ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటే అంగీకరించను

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటే అంగీకరించను
  • దిశ కమిషన్ ముందు సజ్జనార్ వివరణ

హైదరాబాద్: దిశ ఎన్ కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ ఎదుట ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ హాజరయ్యారు. హైదరాబాద్ నగర శివార్లలో యువతిపై అత్యాచారం చేసిన నలుగురు యువకులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి అన్ని వర్గాలను కుదిపేసింది. పోలీసులపై ఒత్తిడి పెరగడం.. అదే క్రమంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం సంచలనం రేపింది. అయితే ఇది ఫేక్ ఎన్ కౌంటర్ అని ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు స్పందించి విచారణకు ‘దిశ’ కమిషన్ ను ఏర్పాటు చేసింది.  విచారణ చేపట్టిన దిశ కమిషన్ ముందు ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ మంగళవారం హాజరయ్యారు. దిశ కమిషన్ ప్రశ్నలకు సజ్జనార్ ఇచ్చిన జవాబులు ఇలా ఉన్నాయి..
కమిషన్: మిమ్మల్ని ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా  మీడియా అభివర్ణించింది.. మీరు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అని ఒప్పుకుంటారా ?  
సజ్జనార్: నేను అంగీకరించను.
కమిషన్: ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏమిటి ?  
సజ్జనార్: నాకు తెలియదు
కమిషన్: మీరు ప్రతీది డీసీపీ చెప్తేనే తెలిసింది అంటున్నారు.. అన్నింటికీ డీసీపీ పైనే ఆధార పడతారా?
సజ్జనార్: గ్రౌండ్ లెవెల్ లో ఆఫీసర్లకు పూర్తి సమాచారం ఉంటుంది.. వారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తాను. 
కమిషన్: దిశ అత్యాచారం జరిగిన రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు ?
సజ్జనార్: మిస్సింగ్ కంప్లైంట్ రాగానే బాధితురాలి కోసం వెతకడంలో కొంత సమయం డిలే అయ్యింది. 
కమిషన్: ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? 
సజ్జనార్: ఎఫ్ ఐ నమోదు చేయడంలో అలసత్వం వహించిన నలుగురు పోలీస్ సిబ్బంది పైన సస్పెన్షన్ విధించాం.
కమిషన్: మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వల్లే విచారణ సరిగా చేయలేకపోయాము అని సాక్షులు చెప్పారు ? 
సజ్జనార్: ఎన్ కౌంటర్ స్పాట్ కి 300 మీటర్ల దూరంలో విచారణకు ఆటంకం కలగకుండా మీడియో సమావేశం ఏర్పాటు చేశాం.
కమిషన్: మీడియా సమావేశం కోసం కుర్చీలు, టేబుల్లు తదితర సామగ్రిని అంత తక్కువ సమయంలో  ఎక్కడి నుండి తెచ్చారు ? 
సజ్జనార్: షాద్‌నగర్ పోలీసులు సామగ్రి తీసుకొచ్చారు. అయితే ఎక్కడి నుండి  తీసుకొచ్చారో నాకు తెలియదు. ఆ ఘటన జరిగి రెండు సంవత్సరాలు అయ్యింది, నాకు గుర్తు లేదు.