- గతంలో కట్టడి.. ఇప్పుడు పెంపుదల
- తగ్గుతున్న ఫర్టిలిటీ రేటు,
- ఏపీలో 1.6.. తెలంగాణలో 1.5 శాతం
- జనాభా స్థిరత్వానికి 2.1 శాతం ఫర్టిలిటీ అవసరం
- ముంచుకొస్తున్న వృద్ధాప్య భారం
- యువశక్తి తగ్గిపోతే ఆర్థిక సంక్షోభమేనంటున్న నిపుణులు
- ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరిద్దరికి మించి పెంచలేమంటున్న నేటితరం
హైదరాబాద్, వెలుగు: ఇన్నాళ్లూ ‘ఇద్దరు ముద్దు.. ముగ్గురు వద్దు..’ అంటూ చెప్పిన నేతలే ఇప్పుడు ‘కనీసం ముగ్గురిని.. వీలైతే నలుగురిని కనండి..’ అంటూ సరికొత్త నినాదాలిస్తున్నారు. ‘పిల్లలే మన అసలైన సంపద.. ఎంతమందిని కంటే అంత మేలు’ అంటూ ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నూతన పాపులేషన్ పాలసీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఒకప్పుడు జనాభా పెరుగుదలను కట్టడి చేయడమే ధ్యేయంగా పాలసీలు రూపొందించిన పాలకులు.. ఇప్పుడు జననాల రేటు పడిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా స్థిరత్వానికి కనీసం 2.1 శాతం టోటల్ ఫర్టిలిటీ రేటు (టీఎఫ్‌ఆర్) అవసరం కాగా, ప్రస్తుతం ఏపీలో 1.6, తెలంగాణలో 1.5 శాతానికే పరిమితం కావడం వల్ల భవిష్యత్తులో సంక్షోభం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జనాభా సమతుల్యతను కాపాడటానికి, భవిష్యత్ ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలు, యువశక్తి తగ్గుదలపై ఆర్‌బీఐ చేసిన హెచ్చరికలు చర్చకు దారితీశాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోంది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడం ఆసక్తిరేపుతోంది. కాగా ఒకరిద్దరిని పెంచడమే భారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురు పిల్లలను కనడం, సాకడం తమ వల్ల కాదని మధ్యతరగతి తల్లిదండ్రులు తేల్చిచెప్తున్నారు.
- మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ. 40 వేలు
ఏపీలో జననాల రేటు ఆందోళనకర స్థాయికి పడిపోతోందని, జపాన్, చైనా సహా కొన్ని ఐరోపా దేశాలు ఎదుర్కొంటున్న జనాభా క్షీణత సంక్షోభం ఏపీకి రాకూడదన్న ఉద్దేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వనరుల కొరత కారణంగా గతంలో జనాభాను కట్టడి చేశామని, కానీ ఇప్పుడు యువత సంఖ్య తగ్గి, వృద్ధుల శాతం పెరిగితే శ్రామిక శక్తి కొరత ఏర్పడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఏపీ సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు భారం కాదని, వాళ్లే మన అసలైన సంపద అంటూ ఆయన కొత్త నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా జనాభా సమతుల్యతను కాపాడేందుకు మూడో బిడ్డ పుట్టిన వెంటనే ఆ కుటుంబానికి రూ.30 వేలు, నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేలు తక్షణ ఆర్థికసాయం అందిస్తామని తాజాగా ప్రకటించారు.
- సగటున ఇద్దరు కూడా పుట్టట్లే..
బిహార్, యూపీ, మధ్యప్రదేశ్‌లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఇంకా కొనసాగుతోంది. బిహార్‌లో టీఎఫ్‌ఆర్ 2.9గా నమోదుకాగా యూపీలో 2.6, మధ్యప్రదేశ్‌లో 2.5గా ఉంది. కానీ కేరళలో 1.5, పశ్చిమ బెంగాల్‌లో 1.4 ఉండగా.. ఆ రాష్ట్రాల సరసన తెలంగాణ (1.5) కూడా చేరింది. అంటే దంపతులకు సగటున ఇద్దరు పిల్లలు కూడా పుట్టడం లేదు. ఇది కేవలం జనాభా సమస్య మాత్రమే కాదని.. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బడులకు వెళ్లే పిల్లల సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగి సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా నియోజకవర్గాల పునర్విభజన, ఆర్థిక సంఘం నిధుల సిఫార్సులు వంటి వాటిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
- కరిగిపోతున్న డెమోగ్రాఫిక్ డివిడెండ్
ఏ రాష్ట్రానికైనా పనిచేసే వయసున్న జనాభా (వర్కింగ్ ఏజ్ పాపులేషన్) ఎక్కువగా ఉంటే ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది, దీనినే ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ అంటారు. తెలంగాణలో పనిచేసే వారి వాటా 2026లో 67.8 శాతంతో గరిష్ట స్థాయికి చేరి, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టనుంది. 2036 నాటికి ఇది 66.7 శాతానికి పడిపోనుంది. అదే సమయంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల వాటా 2021లో 11 శాతంగా ఉండగా.. అది 2026 నాటికి 12.5 శాతానికి, 2036 నాటికి ఏకంగా 17.1 శాతానికి పెరగనుంది.
- టీఎఫ్‌ఆర్ ఇలాగే కొనసాగితే ప్రమాదమే..
