మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: వచ్చే మార్చి 15వ తేదీలోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులపై కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురించాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోటీకి అవకాశం దక్కని వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిలు పార్టీ నాయకులకు మాట ఇచ్చారు. దీంతో అలాంటి వారు ఇప్పుడు తమకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో..
జిల్లాలో ఇప్పటివరకు కొన్ని నామినేటెడ్పోస్టులను భర్తీ చేసినా మరికొన్నింటి కోసం నేతలు తమదైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్పదవికి లింగమూర్తి రాజీనామా చేయడంతో ప్రస్తుతం అది కూడా ఖాళీగా ఉంది. సిద్దిపేట నియోజకవర్గంలో మూడు మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్ పోస్టులను ఇంకా భర్తీ చేయలేదు. ఇందుకోసం పలువురు నాయకులు ముఖ్య నేతలను, జిల్లా మంత్రులను కలుస్తూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం రెండేళ్లుగా కొందరు నాయకులు ఎదురుచూస్తున్నారు. ఇవే కాకుండా రాష్ట్రస్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టులతో పాటు జిల్లాలోని దేవాలయ పాలక మండలి సభ్యత్వం కోసం పలువురు ఆశావహులు తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, సదాశివపేట, అందోల్, రాయికోడ్ పరిధిలోని పలువురు నాయకులతో ప్రభుత్వం కొన్ని నామినేటెడ్పోస్టులను భర్తీ చేసింది. మరికొన్ని చోట్ల మార్కెట్ కమిటీ పాలకవర్గాల భర్తీ స్థానిక లీడర్లలో ఐకమత్యం లేక పెండింగ్ పడుతూ వచ్చాయి. డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పదవీకాలం మార్చి నెలాఖరుతో ముగియనుంది.
ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, మున్సిపల్ పరిధిలో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కష్టపడ్డ వారి సేవలను గుర్తించి నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు కొందరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచరులు సైతం పోటీ పడుతున్నారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలో ఏడుపాయల దేవాలయ పాలక మండలి, నిజాంపేట మండలం చల్మెడ తిరుమలనాథ స్వామి దేవాలయం, మెదక్ పట్టణంలోని వేణుగోపాల్ స్వామి ఆలయం పాలక మండలితో పాటు, మెదక్, రామాయంపేట, పాపన్నపేట, నర్సాపూర్, తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవులు, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పదవులు ఖాళీగా ఉన్నాయి.
వివిధ కారణాల వల్ల నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోటీచేసే అవకాశం దొరకని నాయకులకు నామినేటెడ్ పదవుల్లో ఛాన్స్ ఇస్తామని ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు, డీసీసీ ప్రెసిడెంట్ఆంజనేయులు గౌడ్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ ప్రకటన అలాంటి నాయకుల్లో ఆశలు చిగురింపజేసింది.
