఎలా డెలివరీ చేయాలో సూచించిన వివరాలూ ఉంటాయని తెలిపారు.  తాను రిలీజ్ చేయనున్న వాట్సాప్ స్ర్కీన్ చాట్స్ బీఆర్ఎస్, ఆప్ నేతల మధ్య ఆర్థిక సంబంధాలను వెల్లడిస్తాయని చెప్పారు. అలాగే వీరిద్దరూ చేతులు కలిపిన తీరు, నేరుగా ఆర్థిక లావాదేవీలు ఎలా కలిగి ఉన్నారో చాట్స్ లో స్పష్టంగా తెలుస్తుందన్నారు. 

ఏ టెస్టుకైనా సిద్ధం..   

కేజ్రీవాల్, సత్యేందర్ జైన్, ఆప్ తో సంబంధం కలిగిన బీఆర్ఎస్ నేతలతో కలిసి నార్కో, పాలీగ్రాఫ్ లేదా మరేదైనా టెస్టుకైనా సిద్ధంగా ఉన్నానని సుఖేశ్ లేఖలో పేర్కొన్నారు. తాను కేవలం మాట్లాడడం లేదని, 2015–2023 మధ్య జరిగిన ప్రతి అంశానికి ఆధారాలు ఇస్తున్నానని తెలిపారు. ‘‘కేజ్రీవాల్.. మీ, మీ సహచరుల రహస్యాలను బహిర్గతం చేయబోతున్నాను. మీ సీట్ బెల్ట్‌‌లు పెట్టుకోండి.. కౌంట్‌‌డౌన్ ప్రారంభమైంది. టీజర్ స్క్రీన్ షాట్ నెంబర్ 1 విడుదలైన తర్వాత మిమ్మల్ని, మీ స్నేహితులను ఏడుపు, నిందలతో చూడడం ఉత్సాహంగా ఉంటుంది’’  అని అన్నారు.  సుఖేశ్ రిలీజ్ చేసిన లేఖలోని అంశాలపై ఆయన అడ్వకేట్ అనంత్ మాలిక్ వీడియో రిలీజ్ చేశారు.