ఆత్మీయ సమ్మేళనంలో అసంతృప్తి సెగలు

ఆత్మీయ సమ్మేళనంలో అసంతృప్తి సెగలు

జగదేవపూర్, వెలుగు : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  లీడర్లు మాట్లాడుతున్న సందర్భంగా పలువురు కార్యకర్తలు జోక్యం చేసుకుని తాము చెప్పింది కూడా వినాలని పట్టుబట్టారు. పార్టీ జిల్లా ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ములుగు ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, రంగ వెంకట్ గౌడ్ , కార్యకర్తలతో కలిసి అడ్డుకున్నారు. వేదికపై కూర్చున్న వారి కోసమే ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టుగా ఉందని, కార్యకర్తలకు కూడా మాట్లాడే అవకాశం కల్పించాలన్నారు.

దీంతో నాయకులకు, కార్యకర్తలకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో ఎఫ్​డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి  కలగజేసుకొని కార్యకర్తలకు మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పడంతో శాంతించారు. తర్వాత పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ.. ఉద్యమ టైం నుంచి పార్టీ కోసం పని చేస్తున్న తమను నాయకులు పట్టించుకోవడంలేదని, పార్టీ అధికారంలో ఉన్నా తమను ఎవరూ గుర్తించడం లేదన్నారు. తమకు గుర్తింపు ఇస్తే పార్టీని కాపాడుకుంటామని,  సీఎంతో ఒకసారి నియోజకవర్గ  కార్యకర్తలతో సమావేశాన్ని  ఏర్పాటు చేయించాలని కోరారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు.