- డిజిన్వెస్ట్‌మెంట్‌పై సలహాలిచ్చిన సీఐఐ
- అన్ని ప్రభుత్వ కంపెనీల్లో వాటాలను 51 శాతానికి తగ్గించుకోవాలని సూచన
- ధనవంతులపై సర్‌ఛార్జీలు పెంచొద్దు: ట్యాక్స్ నిపుణులు
- ఎరువులన్నింటిపై 5 శాతం జీఎస్‌టీ వేయండి
- బయోగ్యాస్ ఇండస్ట్రీకి క్యాపిటల్ సబ్సిడీ అవసరం
న్యూఢిల్లీ: బడ్జెట్ దగ్గర పడుతుండడంతో వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు తమ ప్రతిపాదనలను కేంద్రానికి పంపుతున్నాయి. సబ్సిడీ పెంచాలనో, ట్యాక్స్ తగ్గించాలనో లేదా ఇతర అంశాలపైనో సలహాలు ఇస్తున్నాయి. తాజాగా సీఐఐ కేంద్రానికి తన ప్రతిపాదనలు పంపింది. పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎస్‌ఈల) డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా షేర్‌హోల్డర్ల విలువను పెంచడానికి కేంద్రం వేగవంతమైన విధానాలను అనుసరించాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సూచించింది. డిమాండ్ ఆధారంగా ప్రైవేటీకరించే సంస్థలను ఎంచుకోవాలని తెలిపింది.
అలాగే ముందస్తు రోడ్‌మ్యాప్ అవసరమని పేర్కొంది. 2026–-27 యూనియన్ బడ్జెట్ కోసం సమర్పించిన ప్రతిపాదనల్లో, ప్రైవేటీకరణను సెక్టార్ల వారీగా అమలు చేయాలని, ప్రైవేట్ పార్టిసిపేషన్ ద్వారా సంస్థల సామర్థ్యం, టెక్నాలజీ, గ్లోబల్ పోటీ సామర్థ్యం పెరుగుతుందని తెలిపింది. సీఐఐ ప్రకారం, ప్రభుత్వం మూడు సంవత్సరాల ప్రైవేటీకరణ పైప్‌లైన్‌ను ప్రకటిస్తే, ఇన్వెస్టర్లకు స్పష్టత లభిస్తుంది. అలానే ఈ సంస్థల వాస్తవిక విలువను నిర్ధారించొచ్చు. ధర కనుగొనడం సులభమవుతుంది. ప్రభుత్వం లిస్టెడ్ పీఎస్‌ఈలలో వాటాను దశలవారీగా 51శాతానికి తగ్గించి, తరువాత 33–26శాతం వరకు తగ్గించొచ్చు. 78 లిస్టెడ్ పీఎస్‌ఈలలో వాటాను 51శాతానికి తగ్గిస్తే సుమారు రూ.10 లక్షల కోట్లు సేకరించొచ్చు. మొదటి రెండు సంవత్సరాల్లో 55 పీఎస్‌ఈలలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.4.6 లక్షల కోట్లు, తరువాత 23 పీఎస్‌ఈలలో రూ.5.4 లక్షల కోట్లు సమీకరించొచ్చు. “ప్రభుత్వ వాటాను 51 శాతం లేదా అంతకంటే తక్కువకు తగ్గించడంతో సంస్థల్లో స్ట్రాటజిక్ కంట్రోల్ ఉంటుంది. అలానే విలువను పెంచొచ్చు. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రాసెస్‌తో సంస్థల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగువతుంది. సామాజిక అభివృద్ధి, ఫిస్కల్ కన్సాలిడేషన్ వేగవంతమవుతాయి” అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ఇన్వెస్టర్ ఆసక్తిని ముందుగా అంచనా వేసి, బలమైన డిమాండ్ ఉన్న యూనిట్లను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించింది. అలాగే, ప్రైవేటీకరణను ప్రొఫెషనల్‌గా నిర్వహించడానికి