కాళేశ్వరంపై సభలో తప్పుడు లెక్కలు

కాళేశ్వరంపై సభలో తప్పుడు లెక్కలు
  • ఎల్లంపల్లిలో నీళ్లు మేడిగడ్డ నుంచే ఎత్తిపోశాం
  • అసెంబ్లీలో భట్టితో వేముల, గంగుల వాదన

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం నీళ్లపై అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు మంత్రులు తప్పుడు లెక్కలు చెప్పారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి చుక్క నీటిని కూడా ఎత్తిపోయకున్నా.. అక్కడి నుంచి వచ్చిన 30 టీఎంసీల నీళ్లను మిడ్‌‌ మానేరు, లోయర్‌‌ మానేరు డ్యాముల్లో నింపినట్లు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌‌ చెప్పుకొచ్చారు. పెండింగ్‌‌ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఫలితాలు వచ్చేవని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా.. కలుగజేసుకున్న ఈ ఇద్దరు మంత్రులు ఎల్లంపల్లి కెపాసిటీపైనే పదే పదే ప్రశ్నిస్తూ నీళ్లన్నీ మేడిగడ్డ నుంచి ఎత్తిపోసినవే అని తెలిపారు.

మేడిగడ్డ నుంచి చుక్క నీళ్లనూ  లిఫ్ట్​ చేయలేదు: భట్టి

కాళేశ్వరం ప్రాజెక్టు మీద రూ.50 వేల కోట్లు ఖర్చు చేసినా మేడిగడ్డ నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా లిఫ్ట్‌‌ చేయలేదని శనివారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌‌పై చర్చ సందర్భంగా భట్టి అన్నారు. ‘‘కడెం ప్రాజెక్టు నీళ్లు ఎల్లంపల్లికి వచ్చినయి.. ఎల్లంపల్లిలో నీళ్లు మిడ్‌‌ మానేరుకు వచ్చినయి. మిడ్‌‌మానేరులో నీళ్లు లోయర్‌‌ మానేరుకు వచ్చినయి.. ఇది వాస్తవం.. ఇది రికార్డు చెప్తున్నది. మేడిగడ్డ నుంచి 12 టీఎంసీలు అన్నారానికి లిఫ్ట్‌‌ చేశారు. అన్నారం నుంచి సుందిళ్లకు 6 టీఎంసీలు లిఫ్ట్‌‌ చేశారు. ఆ తర్వాత వరదొస్తే ఆ నీళ్లను కిందికొదిలేశారు. అంతేతప్ప శ్రీపాద ఎల్లంపల్లిలోకి మేడిగడ్డ నుంచి ఒక చుక్క నీళ్లు కూడా రాలేదు. ఒకసారి కిందికి నీళ్లు పోయిన తర్వాత మీరు ఒక చుక్క కూడా లిఫ్ట్‌‌ చేయలేదు. అయినా మిడ్‌‌ మానేరుకు నీళ్లొచ్చినయి.. లోయర్‌‌ మానేరుకు నీళ్లొచ్చినయి. మిడ్‌‌ మానేరు పై నుంచి ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం అని చెప్పే ఫ్లడ్‌‌ ఫ్లో కెనాల్‌‌కూ నీళ్లొచ్చినయి. ఈ నీళ్లు అప్పటి ప్రభుత్వాలు డిజైన్‌‌‌‌ చేసిన పాత ప్రాజెక్టులు ద్వారా వచ్చాయి తప్ప మేడిగడ్డ దగ్గరి నుంచి వచ్చినవి కాదు’’ అని ఆయన వివరించారు.

