- స్పీకర్ సమక్షంలోకౌశిక్ రెడ్డిని ప్రశ్నించినదానం తరఫు అడ్వకేట్లు
- విచారణకు గైర్హాజరైన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు వేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ శుక్రవారం విచారణ చేపట్టారు. అసెంబ్లీలోని ట్రిబ్యునల్ కోర్టులో విచారణ కొనసాగింది. ఎమ్మెల్యే దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనర్హత పిటిషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురికి గురువారం నోటీసులు పంపిన స్పీకర్.. శుక్రవారం విచారణ చేపట్టారు.
దానం తరఫున ఆయన అడ్వకేట్లు హాజరు కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డిని దానం తరఫు అడ్వొకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. దానంపై అనర్హత పిటిషన్ ఎందుకు వేశారు? ఆయన పార్టీ మారినట్లు మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. దీంతో తన వద్ద ఉన్న వీడియో క్లిప్పింగ్‌లను, ఫొటోలను, మీడియాలో వచ్చిన వార్తలను స్పీకర్ కు కౌశిక్ రెడ్డి అందించారు.
బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం, ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన పలు ఆధారాలను ఈ సందర్భంగా స్పీకర్ కు కౌశిక్ రెడ్డి అందించారు. దీంతో ఆయన విచారణను స్పీకర్ ముగించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని దానం తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సి ఉన్నప్పటికీ ఆయన విచారణకు హాజరుకాలేదు.
తాను మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నందున విచారణకు హాజరుకాలేనని స్పీకర్ కు సమాచారం అందించారు. ఇదే సమయంలో దానంపై అనర్హత పిటిషన్ వేయడానికి గల ఆధారాలకు సంబంధించిన అఫిడవిట్ ను ఏలేటి తన అడ్వకేట్ల ద్వారా స్పీకర్ కు అందించారు.
తాను స్వయంగా క్రాస్ ఎగ్జామిన్ కు హాజరుకావాలంటే ఫిబ్రవరి 20 వరకు సమయం ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ ఫిబ్రవరి 18న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుండగా ఇప్పటికే 8 మందిపై విచారణ పూర్తి చేసి ఏడుగురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావ్, అరికెపూడి గాంధీ ఉన్నారు.
ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై విచారణ పూర్తి చేసి తీర్పును స్పీకర్ రిజర్వ్ లో ఉంచారు. దానంపై విచారణ కొనసాగుతున్నది. ఇక మిగిలిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు స్పందించి అఫిడవిట్ అందించారు. ఆయనపై విచారణ చేపట్టాల్సి ఉంది.
