చనిపోయి ఏడాదైనా రైతు బీమా అందుతలే

చనిపోయి ఏడాదైనా రైతు బీమా అందుతలే

690 ఫ్యామిలీలకు ఆగిపోయిన క్లెయిమ్స్‌‌
పరిహారం అందక బాధితుల కుటుంబాల అవస్థలు
ప్రీమియం సొమ్ము చెల్లించని రాష్ట్ర సర్కారు
సర్కారు ఆస్పత్రులిచ్చిన డెత్ సర్టిఫికెట్లు చెల్లవంటున్న ఎల్ఐసీ
నా జీవితంలో చేసిన అతిగొప్ప పని రైతు బీమా

తెలంగాణలో ఏ రైతైనా సరే దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ వల్ల ​ కావొచ్చు.. సహజమరణం కావొచ్చు.. వృద్ధాప్యం వల్ల కావొచ్చు.. చనిపోతే  టంచన్​గా పది దినాల్లోపల ఆ రైతు ఇంటికి రూ. 5 లక్షలు చేరుతయ్​. ఏ ఆఫీసుకు పోయే అవసరం లేకుండా..ఎక్కడా దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా..
వాళ్ల అకౌంట్​లో డబ్బులు పడ్తయ్. – రైతు బీమాపై పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్​.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రైతు బీమాకు అప్లై చేసుకున్న రైతులు చనిపోతే.. 24 గంటల్లోగా బాధిత ఫ్యామిలీకి పరిహారం అందాలి. కానీ ఏడాది దాటుతున్నా బాధితులకు ఇన్సూరెన్స్ సొమ్ము అందడం లేదు. రాష్ట్రంలో ఇలా 690 మంది రైతుల కుటుంబాలకు ఇప్పటికీ రూ.34.5 కోట్ల పరిహారం అందలేదు. ఇంటి పెద్ద చనిపోయి ఇక్కట్లు పడుతున్న బాధిత ఫ్యామిలీలు.. బీమా పైసలు అందక అవస్థలు పడుతున్నాయి. ఇన్సూరెన్స్ సొమ్ము కోసం ఆఫీసర్లు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు.

రైతులు బీమాకు అప్లై చేసుకున్నా సర్కారు ప్రీమియం చెల్లించలేదు. అరకొరగా ఇస్తున్న నిధులు అందరికీ అందడం లేదు. మరోవైపు ఎల్ఐసీ కొర్రీలు పెడుతోంది. సర్కారు ఆస్పత్రులు ఇచ్చిన డెత్ సర్టిఫికెట్లు చెల్లవని చెబుతూ పరిహారం ఇవ్వడం లేదు. వేరే ఊర్లలో చనిపోతే సొంత గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. స్థానిక పట్టణాల్లో, మున్సిపాలిటీల్లో చనిపోయినా ఇదే పరిస్థితి. దీంతో 2019 డిసెంబర్ నుంచి 2020 ఆగస్టు 13 వరకు ఎన్‌‌రోల్‌‌ చేసుకున్న రైతుల్లో 690 మంది కుటుంబాలకు ఏడాది దాటినా క్లెయిమ్స్‌‌ అందలే. ఈ సమస్యను సర్కారు దృష్టికి వ్యవసాయ శాఖ తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. ఇలా రైతుల కుటుంబాలకు అందాల్సిన రూ.34.50 కోట్ల పరిహారం ఆగిపోయింది.

అన్ని జిల్లాల్లోనూ..

