
భార్యను వదిలేసి వెళ్లి పదేండ్లు గడిచింది. ఆమె ఎలా ఉంది.. కొడుకు, కూతురును పెంచేందుకు ఎలా కష్టపడింది.. పిల్లలు ఎలా ఉన్నారు.. ఇలాంటివేవీ పట్టించుకోకుండా పదేళ్లు దూరంగా గడిపిన వ్యక్తి.. సడెన్ గా వచ్చి భార్యను చంపేసి వెళ్లాడు. ఒక సాధువు రూపంలో పద్ధతిగా.. ప్రశాంతంగా వచ్చి.. తనలోని పైశాచిక.. కిరాతక కోణాన్ని బైట పెట్టి సుత్తితో కొట్టి చంపేసి పరారయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది.
ఢిల్లీలోని నేబ్ సరై ఏరియాలో బుధవారం (ఆగస్టు 06) జరిగింది ఈ దారుణ ఘటన. ప్రమోద్ ఝా అలియాస్ పప్పు (60) అనే వ్యక్తి సాధు రూపంలో బీహార్ నుంచి ఢిల్లీకి ప్రయాణించి.. మధ్యరాత్రి తర్వాత భార్య కిరణ్ ఝా (50) ఉన్న ఇంట్లోకి ప్రవేశించి అతి కిరాతకంగా చంపేసి వెళ్లిపోయాడు. ఇదొక ప్రి-ప్లాన్డ్ మర్డర్ గా పోలీసులు అభిప్రాయపడ్డారు. బుధవారం మధ్యరాత్రి 12 గంటల సమయంలో ఆమెను చంపేశాడు దుర్మార్గుడు. అయితే ఈ మర్డర్ జరిగిన తర్వాత తెల్లవారుజామున 4.30 గంటలకు పోలీసులకు ఫోన్ చేశారు స్థానికులు.
ALSO READ :2 రోజులు, 25 కుక్కలు..
చంపేసి సింపుల్ గా డ్రెస్ మార్చుకుని వెళ్లిన హంతకుడు:
సౌత్ డీసీపీ అంకిత్ చౌహాన్ చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుడు పప్పు బీహార్ లోని తన స్వస్థలం ముంగర్ జిల్లా నుంచి పదేళ్ల తర్వాత ఆగస్టు 1 న ఢిల్లీకి చేరుకున్నాడు. తన కుటుంబం గుర్తు పట్టకుండా.. ఇంట్లోకి రానిచ్చేందుకు ప్రశాతంగా సాధు వేశంలో వచ్చాడు. 12 గంటల ప్రాంతంలో చంపేసి.. 12.50 కి ఇంట్లో నుంచి వెళ్లి పోయినట్లు సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా నిర్ధారించినట్లు చెప్పారు పోలీసులు. భార్యను కిరాతకంగా చంపేసి సింపుల్ గా డ్రెస్ మార్చుకుని ఏమీ జరగనట్లు వెళ్లిపోయాడని తెలిపారు.
పప్పు గృహ హింసను తట్టుకోలేక గత పదేళ్లుగా కిరణ్ ఝా సపరేట్ గా ఉంటూ వస్తోంది. కొడుకు దుర్గేష్, కోడలు కమల్ ఝాలతో నేబ్ సరై ఏరియాలో నివసిస్తోంది. దుర్గేశ్ బీహార్ దర్భాంగ లో మైక్రోఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుంటాడు. మర్డర్ జరిగిన సమయంలో కొడుకు ఢిల్లీలో లేడని తెలిపారు పోలీసులు. ఫోరెన్సిక్ అధికారులు ఘటనా స్థలంలోని సుత్తె (హ్యామర్) ను స్వాధీనం చేసుకుని.. మర్డర్ కు వాడింది అదేనని నిర్ధారించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు టీమ్ లుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు.
దివాళా తీయడంతో భార్య వద్దకు:
నిందితుడికి ఎలాంటి ఆదాయం లేకపోవడంతో.. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను అమ్ముకున్నట్లు పోలీసులు తెలిపారు. భూమిని అమ్ముకుని కొన్నాళ్లు గడిపినా.. ఎలాంటి ఆదాయం లేకపోవడంతో దివాళా తీశాడు. దీంతో భార్య వద్దకు వచ్చి.. బీహార్ కు తిరిగి రావాలని.. తనకు ఏదో ఒక పని చేసి డబ్బు ఇవ్వాలని కోరినట్లు ప్రాథమిక విచారణ ద్వారా చెప్పారు పోలీసులు. ఆమె తిరస్కరించడంతో చంపేసినట్లు తెలిపారు.
అయితే తన తండ్రి టార్చర్ తట్టుకోలేక తమ తల్లి ఢిల్లీకి చేరుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు కూతురు రోమా తెలిపింది. రెండు నెలల క్రితం బంధువులు చనిపోతే తామంతా బీహార్ వెళ్లామని.. తాను పూర్తిగా మారిపోయినట్లు తమ తండ్రి నటించారని చెప్పింది. బీహార్ కు తనతో రానని తన తల్లి చెప్పడంతో చంపేశాడని కూతురు ఆరోపించింది.