
సంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి ప్రజలకు చేరాలని ఎంపీ, దిశా కమిటీ అధ్యక్షుడు సురేశ్ షెట్కార్ సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను సక్సెస్ చేయాలన్నారు. బుధవారం ఆయన అధ్యక్షతన జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం సంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సమీక్షించారు. గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం, విద్యా, ఆరోగ్య రంగాల్లో జరుగుతున్న పనులపై చర్చ జరిగింది. అధికారుల నివేదికల ఆధారంగా, సమస్యాత్మక అంశాలు గుర్తించి వాటి పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సహ అధ్యక్షుడు ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ క్రాంతి హాజరయ్యారు.
పనులు పూర్తి చేయండి
ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ జిల్లాలో అసంపూర్తి పనులు చాలా ఉన్నాయన్నారు. 65వ నేషనల్ హైవే పనులు వెంటనే పూర్తి చేసేలా నేషనల్ హైవే అధికారులు కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. పటాన్ చెరు, జహీరాబాద్ నేషనల్ హైవేలో మల్కాపూర్, నాందేడ్ అకోలా రహదారిలో, సుల్తాన్ పూర్ వద్ద అసంపూర్తిగా ఉన్న పనులు వెంటనే పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో కొత్తగా ప్రభుత్వ స్కూల్‌ను నిర్మించడం కోసం ఉన్న భవనాన్ని కూల్చివేశారని భవన నిర్మాణం పనులు చేపట్టకపోవడంతో స్టూడెంట్స్ చెట్ల కింద చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే స్కూల్‌భవనం నిర్మించేలా అధికారులు, కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వెంటనే అమలు చేయాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ జ్యోతి, దిశ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు
పాల్గొన్నారు.