- కేవైసీ రూల్స్ కఠినం చేయాలని క్రిప్టో ఎక్స్చేంజ్‌లకు ఎఫ్‌ఐయూ ఆదేశం
- ట్రాన్సాక్షన్ల మూలాలను దాచిపెట్టే సర్వీస్‌లు బంద్
న్యూఢిల్లీ: క్రిప్టో ఎక్చేంజ్‌లపై నిఘా పెంచేందుకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ) కఠినమైన కొత్త యాంటి- మనీ లాండరింగ్ (ఏఎంఎల్), నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను తీసుకొచ్చింది. అక్రమ కార్యకలాపాలను అరికట్టడమే దీని లక్ష్యం. ఈ మార్గదర్శకాలు ప్రకారం, ఇక నుంచి క్రిప్టో ఎక్స్చేంజీలను వర్చువల్ డిజిటల్ అసెట్ (వీడీఏ) సర్వీస్ ప్రొవైడర్స్‌గా పరిగణిస్తారు. క్రిప్టో ఎక్స్చేంజ్‌లు కస్టమర్ల కేవైసీలో డాక్యుమెంట్ అప్‌లోడ్‌తో పాటు, వీరి లైవ్ సెల్ఫీ (కంటి రెప్పలు మూయడం లేదా తల కదలించడం ద్వారా) కూడా తీసుకోవాలి. ఇది డీప్‌ఫేక్ లేదా స్టిల్ ఫోటోలను నివారిస్తుంది. యూజర్ల అకౌంట్ క్రియేషన్ సమయంలో లాటిట్యూడ్, లాంగిట్యూడ్, తేదీ, టైమ్‌స్టాంప్, ఐపీ అడ్రెస్ రికార్డ్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉందో లేదో నిర్ధారించడానికి “పెన్నీ-డ్రాప్” పద్ధతి (రూ.1 ట్రాన్సాక్షన్) తప్పనిసరి. పాన్‌తో పాటు పాస్‌పోర్ట్, ఆధార్ లేదా ఓటర్ ఐడీ వంటి వివరాలను తీసుకోవాలి. ఈ–మెయిల్, ఫోన్ నంబర్ ఓటీపీ వెరిఫికేషన్ కూడా చేపట్టాలి.
ఐసీఓ, ఐటీఓలకు నో
కేంద్ర ఆర్థికశాఖ కింద పనిచేస్తున్న ఎఫ్‌ఐయూ, ఇనీషియల్ కాయిన్ ఆఫరింగ్స్ (ఐసీఓలు), ఇనీషియల్ టోకెన్ ఆఫరింగ్స్ (ఐటీఓలను) తీసుకురావడంపై రిస్ట్రిక్షన్లు పెట్టింది. ఇవి అతి ప్రమాదకరమైనవని భావిస్తోంది. ఎఫ్‌ఐయూ వద్ద రిజిస్టర్ అయిన అన్ని క్రిప్టో ఎక్స్చేంజ్‌లు అనుమానస్పద ట్రాన్సాక్షన్లపై ఎప్పటికప్పుడు రిపోర్ట్‌లను సబ్మిట్ చేయాలి. క్లయింట్ల రికార్డులను మెయింటైన్ చేసి, మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్షింగ్ వంటివి అడ్డుకోవాలి. కాగా, క్రిప్టో కరెన్సీలు ఇండియాలో లీగల్ టెండర్ కాదు. కానీ ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టాల కింద వీటిపై ట్యాక్స్ పడుతోంది. క్రిప్టో ట్రాన్సాక్షన్ల మూలాలను దాచేందుకు అనానిమిటీ టోకెన్లు, టంబ్లర్లు, మిక్సర్లు వంటి సర్వీస్‌లు క్రిప్టో ఎక్స్చేంజ్‌లలో పనిచేస్తాయి. లావాదేవీల మూలం, యాజమాన్యం, విలువను దాచిపెట్టే ఇలాంటి ప్రయత్నాలకు అనుమతి ఇవ్వొద్దని ఎఫ్‌ఐయూ స్పష్టం చేసింది. ఎక్స్చేంజీలు హై-రిస్క్ కస్టమర్లకు ఆరు నెలలకు ఒకసారి, ఇతరులకు సంవత్సరానికి ఒకసారి కేవైసీ అప్‌డేట్ చేయాలని, ట్యాక్స్ హేవెన్ దేశాలు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) గ్రే/బ్లాక్ లిస్ట్‌లో ఉన్న ప్రాంతాలు, రాజకీయంగా ప్రభావిత వ్యక్తులు (పీఈపీఎస్), ఎన్‌జీఓలు వంటి హై-రిస్క్ కస్టమర్లపై నిఘా పెంచాలని ఆదేశించింది. కస్టమర్ ఐడీ, చిరునామా, ట్రాన్సాక్షన్ వివరాలను కనీసం ఐదు సంవత్సరాలు భద్రపరచాలని, దర్యాప్తు ముగిసే వరకు నిల్వ చేయాలని తెలిపింది.
