మహబూబాబాద్​ జిల్లా జడ్పీ సమావేశంలో బహిర్గతమైన పార్టీలో లుకలుకలు

 మహబూబాబాద్​ జిల్లా జడ్పీ సమావేశంలో బహిర్గతమైన పార్టీలో లుకలుకలు

మహబూబాబాద్, వెలుగు: జడ్పీ సమావేశం వేదికగా అధికార పార్టీలో కలుకలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంగళవారం మహబూబాబాద్ ​జిల్లా కేంద్రంలోని జడ్పీ భవన్ లో సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ శశాంక, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలతి కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, సీతక్క,  కలెక్టర్​శశాంక, వివిధ శాఖల ఆఫీసర్లు వచ్చారు. వివిధ మండలాల జడ్పీటీసీలు వచ్చినప్పటికీ సమావేశానికి హాజరు కాకుండా బైకాట్​చేశారు. 

జడ్పీ చైర్​పర్సన్​ తీరుకు నిరసనగా..

మహబూబాబాద్ జడ్పీ చైర్​పర్సన్ గా ఆంగోత్ బిందు ఎన్నికైనప్పటి నుంచి వచ్చిన నిధుల్లో ఎక్కువగా బయ్యారం మండలంలో ఖర్చు చేశారు. ఇతర మండలాలకు నిధులు కొంతమేరకు  కేటాయించినా స్థానిక జడ్పీటీసీలకు తెలియకుండా ఇష్టమున్న వ్యక్తులకు పనులను ఇవ్వడం, పలుసార్లు ప్రోటోకాల్ ఉల్లంఘనలతో జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ మండలాల జడ్పీటీసీలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రతిసారి మీటింగ్ కు హాజరై  అనేక సమస్యలు తెలిపినా ఆఫీసర్లు సరిగా పట్టించుకోవడం లేదని,  తాము గెలిచిన మండలంలో డెవలప్​మెంట్​ప్రోగ్రామ్స్ చేపట్టలేకపోతున్నామని అంటున్నారు. మీటింగ్ కు ముందే చైర్​పర్సన్​ గదికి వచ్చిన జడ్పీటీసీలంతా బైకాట్​నిర్ణయం తీసుకున్నారు. అధికార, ప్రతిపక్ష జడ్పీటీసీలు సైతం మీటింగ్​కు వెళ్లలేదు. మంత్రి సత్యవతి రాథోడ్, ప్రజాప్రతినిధులు జడ్పీటీసీలు ఉన్న గది వద్దకు వెళ్లి సమావేశానికి హాజరు కావాలని, విషయాలు ఏమన్నా ఉంటే అంతర్గతంగా చర్చించుకుందామని బతిమిలాడినా ఫలితం లేకపోయింది. ప్రతిసారి ఏదో ఒక సాకు చెబుతూ దాటవేస్తున్నారని జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిమం కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జడ్పీ సీఈవో రమాదేవి ప్రకటించారు.