ఫర్టిలిటీ రేటు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తెలంగాణలో లేబర్ ఫోర్స్ లభ్యత పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐటీ, ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్, నిర్మాణ రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణకు రాబోయే రోజుల్లో నైపుణ్యం కలిగిన యువత దొరకడం గగనంగా మారుతుందని చెప్తున్నారు. ఈ కొరత వల్ల పరిశ్రమల నిర్వహణ వ్యయం, వేతనాలు భారీగా పెరిగి పెట్టుబడులు తరలిపోయే ముప్పు పొంచి ఉందని పేర్కొంటున్నారు.
పన్నులు చెల్లించే యువ జనాభా తగ్గిపోతుంటే, మరోవైపు ఆసరా పెన్షన్లు, వృద్ధాప్య వైద్య సంరక్షణ (జెరియాట్రిక్ కేర్) కోసం ప్రభుత్వం చేయాల్సిన ఖర్చులు రెట్టింపు కానున్నాయి. ప్రతి ఇద్దరు యువకులు ఒక వృద్ధుడి భారాన్ని మోయాల్సిన ‘డిపెండెన్సీ రేషియో’ పెరిగితే కుటుంబాల పొదుపు సామర్థ్యం క్షీణించి, రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటుందని నిపుణులు వివరిస్తున్నారు.
- ఇద్దరిని మించి పెంచలేమంటున్న నేటితరం
పిల్లలను కనాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆకాశాన్నంటుతున్న జీవన వ్యయం, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, మారుతున్న జీవనశైలి కారణం గా నేటి తరం దంపతులు ఒకరు లేదా ఇద్దరికే పరిమితం అవుతున్నారు. ‘ఇప్పటికే ఉన్న ఒకరిద్దరిని పెంచడమే భారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో, ముగ్గురు పిల్లలను కనడం, సాకడం మావల్ల కాదు’ అని మధ్యతరగతి తల్లిదండ్రులు తేల్చి చెప్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం కేవలం చట్టాలు చేస్తే సరిపోదని, పిల్లల పెంపకానికి అవసరమైన ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తేనే పాలసీలు విజయ వంతమవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జనాభా పెంపుదలపై చేసిన వ్యాఖ్యలు, ప్రకటించిన ప్రోత్సాహకాలపై తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాబోయే డెమోగ్రాఫిక్ సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో తగ్గుతున్న ఫర్టిలిటీ రేటు, పెరుగుతున్న వృద్ధుల జనాభా, భవిష్యత్ ఆర్థిక పరిణామాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించినట్లు తెలిసింది. దేశంలో, పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, జాతీయ సగటుతో పోలుస్తూ తెలంగాణకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించినట్లు చర్చ నడుస్తున్నది.
- తెలంగాణకు ‘వృద్ధాప్య’ గండం
తెలంగాణలో జననాల రేటు పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్ 2026’ ప్రకారం తెలంగాణలో టీఎఫ్‌ఆర్ కేవలం 1.5గా నమోదు కాగా.. ఇది జాతీయ సగటు 1.9 కంటే చాలా తక్కువ. ఈ క్రమంలో 2036 నాటికి తెలంగాణ ‘ఏజింగ్ స్టేట్’ (వృద్ధాప్య రాష్ట్రం) జాబితాలోకి చేరనుందని ఆర్‌బీఐ తన ‘స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025–26’ నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా పడిపోవడం, ఆయుర్ధాయం పెరగడమే దీనికి ప్రధాన కారణాలుగా ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం ‘ఇంటర్మీడియట్’ దశలో ఉన్న తెలంగాణలో జనాభా కూర్పు వేగంగా మారుతోందని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని హెచ్చరించింది.
- ఇప్పటి ఖర్చులకు ఒక్కరు చాలు..
ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చులు చూస్తుంటే పాపో, బాబో ఒక్కరే చాలనిపిస్తోంది. ఇంట్లో ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఒక్కరి స్కూల్ ఫీజు కట్టడమే ఇబ్బందవుతోంది. మారిన పరిస్థితుల్లో రెండో కిడ్ కి ట్రై చేసే వారికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయ్. ఇప్పటి జీవనశైలి, ఆహార అలవాట్లకి రెండో ప్రెగ్నెన్సీ సేఫ్ కాదని డాక్టర్లే చెప్తున్నారు. అలాంటిది మూడో కిడ్ ఊహే కరెక్ట్ కాదనిపిస్తోంది.
- చింతల పల్లవి , పెనుబల్లి, ఖమ్మం జిల్లా
- ఇద్దరు మించి సాధ్యం కాదు..
మాకు ఇద్దరు అబ్బాయిలు. ఈరోజుల్లో పెరిగిన ఖర్చులు, స్కూలు ఫీజులతో ఇద్దరిని మించి పోషించడం సాధ్యం కాదు. అందుకే మేం ఇద్దరితోనే ఆగిపోయాం. మాకు తెలిసిన చాలా మంది దంపతులు ఒకరు లేదంటే ఇద్దరికే ఆగిపోతున్నారు. ఫ్యామిలీలో ఏదైనా ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప ముగ్గురికి పోవడం లేదు. ఈ ట్రెండ్ గత 15, 20 ఏండ్లుగా ఎక్కువైంది.
- చెరుకుపల్లి శ్రావణి, హనుమకొండ
