నెలరోజులుగా ఆస్పత్రుల పాలవుతున్న సింగరేణీయులు

నెలరోజులుగా ఆస్పత్రుల పాలవుతున్న సింగరేణీయులు
  • సింగరేణి కాలనీల్లోని 50వేల ఇళ్లకు రంగు మారిన నీరు సరఫరా
  • గోదావరి వాటర్​లో ఐరన్ కంటెంట్ పెరిగినందునే అంటున్న సింగరేణి ఆఫీసర్లు
  • అలాంటిదేమీ లేదంటున్న పీసీబీ ఆఫీసర్లు

గోదావరిఖని/మందమర్రి, వెలుగు: మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని సింగరేణి కాలనీలకు సప్లై చేస్తున్న నీళ్లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. గోదావరి పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నదీ జలాలను ఎంత శుద్ధి చేసినా ఉపయోగం ఉండట్లేదు. దీంతో బెల్లంపల్లి, రామగుండం రీజియన్లలోని 50 వేల ఇండ్లకు రంగుమారిన నీళ్లు సప్లై అవుతున్నాయి. ఫలితంగా రామగుండం, గోదావరిఖని, యైటింక్లయిన్‌‌కాలనీ, సెంటినరీ కాలనీ, మంచిర్యాల, శ్రీరాంపూర్‌‌, నస్పూర్‌‌, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లోని ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు.

