700 కోట్లు ఎటూ సాల్తలేవు.. అంతకంతకూ పెరుగుతున్న రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం

700 కోట్లు ఎటూ సాల్తలేవు.. అంతకంతకూ పెరుగుతున్న రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం
  • బీఆర్ఎస్ నిర్వాకంతో.. ఆదాయంలో మూడోవంతు ఉద్యోగుల జీతాలు, పింఛన్లకే 
  • కోర్టు మెట్లు ఎక్కుతున్న రిటైర్డ్ ఉద్యోగులు 
  •  ఫైనాన్స్ సెక్రటరీపై వారానికి 60 నుంచి 70 కంటెంప్ట్ కేసులు 
  • రూ. 9 వేల కోట్లు దాటిన బకాయిలు.. తీవ్ర ఇబ్బందుల్లో  మాజీ ఉద్యోగులు
  • ఆరోగ్య సమస్యలు వస్తే ఇక అంతే సంగతులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. పదవీ విరమణ చేసి ఏండ్లు గడుస్తున్నా బెనిఫిట్స్ చేతికి అందడం లేదు. పాత బకాయిలకుతోడు నాడు ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం ద్వారా బీఆర్ఎస్​ సర్కారు తప్పించుకున్న భారమంతా నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపైనే పడింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.9 వేల కోట్లకుపైగా పేరుకుపోయాయి. వీటి చెల్లింపుల కోసం నెలనెలా రాష్ట్ర సర్కారు విడుదల చేస్తున్న రూ.700 కోట్లు ఎటూ చాలట్లేదు. క్లియర్​ చేస్తున్న బకాయిలను మించి కొత్త రిటైర్మెంట్ల బెనిఫిట్స్​ యాడ్​అవుతుండడంతో ఆర్థికశాఖ తల పట్టుకుంటోంది. మరోవైపు ఏళ్ల తరబడి నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో, తమ బెనిఫిట్స్ కోసం రిటైర్డ్​ఉద్యోగులు చివరికి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.

కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఫైనాన్స్ సెక్రటరీపై వారానికి ఏకంగా 60 నుంచి 70  కోర్టు ధిక్కరణ కేసులు నమోదు అవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రాష్ట్రానికి వస్తున్న మొత్తం ఆదాయంలో మూడోవంతు ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లకే పోతోంది. మిగిలిన ఆదాయంలో ప్రభుత్వ నిర్వహణ, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలో అతికష్టం మీద ప్రభుత్వం ప్రతి నెలా రూ.600 నుంచి రూ.700 కోట్లు విడుదల చేస్తున్నా పరిస్థితి చక్కబడడం లేదు. 

ట్రీట్మెంట్​కు డబ్బుల్లేక రిటైర్డ్ ఎస్ఐ మృతి  
ఖమ్మం నగరానికి చెందిన కుక్కల మైసయ్య గతేడాది ఫిబ్రవరిలో ఏఆర్ ఎస్ఐగా రిటైర్ అయ్యారు. భార్యాభర్తలిద్దరూ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం ఈ నెల18న వారు ఖమ్మంలోని ఆస్పత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసం భార్యను హైదరాబాద్​కు తరలించగా, మైసయ్య బుధవారం రాత్రి చనిపోయారు. ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రి బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉండడంతో రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం కొద్దిమొత్తంలో బిల్లులు చెల్లించి భౌతికకాయాన్ని ఇంటికి తరలించింది. 

మైసయ్యకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.55 లక్షల వరకు రావాల్సి ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ డబ్బులు సకాలంలో అంది ఉంటే, భార్యాభర్తలిద్దరికీ మెరుగైన వైద్యం చేయించుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ప్రయోజనాలు అందక రిటైర్డ్ ఉద్యోగులు అష్టకష్టాలు పడ్తున్నారు. వయసు పైబడిన ఈ తరుణంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పులపాలవుతున్నారు. 