స్టోర్​ చేసి పంపారు: వేముల

భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌రెడ్డి జోక్యం చేసుకొని.. ‘‘మిడ్​ మానేరులోకి, వరద కాలువలోకి నీళ్లొచ్చాయి.. అవన్నీ ఎల్లంపల్లిలోనివే అంటున్నారు. ఎల్లంపల్లి కెపాసిటీ ఎంత? లోయర్​ మానేరులో ఎన్ని టీఎంసీలు నింపారు. మిడ్‌‌‌‌ మానేరులో ఎన్ని నింపారు. ఎన్ని చెరువులు నింపారు.. అర్థం చేసుకుంటే తెలుస్తది. ఊరికే అబద్ధం మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించాలంటే కష్టం. ఎల్లంపల్లి కెపాసిటీ ఎంత? లోయర్​ మానేరులో  15 టీఎంసీలు, మిడ్​ మానేరులో 15 టీఎంసీలు.. మొత్తం 30 టీఎంసీలు ఉన్నయి. వరద కాలువపై ఓటీలు పెట్టి తూముల ద్వారా 45 చెరువులు ఇప్పటికే నింపినం. ఇంకా నింపుతా ఉన్నరు. ఎల్లంపల్లి కెపాసిటీ ఎంత? ఊరికే మాట్లాడుతామంటే ఎట్ల?.. ఇంకా ఎల్లంపల్లిలో నీళ్లున్నాయి.. ఎక్కడి నుంచి వచ్చాయి.. కింది నుంచి రాకపోతే ఎక్కడి నుంచి వచ్చాయి.. ఇంత అబద్ధాలు మాట్లాడితే ఎలా?’ అంటూ ప్రశ్నించారు. భట్టి మాట్లాడుతూ.. ఎల్లంపల్లి నుంచి కాకుండా మేడిగడ్డ బ్యారేజీ నుంచి ‘మీరేమైనా పంపు చేశారా’ అని తిరిగి ప్రశ్నించారు. ప్రశాంత్‌‌‌‌రెడ్డి సమాధానమిస్తూ ‘‘వారు మళ్లీ అదే తప్పు మాట్లాడుతున్నారు.. ఆకాశం నుంచి వస్తాయా నీళ్లు.. 30 టీఎంసీలు వరద కాలువ ద్వారా చెరువులకు నీళ్లు పోయినయి.. ఎల్లంపల్లిలో సగమే వరదతో వచ్చింది. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల నుంచి తీసుకువస్తేనే ఆ నీళ్లు పంపించారు. ఇక్కడి నుంచి మిడ్​ మానేరుకు నీళ్లు వెళ్లాక వరద వచ్చింది’’ అని తెలిపారు.

అవి కాళేశ్వరం నీళ్లే: గంగుల

మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌ జోక్యం చేసుకొని ‘‘ఎల్లంపల్లికి వరద వచ్చే ముందే మేడిగడ్డ నుంచి లిఫ్టు ద్వారా తీసుకువచ్చిన నీళ్లతో మిడ్‌‌‌‌మానేరు, లోయర్​ మానేరు నింపుకున్నం. తర్వాత ఎల్లంపల్లికి వరద వచ్చింది. ఇప్పుడు లోయర్​ మానేరులో  15 టీఎంసీలు ఉన్నాయి.. మిడ్‌‌‌‌ మానేరులో నీళ్లున్నాయి..  22ఏండ్ల క్రితం నిండిన చెరువులను మళ్లీ ఇప్పుడు నింపుకున్నం. ఇవన్నీ నీళ్లు మేడిగడ్డ ద్వారా రాకపోతే ఎల్లంపల్లి కెపాసిటీ ఎంత ..? ఎల్లంపల్లికి వన్‌‌‌‌ వీక్‌‌‌‌ మాత్రమే వరద వచ్చింది. ఈ వరద రాకముందే ఇవన్నీ నింపేసుకున్నాం.. ఆ నీళ్లు ఎక్కడివి? కాళేశ్వరంవి కావా? మా భూములకు నీళ్లొచ్చినయి.. మీకు సమాచారం లేటుగా వచ్చింది’’ అని అన్నారు.  స్పీకర్‌‌‌‌ జోక్యం చేసుకొని సభలో రాజకీయాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే చర్చ చేయాలని, ఎవరూ వాస్తవాలను వక్రీకరించి మాట్లాడకూడదని సూచించారు. భట్టి స్పందిస్తూ తాను ఇరిగేషన్‌‌‌‌ శాఖ రికార్డుల ఆధారంగానే మాట్లాడుతున్నానని, తప్పులేమీ మాట్లాడలేదని వివరించారు. ఆన్‌‌‌‌గోయింగ్‌‌‌‌ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఫలితాలు వచ్చేవని, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులోని ప్యాకేజీలు 6, 7, 8 పూర్తి చేసి ఉంటే ఇంకా ఉపయోగముండేదని చెప్పి బడ్జెట్‌‌‌‌పై చర్చలోకి వెళ్లారు.

