కేబినెట్‌‌‌‌‌‌‌‌లో మరో ముగ్గురు?

కేబినెట్‌‌‌‌‌‌‌‌లో మరో ముగ్గురు?

హైద్రాబాద్, వెలుగురాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉంటుందని టీఆర్ఎస్  పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల ముందే విస్తరణకు ముహూర్తం ఉండవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏ ఇద్దరు నేతలు కలిసినా కేబినెట్​ విస్తరణపైనే చర్చ జరుగుతోందని, ఎవరికి చాన్స్ ఉంటుందన్న ప్రస్తావనే ఉంటోందని అంటున్నాయి. సెప్టెంబర్​ రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆలోగానే మంత్రివర్గ విస్తరణ జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్లో సీఎంతో కలిపి 12 మంది ఉన్నారు. మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే ప్రస్తుత విస్తరణను ఇద్దరు, ముగ్గురికే పరిమితం చేస్తారని.. మున్సిపల్​ ఎలక్షన్ల తర్వాత మరోసారి చేపడతారని నేతలు అంటున్నారు.

చాన్స్​ ఎవరికి?

ప్రస్తుతం కేబినెట్​ విస్తరణ పూర్తిస్థాయిలో ఉండకపోవచ్చని, మున్సిపల్ ఎన్నికల తర్వాత మరికొందరికి చాన్స్​ ఉంటుందని టీఆర్ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కేటీఆర్ కు తప్పకుండా చాన్స్ ఉంటుందని అంటున్నాయి. సీఎం కేసీఆర్​ టీఆర్ఎస్​ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేటీఆర్​ను పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా నియమించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. కానీ కొద్దిరోజులుగా కేటీఆర్ మంత్రి కావాలంటూ పార్టీ నేతలు బహిరంగంగా డిమాండ్​ చేస్తున్నారు. ఆయన​ ప్రభుత్వంలో లేక అనుకున్నంత అభివృద్ధి జరగడం లేదని కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా కేటీఆర్​కు మంత్రి పదవి ఇవ్వడం కోసం జరుగుతున్నదేనని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘కేటీఆర్  మంత్రిగా లేకున్నా అంతకంటే ఎక్కువగానే అన్నీ చలాయిస్తున్నారు. కానీ ప్రభుత్వ పదవిలో లేకపోవడంతో ప్రోటోకాల్​ సమస్య వస్తోంది. అదే మంత్రిగా ఉంటే అధికారికంగా అన్ని సర్కారు కార్యక్రమాలకు వెళ్లొచ్చు. మంత్రి పదవిలో లేకపోవడంతో ఈ మధ్య హైదరాబాద్ లో అమెజాన్  క్యాంపస్  ప్రారంభోత్సవానికి కూడా కేటీఆర్  వెళ్లలేదు. లేకుంటే అక్కడ అంతా ఆయనే అన్నట్టు ఉండేది. త్వరలో జరిగే విస్తరణలో కేటీఆర్ కు తప్పకుండా చాన్స్ ఉంటుంది..” అని ఓ కీలక నేత చెప్పారు. కేటీఆర్ తో పాటు సబితా ఇంద్రారెడ్డికీ పదవీ యోగం ఉంటుందని, పార్టీలో చేరేటప్పుడే ఆమెకు హామీ ఉందని పేర్కొన్నారు.

గుత్తాకు మండలి చైర్మన్!

ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని, టీఆర్ఎస్​లో చేరేముందే ఈ మేరకు హామీ ఉందని ఆయన అనుచరులు చెప్తున్నారు. అయితే కేబినెట్​ విస్తరణలో గుత్తాకు అవకాశం రాకపోవచ్చని, ఆయనకు శాసన మండలి చైర్మన్  పదవి ఇచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్​ సీనియర్​ నేత ఒకరు చెప్పారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల వరకు మండలి చైర్మన్ గా ఉండాలని గుత్తాకు సీఎం చెప్పారని, మరోసారి జరిగే విస్తరణలో కేబినెట్​ చాన్స్​ ఇస్తామని హామీచ్చారని వెల్లడించారు.

ఎందరో ఆశావహులు

మంత్రి పదవి కోసం టీఆర్ఎస్​లో చాలా మంది నేతలు ఎదురుచూస్తున్నారు. ఖమ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు, పువ్వాడ అజయ్, సండ్ర వెంకట వీరయ్య, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, వరంగల్ జిల్లా నుంచి వినయ్ భాస్కర్, సత్యవతి రాథోడ్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి జోగు రామన్న తదితరులు కేబినెట్​ బెర్త్​ ఆశిస్తున్నారు.

ఇద్దరికా? ఒక్కరికేనా?

కేటీఆర్ ను కేబినెట్లోకి తీసుకుంటే మరి హరీశ్​ రావు పరిస్థితి ఏంటనే చర్చ బాగా జరుగుతోంది. కేసీఆర్  రెండోసారి సీఎం అయ్యాక కేటీఆర్, హరీశ్​ ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఇద్దరికీ మంత్రిపదవులు ఇస్తారా, లేక కేటీఆర్  ఒక్కడినే తీసుకుంటారా అన్న దానిపై పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హరీశ్​రావుకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి