- ఎనిమిది ఏరియాల్లో ఏర్పాటుకు నిర్ణయం
- రూ.100 కోట్ల ఆర్థిక భారం తగ్గేలా ప్రణాళికలు
- 15 వేల కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తికి రూ.65.44 కోట్లు కేటాయింపు
కోల్‌బెల్ట్, వెలుగు: విద్యుత్ ఉత్పత్తి రంగంలో సింగరేణి మరో ముందడుగు వేసింది. స్థానిక వనరులను వినియోగిస్తూ సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తోంది. 300 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఖాళీ స్థలాలు, ఓపెన్ కాస్ట్ మైన్ల ఓబీ(మట్టికుప్పలు) డంప్ యార్డులు, నీటిపై తేలియాడే సోలార్ ఫ్లోటింగ్ పానెల్స్ ద్వారా ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి చేపడుతోంది.
తాజాగా కార్మికుల నివాస క్వార్టర్లపై సోలార్ పవర్ రూఫ్‌టాప్ పానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి ప్రాంతాల్లోని క్వార్టర్లపై పానెల్స్ అమర్చి, వాటి ద్వారా విద్యుత్ సరఫరా చేయనుంది.
రూఫ్‌టాప్‌లపై సోలార్ పానెల్స్..
సింగరేణి పరిధిలో సుమారు 40 వేలకుపైగా క్వార్టర్లు ఉన్నాయి. పాత క్వార్టర్లతో పాటు కొత్తగా నిర్మిస్తున్న మిలీనియం కాలనీలలో కూడా సోలార్ సదుపాయం కల్పించనున్నారు. 12 ఏరియాల్లో ఎనిమిది ఏరియాలైన శ్రీరాంపూర్, భూపాలపల్లి, ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3, మణుగూరు, కొత్తగూడెం, కొత్తగూడెం కార్పొరేట్ ప్రాంతాల్లోని క్వార్టర్లపై సోలార్ పానెల్స్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 15 వేల కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రూ.65.44 కోట్లను కేటాయించారు. స్లాబ్ పద్ధతిలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న క్వార్టర్లపై పానెల్స్ అమర్చనున్నారు. ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రూఫ్‌లపై ఉన్న వాటర్ ట్యాంకులు, ఇతర సామగ్రి తొలగించాలని అన్ని ఏరియాలకు ఆదేశాలు జారీ చేశారు.
మిగులు విద్యుత్ గ్రిడ్‌కు..
ప్రస్తుతం కార్మికుల క్వార్టర్లకు విద్యుత్ సరఫరా కోసం ఏటా సుమారు రూ.100 కోట్ల భారం సంస్థపై పడుతోంది. సోలార్ పానెల్స్ ద్వారా గృహ అవసరాలను తీర్చడంతో పాటు మిగులు విద్యుత్‌ను రాష్ట్ర జెన్‌కో గ్రిడ్‌కు సరఫరా చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. దీనివల్ల విద్యుత్ ఖర్చు తగ్గడంతో పాటు అదనపు ఆదాయం కూడా లభించనుంది.
పాత క్వార్టర్లపై ఉన్న నీటి ట్యాంకులు, ఇతర వస్తువులు తొలగించిన వెంటనే పానెల్స్ అమరిక ప్రారంభించనున్నారు. త్వరలోనే సింగరేణి కార్మికుల నివాసాల్లో సోలార్ వెలుగులు
ప్రసరించనున్నాయి.
