‘వెలుగు’ స్టోరీపై ఐఏఎస్‌ల గ్రూపుల్లో చర్చ

‘వెలుగు’ స్టోరీపై ఐఏఎస్‌ల గ్రూపుల్లో చర్చ

హైదరాబాద్, వెలుగు: ‘అధికార పెత్తనమంతా ఆ నలుగురిదే’ హెడ్డింగ్‌తో గురువారం వెలుగు పేపర్‌‌లో పబ్లిష్ అయిన స్టోరీపై సెక్రటేరియెట్, ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. దీనిపై ఐఏఎస్‌ వర్గాలతో పాటు అధికార, ప్రతిపక్షాల్లోనూ చర్చ నడుస్తున్నది. గత బీఆర్ఎస్ హయాంలో కీలక పాత్ర పోషించిన బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడుకు చెందిన నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్నారనే విషయంపై ‘వెలుగు’ స్టోరీ రాసింది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఐఏఎస్‌లను పక్కనపెట్టారు.

కాంగ్రెస్ సర్కారు వచ్చాక తమకు ప్రాధాన్య పోస్టులు దక్కుతాయని వాళ్లంతా భావించారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ అప్రాధాన్య పోస్టులనే కేటాయించడంతో ఆ  ఐఏఎస్‌లు గత కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడిదే విషయంపై వెలుగు పేపర్‌‌లో స్టోరీ రావడంతో తమ వాయిస్ ప్రభుత్వ పెద్దలకు చేరిందని ఆ ఐఏఎస్‌లు భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక ఐఏఎస్‌లకు ప్రాధాన్యం ఇచ్చే అంశంపై ఆలోచన చేస్తుందని ఆ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు నలుగురు ఐఏఎస్‌ల అధికార పెత్తనంతో ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నదని తెలిసినా.. వాళ్లను సర్కార్‌‌ ఎందుకు కీలక పదవుల్లో కొనసాగిస్తున్నది? అనే ప్రశ్న అధికార, ప్రతిపక్ష పార్టీ వర్గాల నుంచి వస్తున్నది.