కేంద్రాన్ని బద్నాం చేయడానికే అసెంబ్లీలో చర్చలు

కేంద్రాన్ని బద్నాం చేయడానికే అసెంబ్లీలో చర్చలు
  • కరోనా కాలంలో ఎఫ్ఆర్‌‌‌‌బీఎం పరిధి పెంచింది కేంద్రం కాదా?
  • పన్నుల వాటా 42 శాతానికి పెంచింది బీజేపీ ప్రభుత్వమే: రఘునందన్

హైదరాబాద్ : కేంద్రాన్ని బద్నాం చేయడానికే అసెంబ్లీలో చర్చలు పెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌‌రావు విమర్శించారు. అసలు విషయాలు మాట్లాడకుండా.. కేంద్రాన్ని టార్గెట్ చేసేలా ప్రసంగం చేయడం వెనక ఉద్దేశం ఏమిటో తెలిసిపోతున్నదన్నారు. ఎఫ్ఆర్‌‌బీఎం చ‌‌ట్టం, రాష్ట్ర ప్రగ‌‌తిపై అసెంబ్లీలో రఘునందన్‌‌రావు మాట్లాడారు. రాష్ట్రాల పన్నుల వాటాను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే 42 శాతానికి పెంచిందని చెప్పారు. అప్పులు తీసుకురావడం కాదని.. తెచ్చిన అప్పు ఎలా ఖర్చు అవుతుందనేది ప్రధాన విషయమని తెలిపారు. 2014 జూన్ 2 తర్వాత రాష్ట్ర ప్రజల మీద అప్పు అమాంతం పెరిగిందన్నారు. కరోనా విపత్తు టైంలో రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుని ఎఫ్ఆర్‌‌‌‌బీఎం పరిమితి 4.5 శాతానికి కేంద్రం పెంచిందని గుర్తు చేశారు. అనేక విషయాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి.. జీఎస్టీ మీటింగ్‌‌లో అడిగితే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.

రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ‘నాకేం వద్దు ప్రేమ ఉంటే చాలు’ అని సీఎం కేసీఆర్‌‌ అన్నారని గుర్తు చేశారు. మిషన్ భగీరథకి తెచ్చిన అప్పులు దానికే ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. భైంసాలో మత ఘర్షణలు రెచ్చగొట్టినదెవరో చెప్పాలన్నారు. కేంద్రంలో బీజేపీ వచ్చినప్పటి నుంచి ఎక్కడా మత ఘర్షణలు జరగలేదని తెలిపారు. కేంద్రం నుంచి నేషనల్ హైవేలకు, రోడ్లకు, రైల్వేస్‌‌కు ఎంత ఇచ్చిందో లెక్కలు బయటికెందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. 9 జిల్లాలకు రూ.2,250 కోట్లను కేంద్రం ఇచ్చిందన్నారు. రఘునందన్ మాట్లాడుతుండగా టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు అడ్డుపడుతూ వచ్చారు. స్పీకర్ మైక్ ఆఫ్ చేసిన తర్వాత కూడా బాల్క సుమన్‌‌కు, రఘునందన్‌‌కు మధ్య వాగ్వాదం జరిగింది.