18 రోజుల తర్వాత మృతదేహాలకు అంత్యక్రియలు

18 రోజుల తర్వాత మృతదేహాలకు అంత్యక్రియలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసులో నిందితుల డెడ్ బాడీలకు ఎయిమ్స్​ డాక్టర్లు సోమవారం రీ పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అత్యాధునిక వైద్య పరికరాలతో నాలుగు గంటల పాటు మృతదేహాలను పరిశీలించి, పలు శాంపిళ్లను తీసుకున్నారు. బుల్లెట్​ గాయాలతోపాటు దెబ్బతిన్న అవయవాల భాగాలను పరిశీలించి వివరాలు రికార్డు చేసుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో రికార్డు చేశారు. పోస్టుమార్టం తర్వాత పోలీసులు నిందితుల డెడ్​బాడీలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భారీ భద్రత మధ్య రెండు అంబులెన్సుల్లో స్వగ్రామాలకు తరలించారు. మొత్తంగా ఎన్​కౌంటర్​ జరిగిన 18 రోజుల తర్వాత మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి.

హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ‘దిశ’ కేసు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు డెడ్ బాడీలకు ఎయిమ్స్ డాక్టర్లు రీపోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ సుధీర్​గుప్తా ఆధ్వర్యంలో అభిషేక్ యాదవ్, ఆదర్శ కుమార్, వరుణ్ చంద్రతో కూడిన నలుగురి టీమ్​ఆదివారమే హైదరాబాద్​కు చేరుకుంది. సోమవారం ఉదయం గాంధీ ఆస్పత్రికి వచ్చింది. ఈ సందర్భంగా హాస్పిటల్​ పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 10.30 గంటల సమయంలో రీ పోస్టుమార్టం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా స్థానిక డాక్టర్లెవరినీ లోపలికి అనుమతించలేదు. కేవలం నిందితుల కుటుంబ సభ్యులను మాత్రమే రానిచ్చారు. అవసరమైన పరికరాలను మాత్రం గాంధీ ఆస్పత్రి డాక్టర్లు సమకూర్చారు. ఒక్కో దేహానికి గంట టైం చొప్పున నాలుగు గంటల పాటు పోస్టుమార్టం జరిగింది. తర్వాత మూడు గంటల సమయంలో మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెండు అంబులెన్సుల్లో వారి స్వగ్రామాలు గుడిగండ్ల, జక్లేర్ లకు తరలించారు.

నిశితంగా పరిశీలించి..

నిందితుల డెడ్ బాడీలను ఎయిమ్స్ టీమ్ క్షుణ్నంగా పరిశీలించింది. అవి డీకంపోజింగ్ స్టేజీకి చేరుకోవడంతో ఒకింత ఇబ్బంది పడినట్టు సమాచారం. ఈ ప్రక్రియ మొత్తాన్నీ వీడియో రికార్డింగ్ చేశారు. తొలుత డెడ్ బాడీలకు ఎక్స్ రే తీసి.. ఎముకల ఫ్రాక్చర్స్​ఏమైనా ఉన్నాయా అన్నది చూశారు. తర్వాత గాయాలను, దెబ్బతిన్న అవయవాలను పరిశీలించారు. మహ్మద్ ఆరీఫ్​ఛాతీ భాగం, కుడివైపు కడుపులో ముందు, వెనుక బుల్లెట్లు దూసుకుపోయినట్లు గుర్తించారు. దాంతోపాటు అనుమానాస్పదంగా కనిపించిన గాయాల భాగం నుంచి శాంపిల్స్ సేకరించినట్టు సమాచారం. ఆరిఫ్​ నోటి నుంచి రక్తం బయటికి రావడానికి గల కారణాలను విశ్లేషించినట్టు తెలిసింది. బుల్లెట్ గాయాలతో అవయవాలు ధ్వంసమైన తీవ్రతను రికార్డ్ చేసినట్టు సమాచారం. తర్వాత చెన్నకేశవులు బాడీని పరిశీలించినట్టు తెలిసింది. బుల్లెట్ గాయాలేగాకుండా డెడ్ బాడీలపై ఇతర గాయాలేవైనా కనిపించాయా అని కుటుంబ సభ్యుల నుంచి సమాచారం తీసుకున్నట్టు తెలిసింది. చెన్నకేశవులు కడుపు కింది భాగంతోపాటు తొడలోకి బుల్లెట్​ దూసుకెళ్లిన బుల్లెట్ గాయాలను డాక్టర్లు పరిశీలించారు. గాయాలైన భాగాల నుంచి ఐదు రకాల శాంపిల్స్​ సేకరించినట్టు సమాచారం. తర్వాత మిగతా ఇద్దరి మృతదేహాలకు రీపోస్ట్​మార్టం చేశారు. బుల్లెట్ గాయాలేగాకుండా ఇంకేమైనా గాయాలున్నాయా అన్న కోణంలో పరిశీలించారు.

సుప్రీం గైడ్ లైన్స్​ ప్రకారం..

ఎన్ కౌంటర్ కేసుల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారమే ఎయిమ్స్​ డాక్టర్లు రీపోస్టుమార్టం చేసినట్లు తెలిసింది. మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో గాంధీ ఫోరెన్సిక్ డాక్టర్లు చేసిన పోస్టుమార్టం రిపోర్టులను పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. రీపోస్టుమార్టం ప్రక్రియను తీసిన వీడియో, సేకరించిన వివరాలు, శాంపిళ్ల రికార్డులను సీల్డ్​ కవర్​లో హైకోర్టుకు అందజేస్తామని డాక్టర్లు తెలిపారు.