ప్రత్యేక సంస్థ, మంత్రివర్గ బోర్డు, ఇండస్ట్రీ-లీగల్ నిపుణుల సలహా బోర్డు, ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ టీమ్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ (ఐబీఏ) రాబోయే బడ్జెట్‌లో బయోగ్యాస్ పరిశ్రమకు రూ.10 వేల కోట్ల నిధి ఏర్పాటు చేసి క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం 4.8 టన్స్ పెర్ డే (టీపీడీ) కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్‌కు రూ.4 కోట్లు సబ్సిడీ ఉన్న చోట, దాన్ని 50శాతం పెంచి రూ.6 కోట్లు చేయాలని, ప్రాజెక్ట్‌కు గరిష్ట పరిమితిని రూ.25 కోట్లుగా నిర్ణయించాలని సూచించింది. ప్రస్తుతం రూ.10 కోట్ల లోపు ఉన్న ప్రాజెక్టులకే సబ్సిడీ అందుతోంది. 2028 నాటికి ఎరువులలో కనీసం 5శాతం ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మన్యూర్ (ఎఫ్‌ఓఎం) మిశ్రమం తప్పనిసరి చేసి, 2030 నాటికి 10శాతానికి దీనిని పెంచాలని ప్రతిపాదించింది.
వన్ నేషన్ వన్ లైసెన్స్ అవసరం
రానున్న బడ్జెట్‌లో అన్ని ఎరువులకు 5శాతం జీఎస్‌టీ వర్తింపజేయాలని, జీఎస్‌టీ క్రెడిట్ రీఫండ్‌లను వేగవంతం చేయాలని, ‘వన్ నేషన్, వన్ లైసెన్స్’ విధానం అమలు చేయాలని ఇండియన్ మైక్రో-ఫర్టిలైజర్స్ (ఎరువులు) మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. జీఎస్‌టీ 2.0ను కీలక సంస్కరణగా అభివర్ణిస్తూ, ఇన్‌పుట్స్‌పై అధిక జీఎస్‌టీ వల్ల వర్కింగ్ క్యాపిటల్ ట్యాక్స్ రూపంలో నిలిచిపోతోందని అధ్యక్షుడు రాహుల్ మిర్చందాని తెలిపారు. ఒకే జీఎస్‌టీ రేటు ఉంటే వివాదాలను తగ్గించి, రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు వేగంగా అందించగలమని పేర్కొన్నారు.
ట్యాక్స్ పెరిగితే ధనవంతులు విదేశాలకే..
ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ధనవంతులపై ఆదాయపన్ను సర్‌చార్జ్ పెంచడం లేదా వెల్త్ ట్యాక్స్ మళ్లీ ప్రవేశపెట్టడం వంటివి చేయొద్దని ట్యాక్స్ నిపుణులు ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఇలాంటి చర్యలు అధిక ఆదాయం కలిగిన వ్యక్తులను తక్కువ పన్ను ఉన్న దేశాలకు వెళ్లేలా ప్రోత్సహిస్తాయని అన్నారు. ప్రస్తుతం ఏడాదికి రూ.50 లక్షల పైగా ఆదాయం ఉన్నవారికి సర్‌చార్జ్ వర్తిస్తోంది. రూ.50 లక్ష- నుంచి రూ.1 కోటి మధ్య ఆదాయం ఉంటే10శాతం, రూ.1–-2 కోట్ల మధ్య ఉంటే 15శాతం, రూ.2-–5 కోట్లు ఉంటే 25శాతం, రూ.5 కోట్లకు పైగా ఆదాయం ఉన్నవారిపై కొత్త పన్ను విధానంలో 25శాతం, పాత విధానంలో 37శాతం సర్‌చార్జ్ పడుతోంది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ.50 లక్షలకు పైగా ఆదాయంపై 30 శాతం ట్యాక్స్, సర్ ఛార్జీ, సెస్ వంటివి పడుతున్నాయి.