ఏటా రూ. 7 వేల కోట్ల దాకా..
ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజున పదవీ విరమణ ప్రయోజనాలన్నీ చేతిలో పెట్టి, సన్మానించి, సగౌర వంగా సాగనంపాలంటూ గత సీఎం కేసీఆర్​ చెప్పిన మాటలు మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యాయి. ఆయన ఆకాంక్షకు బీఆర్ఎస్ ​హయాంలోనే కాలం చెల్లింది. రిటైర్మెంట్​ బెనిఫిట్స్ కోసం సకాలంలో, సరిపడా నిధులు విడుదల చేయకపోవవడంతో పదవీ విరమణ పొందిన వెంటనే రావాల్సిన పీఆర్సీ, జీపీఎఫ్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ వంటివి ఏళ్ల తరబడి పెండింగ్ పడ్తూ వచ్చాయి. 

దీనికి తోడు 2021లో రిటైర్మెంట్ల భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏండ్లకు కేసీఆర్ సర్కారు పెంచింది. దీంతో  మూడేండ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు జరగకపోవడంతో ఆ చెల్లింపులను తప్పించుకున్నది. తీరా కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిటైర్మెంట్ల భారం మొదలైంది. ఓ వైపు పాత బకాయిల కొండ కరగకపోగా, ప్రతి నెలా వందలాది మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందుతుండటం మరింత భారంగా మారుతోంది.

అధికారిక గణాంకాల ప్రకారం వచ్చే ఏడాది దాదాపు 9,978 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నారు. వీరందరికీ చెల్లించాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్‌‌‌‌క్యాష్‌‌‌‌మెంట్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం సుమారు రూ.6 వేల నుంచి 7 వేల  కోట్ల దాకా అవసరమవుతాయని అంచనా.  ఇలా కొత్తగా రిటైర్ అవుతున్న వారికి చెల్లించాల్సిన బెనిఫిట్స్ రూపంలో ప్రతినెలా అదనంగా వందల కోట్లు బకాయిల ఖాతాలో వచ్చి చేరుతున్నాయి.

పెరిగిపోతున్న ఈ బకాయిలను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం నెలకు కేటాయిస్తున్న రూ.700 కోట్లు ఏమాత్రం సరిపోవడం లేదు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ప్రాధాన్యత క్రమంలో ఇచ్చుకుంటూ పోయినా ఈ నిధులు ఏ మూలకూ చాలడం లేదు. ప్రభుత్వం కేటాయిస్తున్న ఈ అరకొర నిధులతో ముందుకెళితే ప్రస్తుత బకాయిలు పూర్తిగా తీరడానికి కనీసం పదేళ్లు పడుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

బెనిఫిట్స్ కోసం కోర్టులకు..  
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఫైనాన్స్ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన రిటైర్డ్​ఉద్యోగులు చివరి అస్త్రంగా న్యాయ పోరాటానికి దిగుతున్నారు. తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల పిటిషన్లపై విచారణ జరుపుతున్న న్యాయస్థానాలు తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆదేశిస్తున్నా ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదు. కోర్టు తీర్పులను సైతం ఆర్థిక శాఖ అధికారులు అమలు చేయకపోవడంతో ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయి. 

ఈ పరిణామాలతో ఏకంగా రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీపై వారానికి సగటున 60 నుంచి 70 కంటెంప్ట్ కేసులు నమోదవుతున్నాయి. ఒకవైపు రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే.. బడా కాంట్రాక్టర్లకు మాత్రం ప్రతినెలా టంచన్ గా పెద్ద మొత్తంలో ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ల చెల్లింపులకు నిధులు ఉంటున్నప్పుడు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్​ చెల్లించేందుకు ఎందుకు ఉండ వని ప్రశ్నిస్తున్నారు.  

అనారోగ్యం పాలైతే అంతే సంగతులు.. 
జీవిత చరమాంకంలో ఆసరాగా నిలవాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పిల్లల చదువులు, పెండ్లిళ్లు, ఇండ్ల నిర్మాణాల కోసం ఆశపెట్టుకున్న వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందో వెనుకో బెనిఫిట్స్ వస్తాయనే ఆశతో అప్పులు చేస్తున్నవాళ్లు వాటికి వడ్డీలు, కిస్తీలు కట్టలేక ఆగమవుతున్నారు. 

