
కేరళ వయనాడ్ లో రెస్క్కూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 350మందికిపైగా చనిపోగా.. 2వందల మంది ఆచూకీ దొరకడం లేదు. కొండచరియలు విరిగిపడిన ముండక్కైలోని పుంఛిరిమట్టం ప్రాంతంలో ఆదివారం కేంద్ర మంత్రి సురేష్ గోపి ఆదివారం పర్యటించారు. వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు పబ్లిక్ వర్క్స్ అండ్ టూరిజం మినిస్టర్ పిఎ మహ్మద్ రియాస్ తో చర్చించారు.
సహాయక చర్యలను, పునరావాస కేంద్రాలను కేంద్ర మంత్రి పర్యవేక్షించారు. క్షతగాత్రులు విమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుండగా వారిని పరామర్శించారు ఆయన. సెర్చ్ అండ్ ఆపరేషన్ కు మరింత సిబ్బంది కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరాలని మంత్రి సురేష్ గోపి సూచించారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.
ఇక అడవిలోని ఓ కొండ గుహలో చిక్కుకున్న ఆదివాసీ కుటుంబాన్ని రెస్క్యూ టీంకు చెందిన నలుగురు ఆఫీసర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు. కేరళ రాష్ట్ర వయనాడ్ లో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు మెప్పాడి, చూరల్ మల్ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి అటువైపు వెళ్లే దారులు మూసుకుపోయాయి.
అయితే అడవిలో నివసించే పనియా తెగకు చెందిన భార్యభర్తలు..వారి నలుగురు పిల్లలు అక్కడే చిక్కుకుపోయారు. నిన్న వారిని గుర్తించిన రెస్క్యూ టీమ్.. ఎనిమిది గంటల పాటు శ్రమించి కొండలను ఎక్కుతూ దిగుతూ ఆరుగురిని క్షేమంగా తీసుకొచ్చారు. ప్రాణాలను పణంగా పెట్టి వారిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది సేవలను కొనియాడుతున్నారు నెటిజన్లు.