- గతంతో చూస్తే పన్ను ఆదాయంలో రూ.14 వేల కోట్లే పెరుగుదల
- జనవరి వరకు 1.26 లక్షల కోట్ల ట్యాక్స్ రెవెన్యూ
- అంచనాల మేర పెరగని రెవెన్యూ స్టాంప్స్, ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్ ఆదాయం
- జీతాలు, పాత అప్పుల వడ్డీలకే ఆవిరవుతున్న ఇన్కం
- పరిమితులు దాటేసి రూ.69 వేల కోట్లకు చేరిన రాష్ట్ర ద్రవ్యలోటు
- ‘కాగ్’ తాజా నివేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను వసూళ్ల ద్వారా రూ.1.26 లక్షల కోట్ల రాబడి మాత్రమే సమకూరింది. గతేడాది సరిగ్గా ఇదే సమయానికి రాష్ట్రానికి పన్నుల రూపంలో రూ.1.12 లక్షల కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. దీనిని బట్టి చూస్తే గతేడాది వసూళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది అదనంగా వచ్చిన పన్నుల ఆదాయం కేవలం రూ.14 వేల కోట్లే కావడం గమనార్హం. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులైన రెవెన్యూ స్టాంప్స్, ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్ రాబడులు ఏమాత్రం లక్ష్యం మేర పెరగలేదు.
బడ్జెట్ అంచనాలను చేరుకోవాలంటే కేవలం ఫిబ్రవరి, మార్చి.. ఈ రెండు నెలల్లోనే ఇంకో రూ.46 వేల కోట్లు రాబట్టాల్సి ఉంది. అయితే, ఇప్పటికే ఫిబ్రవరి ముగింపునకు రావడం, తక్కువ వ్యవధిలో ఇంత భారీ మొత్తంలో నిధులు సమీకరించడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదిక ఆందోళనకరమైన లెక్కలను వెల్లడించింది.
నాన్ట్యాక్స్లో వచ్చిది 24 శాతమే..
తాజా కాగ్ లెక్కలను పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ స్తబ్దతతో స్టాంప్స్, రిజిస్ట్రేషన్లతో పది నెలల్లో సగటున నెలకు రూ.1,234 కోట్లతో మొత్తం రూ.12,345 కోట్లు వచ్చాయి. అయితే, లక్ష్యం రూ.19,087 కోట్లుగా ఉన్నది. ఈ రెండు నెలల్లో నెలకు రూ.3,371 కోట్లు రావాల్సి ఉన్నది. ఎక్సైజ్ (మద్యం) రాబడి నెలకు సగటున రూ.1,908 కోట్లతో మొత్తం రూ.19,083 కోట్లు వస్తే.. బడ్జెట్ అంచనా రూ.27,623 కోట్లను అందుకోవాలంటే మిగిలిన 2 నెలల్లో నెలకు ఏకంగా రూ.4,270 కోట్లు రాబట్టాలి.
వాణిజ్య పన్నుల (సేల్స్ ట్యాక్స్) వసూళ్లు సగటున నెలకు రూ.2,791 కోట్లతో రూ.27,911 కోట్లకు పరిమితం కాగా.. నిర్దేశిత రూ.37,463 కోట్లు దాటాలంటే ఇక నెలకు రూ.4,776 కోట్ల చొప్పున వసూలు చేయాలి. అత్యంత కీలకమైన జీఎస్టీ రాబడి పది నెలల్లో సగటున నెలకు రూ.4,367 కోట్ల మొత్తం రూ.43,673 కోట్లు చొప్పున రాగా, అంచనాలు చేరాలంటే ఇక నెలకు రూ.8,015 కోట్లు రాబట్టాలి. పన్నేతర ఆదాయం కూడా లక్ష్యం రూ.31,618 కోట్లు కాగా, పది నెలల్లో నెలకు సగటున రూ.786 కోట్లతో కేవలం 24 శాతమే రూ.7,864 కోట్లు సమకూరడం సర్కారును నిరాశపరిచింది.
ఖర్చుల మోత.. అంచనాలు దాటిన ద్రవ్యలోటు
మొత్తంగా పన్నుల వసూళ్లు రూ.1.75 లక్షల కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటిదాకా నెలకు సగటున రూ.12,629 కోట్లు రాగా, ఇప్పుడు ఏకంగా నెలకు రూ.24.5 వేల కోట్లకు పైగా వస్తే కానీ టార్గెట్ రీచ్ కాలేరు. ఈ ప్రధాన శాఖలన్నీ ఏకకాలంలో ప్రస్తుత సగటు కన్నా దాదాపు రెట్టింపు వసూళ్లు సాధిస్తే తప్ప లక్ష్యాలను చేరుకునే అవకాశం లేదు. ఈ భారీ వ్యత్యాసం కారణంగా సర్కారు అనివార్యంగా తన రోజువారీ అవసరాల కోసం అప్పుల మీద ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఒకవైపు రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో సొంత ఆదాయం రాకపోవడం, మరోవైపు రోజువారీ ఖర్చులు, రుణాల భారం సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
కాగ్ నివేదిక ప్రకారం జనవరి నెలాఖరు వరకే ఉద్యోగుల జీతాలకు రూ.39,858 కోట్లు, పింఛన్ల కోసం రూ.15,717 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. గత ప్రభుత్వం చేసిన ఆర్బీఐ అప్పుల వడ్డీలు చెల్లించడానికే ఖజానా నుంచి ఏకంగా రూ.24,085 కోట్లు చెల్లించింది. అంచనాలకు మించి పెరుగుతున్న ఖర్చులతో రాష్ట్ర ద్రవ్యలోటు (ఫిస్కల్ డెఫిసిట్) పరిమితులు దాటిపోయి రూ.69,148 కోట్లకు చేరుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బడ్జెట్లో ద్రవ్యలోటు రూ.54 వేల కోట్లకు పరిమితం అవుతుందని అంచనా వేసినా.. అది ఏకంగా 128 శాతానికి పైగా పెరిగింది.