ఇక వృద్ధాప్యం కారణంగా ఆరోగ్య సమస్యలు చుట్టుముడ్తున్నవారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. చేతిలో చిల్లిగవ్వ లేక, ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు పోసి వైద్యం చేయించుకోలేక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులు ఎందరో ఉన్నారు.

తీవ్రమైన ఒత్తిడి, బెనిఫిట్స్ రావనే ఆందోళనతో కొందరు గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు కలచివేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతినెలా రిలీజ్ చేస్తున్న మొత్తం రెండేండ్ల కింద రిటైర్ అయిన వారి పాత బకాయిలకే సర్దుబాటు అవుతున్నాయి. అంటే, ఇప్పుడు రిటైర్ అయ్యే వారికి తమ బెనిఫిట్స్ దక్కాలంటే కనీసం మరో రెండేండ్ల పాటు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపులు పూర్తిస్థాయిలో క్లియర్ చేసేలా రాబోయే బడ్జెట్​లో నిధులు కేటాయించాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుంచి వ్యక్తమవుతోంది. 

అప్పులతో నెట్టుకొస్తున్నా..
నేను 2025 జులైలో గెజిటెడ్ హెడ్మాస్టర్​గా రిటైర్ అయ్యాను. నాకు ఇప్పటివరకు ఎలాంటి బెనిఫిట్స్ అందలేదు. గ్రాట్యుటీ, లీవ్ ఎన్​క్యాష్​మెంట్, కాంప్టేషన్, జీపీఎఫ్, జీఎల్ఐ, జీఐఎస్ కింద దాదాపు రూ.80 లక్షలు రావాల్సి ఉంది. నేను యాక్చువల్​గా 2022లో రిటైర్ కావాల్సింది. ఆ పైసలు వస్తాయనే ఆశతో అప్పు తెచ్చి బిడ్డ పెండ్లి ఘనంగా చేసిన. కానీ, కేసీఆర్ గవర్నమెంట్ మూడేండ్లు సర్వీస్ ఎక్స్టెన్షన్ చేసి ఉద్యోగులను కష్టాల్లో ముంచింది. రిటైర్మెంట్ డబ్బులు రాకపోవడంతో బ్యాంకు లోన్ తీసుకొని ప్రైవేట్ అప్పులు తీర్చాను.

బ్యాంకు లోన్ ఈఎంఐ నెలకు రూ.1.10 లక్షలు కట్టాలి. పెన్షన్ డబ్బులు రూ.90 వేలు పోగా మరో రూ.20 వేలు అప్పు చేసి ఈఎంఐ చెల్లిస్తున్న. కుటుంబ ఖర్చుల కోసం నెలకు మరో రూ.50 వేలు అప్పు చేయాల్సి వస్తోంది. రిటైర్మెంట్ తర్వాత ఎవరూ నమ్మడం లేదు. అప్పు పుడ్త లేదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

సాదు లింగయ్య (రిటైర్డ్ జీహెచ్ఎం), బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా

ఇల్లు కట్టుకుందామనుకున్న.. నేను హుజురాబాద్ జెడ్పీహెచ్ఎస్ 
గర్ల్స్ హైస్కూల్​లో పీఈటీగా 2025 జనవరిలో రిటైర్ అయిన. గ్రాట్యుటీ, జీపీఎఫ్ తదితర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కలిపి రూ.60 లక్షల వరకు రావాల్సి ఉంది. హుజురాబాద్​లో మాకు పాత ఇల్లు ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే దాని స్థానంలో కొత్త ఇల్లు కట్టుకుందామని అనుకున్నా. ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వకపో వడంతో ఇంటి నిర్మాణం వాయిదా వేయాల్సి వచ్చింది.

సొల్లు సారయ్య, రిటైర్డ్ పీఈటీ, హుజూరాబాద్