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌ మండలం చిన్నబొంకూరుకు చెందిన వనపర్తి రాజమౌళి డెత్‌‌ సర్టిఫికెట్‌‌ను ఎల్‌‌ఐసీ గుర్తించలేదు. దీంతో బాధిత ఫ్యామిలీకి పరిహారం అందలేదు. నిజామాబాద్ జిల్లాలో 36 మంది, శంషాబాద్‌‌ మండలంలో 6 రైతులు చని పోగా, వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌‌ కాలేదు. నల్లవెల్లి మండలం ఇందల్వాయి  రైతు పాతకుంట తిప్పన చనిపోయి ఏడాదైనా ఎల్‌‌ఐసీ ఐడీ జనరేట్‌‌ కాకపోవడం తో  క్లెయిమ్‌‌ రాలేదు. మెండె ఆశన్న కుటుంబానిది అదే పరిస్థితి. నల్గొండ జిల్లా, కరీంనగర్‌‌ జిల్లాల్లోనూ ఇలాంటి సమస్యే ఉంది. బీమా పరిహారానికి ఆఫీసర్ల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. ఊర్లో భూమి ఉన్నా.. ఉపాధి కోసం కొందరు పట్టణాలకు వెళ్తున్నారు. దీంతో వారి వివరాలు రైతు బీమా సైట్‌‌లో అప్‌‌లోడ్‌‌ కాక పరిహారం అందడం లేదు.

డెత్‌‌ సర్టిఫికెట్‌‌ చెల్లదంటున్రు

నా భర్త వనపర్తి రాజమౌళి ఎవుసం చేసేది. పానం బాగలేక కరీంనగర్‌‌ జిల్లా హాస్పిటల్‌‌లో చేర్చినం. జనవరి 5న చనిపోయిండు. రైతుబీమా సాయం కోసం ఆధార్‌‌ కారటు, బ్యాంకు పాస్‌‌ బుక్కు ఇచ్చి అప్లయ్‌‌ చేసినం. పరిహారం ఇయ్యలే. కరీంనగర్‌‌ల చనిపోయిండని ఊర్ల పంచాయతీ కార్యదర్శి డెత్ సర్టిఫికెట్‌‌ ఇయ్యలే. కరీంనగర్‌‌ గవర్నమెంట్‌‌ హాస్పిటల్‌‌ డెత్‌‌ సర్టిఫికెట్‌‌ ఇచ్చినా.. ఎల్ఐసీ ఒప్పుకోలే. ఆ సర్టిఫికెట్‌‌ చెల్లదని చెబుతున్రు. బీమా పైసలు రూ.5 లక్షలు ఎప్పుడొస్తయా అని ఎదురు చూస్తున్నం. ఉన్న భూమి చేసుకుంటూ, కైకిలి పోతూ బతుకుతున్న.

  – వనపర్తి రాజేశ్వరి, చిన్నబొంకూరు, సుల్తానాబాద్‌‌ మండలం,పెద్దపల్లి జిల్లా

ఏడాదైనా అందలే

మాకు మూడెకరాల భూమి ఉంది. మా నాయన గురుడు జాన్‌‌ (57) 2019 నవంబరులో గుండెపోటుతో చనిపోయిండు. అగ్రికల్చర్‌‌ ఆఫీసర్లకు దరఖాస్తు చేసినా రైతు బీమా అందలేదు. ఇంటి భారమంతా నాపైనే ఉంది. ఒక షోరూమ్‌‌లో పని చేస్తుండె. కరోనా వచ్చినంక తీసేసిన్రు. డ్రైవర్‌‌గా చేస్తున్న. రూ.6 వేలు ఇస్తున్నరు. సర్కారు బీమా పైసలు ఇవ్వాలె.

– ప్రమోద్‌‌ కుమార్‌‌, మన్నాపూర్‌‌, మోరంపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా

14 నెలలు అయింది

మా అమ్మ  సోక్రాబీ (56) హార్ట్‌‌ ప్రాబ్లమ్​తో చనిపోయింది. 14 నెలలు అవుతోంది. ఇప్పటిదాకా రైతు బీమా ఇన్సూరెన్స్‌‌ పైసలు రాలేదు. నాన్న 15 ఏండ్ల కిందటే చనిపోయిండు. ఎకరం 13 గుంటల భూమి ఉన్నది. కుటుంబం గడవక  ఎలక్ట్రికల్‌‌ షాపుల లేబర్‌‌గా పని చేస్తున్న.

– మొయినుద్దీన్‌‌, సత్వార్‌‌, జహీరాబాద్‌‌ మండలం, సంగారెడ్డి