తొలిరోజు 12 అంశాలపై చర్చ..గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ట్రాన్స్పోర్ట్ పాలసీలపై ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు

తొలిరోజు 12 అంశాలపై చర్చ..గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ట్రాన్స్పోర్ట్ పాలసీలపై ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు
  • గిగ్ ఎకానమీ, గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రణాళికలు
  • ఏరోస్పేస్, డిఫెన్స్, సెమీకండక్టర్, మహిళా పారిశ్రామికవేత్తల సాధికారతపై సలహాలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను వివిధ రంగాల్లో మరింత అభివృద్ధి దిశగా నడిపించేలా గ్లోబల్​ సమిట్​లో చర్చలు జరిగాయి. వివిధ రంగాలకు చెందిన నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సోమవారం ఫ్యూచర్​సిటీలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్​ సమిట్​తొలి రోజు 12 అంశాలపై పానెల్ డిస్కషన్లను నిర్వహించారు.

గ్రీన్ ఎనర్జీపై తెలంగాణ పాలసీలు, పర్యావరణహితమైన ట్రాన్స్​పోర్ట్​ వ్యవస్థ, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటు, విద్య, వైద్యం, ఏరోస్పేస్, డిఫెన్స్​పై లోతైన చర్చలు జరిగాయి. టెక్నాలజీలో ఇన్వెస్ట్​మెంట్, గిగ్​వర్కర్స్ సంక్షేమం–ఎకానమీ, డిజిటల్, రైతుల ఆదాయం పెంపు వంటి అంశాలపై ఆయా రంగాల నిపుణులు చర్చలు జరిపారు.

భవిష్యత్తులో ఆయా రంగాల్లో తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆ విజన్​ను వివరించారు. టెక్నాలజీ, ఎనర్జీ.. అభివృద్ధికి కీలకమైన ఇంధనంగా పనిచేస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ఫ్రాంటియర్ టెక్నాలజీ, సుస్థిర ఇంధన రంగంపై కీలక చర్చలు జరిగాయి. ఇక, రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచడం, నాన్-ఎమిషన్ టెక్నాలజీల అభివృద్ధికి పెట్టుబడులు ఆకర్షించడంపై ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా పంప్డ్ స్టోరేజ్ పవర్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి వాడకాన్ని పెంచేలా రోడ్ మ్యాప్​పై చర్చించారు. వాహనాలు, ఎలక్ట్రానిక్స్​లో అత్యంత కీలకమైన సెమీకండక్టర్ల తయారీలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్ వంటి ఫ్రంటియర్ టెక్నాలజీలు, నైపుణ్యాల బదిలీవంటి వాటికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ఉన్న అనుకూల పరిస్థితులను నిపుణులు వివరించారు. ఇప్పటికే టాటా, సఫ్రాన్, స్కైరూట్​తో పాటు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థల విస్తరణ ప్రణాళికలను పానెల్ డిస్కషన్స్​లో వెల్లడించారు. హ్యూమన్ రీసోర్సెస్, సోషల్ సెక్యూరిటీకి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గిగ్ ఎకానమీ, దాని అభివృద్ధికి, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులు సమగ్రంగా చర్చించారు.  

రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలకు మరిన్ని ప్రోత్సాహం అందించేందుకు చేపడుతున్న చర్యలను చర్చించారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గానికో మహిళా క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని నిపుణుల దృష్టికి తీసుకొచ్చారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వారిని ఆర్థికంగా ఎంపవర్ చేస్తున్న విషయంపై చర్చించారు. రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచడానికి, పంట మార్పిడి, ఆధునిక పద్ధతులు, వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపరచడంపై నిపుణులు తమ సూచనలు అందించారు.