ఉద్యానశాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పోతున్నయ్​

ఉద్యానశాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పోతున్నయ్​

జీతాలియ్యలేక 300 మందిని తొలగించిన్రు
ఉన్నోళ్లకు మూడు నెలలుగా జీతాలియ్యట్లే
వచ్చేనెల మరో100 మందిని తొలగించేందుకు రెడీ
నిధులివ్వని సర్కార్.. రోడ్డున పడుతున్న ఉద్యోగులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర హార్టికల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ లో పని చేస్తున్న ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక ఏటా కొంత మందిని ఇంటికి పంపుతున్నరు. ఉద్యాన పంటలకు ఇక్కడి వాతావరణం అత్యంత అనుకూలమైనదని సర్కార్ చెప్తూనే.. మరోపక్క బడ్జెట్‌‌లో నిధులు ఇవ్వకపోవడంతో ఉన్న ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 300 మంది ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోయినేడాది తీసేశారు. ఈ యేడు మరి కొందరిని తీసేసే ప్రయత్నాలు జరుగుతున్నయి. రెండు దశాబ్దాలుగా సంస్థలో పని చేస్తున్నా తమను ఉన్నఫళంగా ఇంటికి పంపుతున్నారని ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగనంపేందుకు ఏర్పాట్లు 

రాష్ట్ర సర్కారు గత రెండేళ్లుగా మిషన్‌‌ ఫర్‌‌ ఇంటిగ్రేటెడ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ హార్టికల్చర్‌‌(ఎంఐడీహెచ్‌‌), మైక్రో ఇరిగేషన్‌‌ ప్రాజెక్ట్‌‌(ఎంఐపీ) తదితర పథకాలకు వాటా నిధులు ఇవ్వకున్నా  కేంద్ర ప్రభుత్వం ఇతర పథకాలకు అందిస్తున్న నిధులను మళ్లించి ఇన్నాళ్లు జీతాలు ఇస్తున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పైసా సాయం అందించక పోవడంతో నిరుడు శాలరీస్‌‌ ఇచ్చే పరిస్థితి లేక 300 మందిని 2020 ఏప్రిల్‌‌ నుంచి తొలగించారు.  2020–21లోనూ  రాష్ట్ర ప్రభుత్వం వాటా సాయం అందలేదు. దీంతో  వచ్చే నెల ఏప్రిల్ నుంచి మరో 100 మందికి పైగా ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వడం కష్టమని తొలగించేందుకు హార్టికల్చర్‌‌ శాఖ సిద్ధమవుతోంది.

కేంద్ర నిధులతోనే నెట్టుకొస్తున్నరు

హార్టికల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు ఈ యేడు లక్ష రూపాయలే సాయం అందించింది. నిరుడు ఒక్క పైసా కూడా ఇయ్యలేదు. ఇలా హార్టికల్చర్‌‌ శాఖపై సర్కారు నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే  ఇప్పటి వరకు సంస్థ గట్టెక్కుతూ వస్తోంది. గత మూడేళ్లుగా బడ్జెట్‌‌లో సర్కారు నిధులివ్వక హార్టికల్చర్ స్కీమ్ లన్నీ మూలన పడుతున్నయి. సెంట్రల్‌‌ స్కీములకు కేటాయించాల్సిన మ్యాచింగ్‌‌ గ్రాంట్స్‌‌ ఇవ్వక ముందుకు సాగుతలేవు. దీంతో సంస్థను నడపలేక ఉన్న ఉద్యోగులను
తొలగిస్తున్నారు.

మూడేళ్లుగా నిర్లక్ష్యమే..

2020–21బడ్జెట్‌‌లో కేంద్రం రూ.80 కోట్లు కేటాయించగా, రాష్ట్ర  వాటాకు  రూ.200 కోట్ల వరకు నిధులు అవసరం. 2020–21 రాష్ట్ర బడ్జెట్‌‌లో రూ.299 కోట్లు కేటాయింపులు చేసి ఇప్పటిదాకా నిధులు విడుదల చేయలే. సీఎం దగ్గరున్న ఫైల్​కు ఇప్పటికీ  కదలిక లేనట్లు సమాచారం.  సీఎం గ్రీన్‌‌ సిగ్నల్‌‌ రాక మైక్రో ఇరిగేషన్‌‌ కు పైసా రాలేదు. రెండేళ్లలో మైక్రో ఇరిగేషన్‌‌కు ఫండ్స్ కేటాయించలేదు. దీంతో డ్రిప్స్​ పూర్తిగా నిలిపివేసింది. దీంతో నీటి వసతులు తక్కువుండే ప్రాంత రైతులకు సాయం అందకుండా పోయింది. రాష్ట్ర వాటా లేక డ్రిప్‌‌, స్ప్రింకర్ల కల్టివేషన్‌‌ కు గత 2018–19 నుంచే బ్రేక్‌‌ పడింది.

కూరగాయల నారుతో జీతాలు

హార్టికల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ గత రెండేళ్లుగా కూరగాయల నారు అమ్ముకుని ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉగ్యోగులకు జీతాలు ఇస్తూ వచ్చింది. టమాట, వంకాయ తదితర కూరగాయల నారును సబ్సిడీతో ఇచ్చేవారు. అలా వాటి నుంచి వచ్చిన నిధులతో సంస్థలో పని చేసే ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగులకు శాలరీస్‌‌ ఇచ్చేది. ఈ యేడు నారు కూడా అమ్మే పరిస్థితి లేక జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మరో వంద మందిని వదిలించుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.