సిరిసిల్ల టీఆర్ఎస్​లో లొల్లి

సిరిసిల్ల టీఆర్ఎస్​లో లొల్లి
  • అర్బన్ బ్యాంకు సీఈవో నియామకంపై పాలకవర్గంలో వివాదం
  • సొంత పార్టీ చైర్మన్​పైనే డైరెక్టర్ల అవిశ్వాసం
  • రంగంలోకి దిగిన టీఆర్ఎస్ నేతలు
  • కేటీఆర్ క్యాంపు ఆఫీసులో సయోధ్యకు యత్నాలు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: మంత్రి కేటీఆర్​ ఇలాకా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్​ లీడర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. అర్బన్​బ్యాంకు చైర్మన్​పై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. సెస్ పాలకవర్గం మొత్తం టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే. అయినప్పటికీ మంత్రి కేటీఆర్ కు తెలియకుండా అవిశ్వాస నోటీస్ ఇవ్వడంపై రాజకీయంగా తీవ్ర చర్చ నడుస్తోంది. 2019 జూన్​లో సిరిసిల్ల అర్బన్ బ్యాంకు పాలకవర్గం ఏర్పడింది. మొత్తం 11 మంది డైరెక్టర్లు ఉండగా 8 నెలల క్రితం ఒకరిపై అనర్హత వేటు పడింది. కొంతకాలంగా అర్బన్ బ్యాంకు చైర్మన్ గాజుల నారాయణ, డైరెక్టర్ల మధ్య పొంతన కుదరడం లేదు. ఆర్థిక వ్యవహారాల్లో పాలకవర్గం మధ్య విభేదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇటీవల 10 మంది డైరెక్టర్లలో 8 మంది చైర్మన్ గాజుల నారాయణకు వ్యతిరేకంగా సంతకాలు చేసి జిల్లా కోఆపరేటివ్ అధికారికి అందించారు. పాలవకర్గంలో డైరెక్టర్లకు గౌరవం ఇవ్వడం లేదని, తమ సలహాలు, సూచనలు తీసుకోకుండానే చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్లు లెటర్​లో పేర్కొన్నారు. సీఈవో ప్రకాశ్​ను తొలగించి.. స్థానికుడిని సీఈవోగా నియమించాలని మెజార్టీ డైరెక్టర్లు సూచించినా చైర్మన్ గాజుల నారాయణ పట్టించుకోవడం లేదని, తాను చెప్పినట్లు డైరెక్టర్లు వినాలంటూ అవహేళనగా మాట్లాడుతున్నారని పేర్కొంటున్నారు. అవిశ్వాస తీర్మానం నోటీస్​పై సంతకాలు చేసి డీసీవోకు ఇవ్వడంతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. 

కుదరని సయోధ్య

సిరిసిల్ల అర్బన్ బ్యాంకు పాలకవర్గం వివాదం సద్దుమణిగించేందుకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కేటీఆర్ మేనబావ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చీటీ నర్సింగరావ్, పట్టణధ్యక్షులు జిందం చక్రపాణి కేటీఆర్ క్యాంపు ఆఫీసులో చైర్మన్, డైరెక్టర్లతో చర్చలు జరిపారు. సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఎంత చెప్పినా డైరెక్టర్లు వినకపోవడంతో చర్చలు సోమవారానికి వాయిదా వేశారు. అర్బన్ బ్యాంకు విషయంలో అవిశ్వాసం పెడితే.. ఈ పర్యవసానం కాస్తా మున్సిపల్, సింగిల్​విండో పాలకవర్గాలకు కూడా పాకుతుందని టీఆర్ఎస్ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఎలాగైనా అర్బన్ బ్యాంకు పాలకవర్గం వ్యవహారం చక్కదిద్దేందుకు టీఆర్ఎస్ ముఖ్య నేతలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు గౌరవం ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని డైరెక్టర్లు టీఆర్ఎస్ ముఖ్య నేతలతో పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంపై అర్బన్ బ్యాంకు చైర్మన్ గాజుల నారాయణను వివరణ కోరగా తాను డైరెక్టర్లనందరినీ గౌరవిస్తానని, ఎందుకు అవిశ్వాసం నోటీస్ ఇచ్చారో తనకు తెలియదని పేర్కొన్నారు. 

మొన్న సెస్.. ఈ రోజు అర్బన్ బ్యాంకు

రాజన్నసిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు మంత్రి కేటీఆర్​కు తలనొప్పిగా మారాయి. సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ(సెస్) చైర్మన్​గా గూడూరి ప్రవీణ్​తోపాటు 14 మంది డైరెక్టర్లను నామినేట్​చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేయగా.. అధికార పార్టీ నేతలే పిటిషనర్​వెనక ఉండి కోర్టు స్టే తీసుకువచ్చినట్లు సిరిసిల్లలో చర్చ సాగుతోంది. దీంతో మంత్రి కేటీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వేసిన సెస్ పాలకవర్గం రెండు నెలలు గడవకముందే రద్దయింది. తాజాగా సిరిసిల్ల అర్బన్ బ్యాంకులో సైతం టీఆర్ఎస్ గ్రూపు రాజకీయాలతో చైర్మన్ గాజుల నారాయణపై అవిశ్వాసం నోటీస్ ఇచ్చేవరకు వెళ్లింది. సిరిసిల్లలోని కీలక నేతలే డైరెక్టర్లకు పరోక్షంగా మద్దతు పలికి అవిశ్వాసం నోటీస్​ఇచ్చేలా పురిగొల్పినట్లు టీఆర్ఎస్​లీడర్ల మధ్య చర్చ నడుస్తోంది. జిల్లా అధ్యక్షుడిగా తోట ఆగయ్య నియామకం అయ్యాక.. ఈ గ్రూపు రాజకీయాలు మరింత ముదిరినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.