సింగరేణి యాజమాన్యం గోదావరి నది ఒడ్డున ఉన్న ఫిల్టర్​బెడ్ నుంచి రామగుండం రీజియన్ కు డైలీ17 మిలియన్ లీటర్లు సప్లై చేస్తోంది. ఇన్‌‌ఫిల్ట్రేషన్‌ గ్యాలరీల నుంచి నీటిని నాలుగు మోటర్ల ద్వారా బయటకు తీసి క్లోరినేషన్ చేసి అందిస్తోంది. కాగా గోదావరిఖని, రామగుండం, ఎన్టీపీసీ తదితర ప్రాంతాల నుంచి డైలీ 44 ఎంఎల్‌డీ మురుగు నదిలో కలుస్తోంది. ఎన్టీపీసీ సంస్థకు చెందిన బూడిద నీరు, కొత్తగా ఏర్పడిన ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ఎరువుల ఫ్యాక్టరీ నుంచి ఆమోనియా కలిసిన నీరు నేరుగా గోదావరిలోకే చేరుతోంది. ఈ ప్రాంతాల్లో ఎక్కడా కూడా సీవరేజ్‌‌ట్రీట్‌‌మెంట్‌‌ప్లాంట్లు పనిచేయట్లేదు. దీంతో ఎంత శుద్ధి చేసినా నీళ్ల రంగు మారట్లేదు. దుర్వాసనతో కార్మికుల ఇండ్లకు సప్లై అవుతున్నాయి. వాటిని తాగినవారు వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నారు. 
నెల రోజులుగా రంగు మారిన నీళ్లే
మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, నస్పూర్, రామకృష్ణాపూర్, మందమర్రి ప్రాంతాల్లోని సింగరేణి కార్మిక వాడలకు నెల రోజులుగా కలుషిత నీరు సప్లై అవుతోంది. నల్లాల్లో పూర్తిగా రంగుమారిన నీళ్లు వస్తుండడంతో కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. క్వార్టర్లలోని నీళ్ల ట్యాంకుల అడుగు భాగాన బురద పేరుకుపోతోంది. ఇప్పటికే వాటిని తాగిన పలువురు డయేరియా బారిన పడ్డారు. గోదావరి నుంచి వచ్చే నీటిలో ఐరన్ శాతం పెరగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని సింగరేణి ఆఫీసర్లు చెబుతున్నారు. ఈనెల15న శ్రీరాంపూర్ ఏరియాలోని నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్​కాలేజీకి సప్లయ్​అయిన కలుషిత నీరు తాగి దాదాపు 50 మంది స్టూడెంట్లకు వాంతులు, విరోచనాలు అయ్యాయి.
మిషన్‌ ‌భగీరథ ఊసే లేదు
సింగరేణిని ఏటీఎంగా వాడుకుంటున్న తెలంగాణ సర్కార్‌ కార్మిక కుటుంబాలకు మాత్రం మిషన్‌‌ భగీరథ నీళ్లు ఇవ్వట్లేదు. ఏటా సీఎస్‌‌ఆర్, డీఎంఎఫ్‌‌టీ కింద కోట్ల రూపాయలు తీసుకుంటుందే తప్ప కార్మిక క్వార్టర్లకు ప్రభుత్వ స్కీంను వర్తింపజేయట్లేదు. 2019లో గోదావరిఖనిలో రూ.2.6 కోట్లతో 2.3 కిలోమీటర్ల దూరం పైపులైన్లు వేసి సింగరేణి క్వార్టర్లకు కేవలం ఐదు రోజుల పాటు భగీరథ నీళ్లు ఇచ్చింది. తర్వాత సింగరేణి మేనేజ్‌‌మెంటే ‌సొంతంగా ఫిల్టర్‌ ‌బెడ్లు తయారు చేసుకుని నీటిని సప్లై చేస్తోంది. గోదావరి నది నుంచి సప్లై చేస్తున్న నీళ్లు తాగలేక కొందరు కార్మికులు బయట కొనుక్కుని తాగుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి కార్మిక ప్రాంతాల్లో మిషన్ భగీరథ పైపులైన్లు వేసి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు వాటర్ సప్లయ్​చేయలేదు.
శాంపిల్స్‌‌ సేకరణ
సింగరేణి కార్మికులు డయేరియా బారిన పడుతుండడంతో మేనేజ్‌‌మెంట్‌‌అప్రమత్తమైంది. సోమవారం గోదావరిఖని, యైటింక్లయిన్‌ ‌కాలనీలోని క్వార్టర్లు, ఫిల్టర్‌‌బెడ్‌‌ల వద్ద వాటర్‌‌శాంపిళ్లు తీసుకుంది. వరంగల్​లోని ల్యాబ్‌‌తోపాటు మంచిర్యాలలోని వాటర్‌‌క్వాలిటీ మానిటరింగ్‌‌ల్యాబ్‌‌కు పంపించింది. జనరల్‌‌రిపోర్టు‌తోపాటు బయోలాజికల్‌‌అనాలసిస్‌ ‌రిపోర్టును తెప్పించి దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సింగరేణి ఆఫీసర్లు చెప్పారు. 
పాత పద్ధతితోనే ప్రాబ్లమ్
నీటి శుద్ధి ప్రక్రియలో పాత పద్ధతిని అనుసరించడంతోనే రంగు మారి సప్లై అవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం తర్వాత నది నిండుగా ఉంటోంది. సింగరేణి కంపెనీ ఇసుకలో వేసిన పైపులైన్లు పూర్తిగా మునిగిపోయాయి. గోదావరినది ఒడ్డున ఉన్న సింగరేణి ఇన్​ఫిల్ట్రేషన్ గ్యాలరీలపైన ఉన్న మూతలు గత వర్షాకాలంలో వరదలకు కొట్టుకుపోయాయి. దీంతో నదిలోని నీళ్లు గ్యాలరీలోకి చేరి ఆ నీటిని ఎంత ఫిల్టర్ చేసినా ఫలితం కానరావడం లేదు. 
ఐరన్​ శాతం ఎక్కువగా ఉంది
కార్మిక వాడలకు సప్లై అయిన రంగు నీళ్లను గవర్నమెంట్ ల్యాబ్​కు పంపించాం. నీటిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉందని తెలిసింది. నిల్వ ఉండటంతోనే రంగు మారుతున్నాయి. తాగునీటిలో ఆరోగ్య ప్రమాణాల ప్రకారం 0.3 నుంచి 0.6 పీపీఎం ఐరన్ ఉండాలి. ఇక్కడి తాగునీటి శాంపిళ్లను పరిశీలిస్తే 1.0 పీపీఎంగా వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. రంగు నీళ్లను వాడకుండా సీతారాంపల్లి ఆర్జీఎఫ్​నుంచి వాటర్​సప్లయ్​కు​ఏర్పాట్లు చేశాం. - శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి జీఎం ఎం.సురేశ్
గోదావరి నీళ్లలో ఐరన్‌ ‌కంటెంట్ లేదు
ఇరువైపులా ఉన్న పరిశ్రమలు, ఇండ్ల నుంచి వచ్చే వ్యర్థాలతో గోదావరి నది పొల్యూట్​అవుతోంది. అయితే ఈ నీటిని ప్రతి నెలా వరంగల్‌‌ల్యాబ్‌‌కు పంపించి టెస్ట్‌‌ చేయిస్తున్నాం. ఈ నీటిని ట్రీట్‌‌మెంట్‌‌చేసి క్లోరినేషన్ చేస్తేనే తాగడానికి వీలుంటుంది. కానీ నీటిలో ఐరన్‌‌, మెర్క్యూరీ, కాపర్‌‌వంటి లోహాల కంటెంట్‌‌లేదు. శాంపిల్​తీసి మరోసారి టెస్ట్‌ ‌చేయిస్తాం. – రవిదాస్‌‌, ఈఈ, పొల్యూషన్ కంట్రోల్‌‌ బోర్డు