తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ‘రియల్ ఎస్టేట్’ అనే పదం వినిపిస్తే ఆశ కాదు, ఆందోళన మొదలవుతోంది. ఇది గృహస్వప్నంగా మిగలడం లేదు, పెట్టుబడిగా నిలవడం లేదు. లక్షలాది కుటుంబాలపై జీవితకాల అప్పుల శిక్షగా మారింది. ‘ప్రీ లాంచ్’ అనేది మృదువైన పదజాలం.
అనుమతులు లేని భూములు, లే-అవుట్ ఆమోదం లేకుండా బుకింగులు, చట్టపరమైన స్పష్టత రాకముందే వేల కోట్ల వసూళ్లు. ఇవి వ్యాపార వ్యూహాలు కావు, అలాంటివి మోసాలు కావా? ఈ మోసాలకు బలయ్యేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన చిన్న ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు.
నెలకు రూ. 20 నుంచి 40 వేల ఆదాయంతో జీవించే వ్యక్తి ఇరవై నుంచి ముప్పై ఏళ్ల బ్యాంకు అప్పు తీసుకొని పిల్లల చదువు, పెళ్లి, ఆరోగ్యం అన్నింటినీ తాకట్టు పెట్టి జీవితాంతం వాయిదాల ఉరికి బానిస అవుతున్నాడు. చివరికి అప్పుల బరువు, నిద్రలేని రాత్రులు, ఇది సమాజంపై సాగుతున్న ఆర్థిక హింస. ఈ వ్యవస్థ ఒకే నమూనాలో పని చేస్తోంది. ముందుగా భారీ ప్రకటనలతో ఆశలు రెచ్చగొడతారు. సినిమా హీరోలతో ప్రకటనలు చేయించి ప్రజలను మాయచేస్తారు. కొన్ని నిజాయితీగా పని చేస్తున్నా.. అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు ఇదే మోసపు పద్ధతిని అనుసరించాయి.
హైదరాబాద్ పరిసరాల్లో అనేక సంస్థలు వేల కోట్ల మోసాలకు పాల్పడ్డాయి. ‘ప్రీ లాంచ్’ పేరిట వేల కోట్లు వసూలు చేసి ఏండ్లు గడిచినా నిర్మాణం పూర్తికావు. వేల కుటుంబాలు అద్దెలు, అప్పుల మధ్య నలిగిపోయాయి. బాధితులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. కానీ వేల కోట్ల మోసాలకు పాల్పడిన రియల్ ఎస్టేట్ సంస్థల విషయంలో రెరా చిన్న జరిమానాలతో చేతులు దులుపుకుంటోంది. ఇది నియంత్రణ కాదు, ఇది పాలనా నేరం.
హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇవ్వాలి
ఈ ఆర్థిక దాడిని ఎదుర్కోవడానికి సాధారణ శాఖలు సరిపోవడం లేదు. అందుకే హైడ్రా వంటి ప్రత్యేక సంస్థ ఆవిర్భవించడం అనివార్యమైంది. హైడ్రా పని కేవలం కూల్చివేతలు మాత్రమే కాదు; ప్రజల విశ్వాసాన్ని తిరిగి నిర్మించడం, మోసగాళ్లను వ్యవస్థ నుంచే పీకివేయడం, ఆర్థిక నేరాలను ప్రజాస్వామ్య నేరాలుగా గుర్తించి శిక్షించడమే దాని అసలు పాత్ర ఉంటే మంచిది.
నేర వ్యవస్థను ఎదుర్కోవడానికి హైడ్రా ఒక పరిపాలనా యంత్రాంగం కాదు, ప్రజల రక్షణ కోసం ఏర్పడిన ప్రత్యేక శక్తి కావాలి, ఆ వైపుగా నడవాలి. అందుకే హైడ్రా మోసపోయిన ప్రజల డబ్బు తిరిగి రాబట్టే సంస్థగా, అక్రమ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలపై యుద్ధం చేసే వ్యవస్థగా, అనుమతుల మాఫియాను ఛేదించే రక్షణగా, రాజకీయ ఆశ్రయంతో నడిచే నేరాలకు అడ్డుకట్టగా పనిచేయాలి.
మోసగాళ్ల నుంచి రికవరీ అనివార్యం చేయాలి
అనుమతులు లేని ప్రాజెక్టులకు బ్యాంకులు వేల కోట్ల అప్పులు ఎలా ఇస్తున్నాయి? భూ హక్కు పత్రాలు, లే-అవుట్ అనుమతులు, చట్టపరమైన స్పష్టత లేకుండా ప్రజల డిపాజిట్లతో నడిచే బ్యాంకులు ఈ మోసాలకు అండగా నిలవడం దేశ ఆర్థిక భద్రతకే ముప్పు. అందుకే పరిష్కారాలు కూడా అదే స్థాయిలో ఉండాలి. ఈ మోసాలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలి. నిందిత డైరెక్టర్ల వ్యక్తిగత, బినామీ ఆస్తులు తక్షణమే జప్తు చేసి ఆ డబ్బును బాధితులకు పంపిణీ చేయాలి.
ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక ఖాతా, కఠినమైన డిజిటల్ పర్యవేక్షణ, ఆ నిధులు ఆ ప్రాజెక్టుకే ఖర్చయ్యేలా చట్టబద్ధ నిర్బంధం చేయాలి. మోసం చేసిన కంపెనీలను శాశ్వతంగా నిషేధించాలి. రెరాకు అరెస్ట్ చేసే అధికారాలు ఇవ్వాలి. ఇకపై ఏ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రజల జీవితాలతో జూదం ఆడితే ఆ సంస్థ గోడలు రాష్ట్ర చట్టాలతోనే కూలిపోవాలి. ఎందుకంటే ఇది ప్రజల జీవితాల మీద జరుగుతున్న ఆర్థిక యుద్ధం. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మన ప్రజాప్రభుత్వం రియల్ఎస్టేట్ మోసాలపై కఠిన చట్టాలు తేవాలి.
పాపని నాగరాజు, సత్యశోధక మహాసభ