నిజాలు ఏమిటి?

ఎల్లంపల్లిలో జులై 18 నాటికి 4.82 టీఎంసీల నీళ్లుండగా ఆ రోజు 128 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వచ్చింది. అదే నెల 29న కడెం ప్రాజెక్టుకు 23,889 క్యూసెక్కుల వరద రాగా, అదేరోజు ఎల్లంపల్లికి 3,222 క్యూసెక్కుల నీళ్లు వచ్చాయి. అదే నెల 30న కడెం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 26,400 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఆగస్టు 5 నాటికి ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో గేట్లు ఎత్తి 35,980 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలారు.

జులై 6న మేడిగడ్డకు ఎగువన కన్నెపల్లి పంపుహౌస్‌‌‌‌లో ఒక మోటారును ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ చేశారు. జులై  7న రెండు మోటార్లు నడిపారు. 8న 3 మోటార్లు, 12న 4 మోటార్లు రన్‌‌‌‌ చేశారు. ఆరు రోజుల్లో అన్నారం బ్యారేజీకి 2.50 టీఎంసీల నీళ్లు చేరాయి. 14న ఐదు మోటార్లు నడిపించగా మేడిగడ్డ బ్యారేజీకి ఆ రోజు 1.30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 20న అన్నారం పంపుహౌస్‌‌‌‌లో ఒక మోటారు ద్వారా పంపింగ్‌‌‌‌ మొదలుపెట్టారు. అదేరోజు కన్నెపల్లిలో ఆరో మోటారును నడిపించారు. జులై 25న అన్నారంలో ఐదు మోటార్లు నడిపించారు. 30న మేడిగడ్డ బ్యారేజీ 30 గేట్లను ఎత్తి నీటిని నదిలోకి వదిలారు. 31న మేడిగడ్డ నుంచి కిందికి 5,31,200 క్యూసెక్కుల వరద నదిలోకి వెళ్లింది. ఆగస్టు 5న సుందిళ్ల పంపుహౌస్‌‌‌‌లో ఒక మోటారును కాసేపు నడిపించిన అధికారులు ఎగువన ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో పంపింగ్‌‌‌‌ ఆపేశారు. ఆగస్టు ఒకటినే మేడిగడ్డలో మోటార్లను బంద్‌‌‌‌ చేశారు.

ఈ ఫ్లడ్‌‌‌‌ సీజన్‌‌‌‌లో ఇప్పటివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 41.70 టీఎంసీల నీళ్లు చేరాయి. ఇందులోంచి మిడ్​ మానేరుకు తరలించింది దాదాపు 12.5 టీఎంసీలు మాత్రమే. వరద ఎక్కువగా వచ్చిన సమయానికి లక్ష్మీపూర్​ పంపుహౌస్​రెడీ కాకపోవడంతో ఎల్లంపల్లి గేట్లను ఎత్తి.. నీళ్లను గోదావరిలోకి వదిలేశారు. ఇలా దాదాపు 17 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. దీంతో  ఎల్లంపల్లి ప్రాజెక్టులో శనివారం సాయంత్రం వరకు 12.64 టీఎంసీల నీళ్లు మాత్రమే మిగిలాయి. ప్రస్తుతం 1,814 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వస్తోంది.

మిడ్​ మానేరులో  ఎల్లంపల్లి నీళ్లను లిఫ్టు చేయడానికి ముందే అందులో 3.5 టీఎంసీల నీళ్లున్నాయి. లిఫ్టింగ్​ మొదలైన తర్వాత 12.5 టీఎంసీలను తీసుకొచ్చారు. వాటిలోంచి ఇప్పటివరకు 9.5 టీఎంసీలను లోయర్​ మానేరుకు వదిలారు. ప్రస్తుతం మిడ్​ మానేరులో 6.35 టీఎంసీల నీళ్లు ఉండగా..  3,310 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. లోయర్​ మానేరుకు ఎల్లంపల్లి నీళ్లు చేరడానికి ముందే దాదాపు 3.5 టీఎంసీల నీళ్లున్నాయి. ప్రస్తుతం అక్కడ 12.98 టీఎంసీల నీళ్లున్నాయి.  మంత్రులు ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా మేడిగడ్డ నుంచే 30 టీఎంసీల నీళ్లను తరలించామని అసెంబ్లీలో చెప్పారు.