కరకట్టలకు మోక్షం కలిగేనా?.. ఏటా వానాకాలంలో గోదావరి ఉప్పొంగి ముంపునకు గురవుతున్న గ్రామాలు

కరకట్టలకు మోక్షం కలిగేనా?.. ఏటా వానాకాలంలో గోదావరి ఉప్పొంగి ముంపునకు గురవుతున్న గ్రామాలు
  • భద్రాచలంలో మాదిరిగా కరకట్టలు నిర్మించాలని ప్రతిపాదనలు
  • గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలు
  • కాంగ్రెస్​ ప్రభుత్వమైనా పట్టించుకోవాలని కోరుతున్న ప్రజలు  

నిర్మల్, వెలుగు: ఏటా వానాకాలంలో గోదావరి నది పరివాహక గ్రామాలు వరద కారణంగా ముంపునకు గురవుతున్నాయి. ప్రధానంగా శ్రీరామ్​సాగర్ ప్రాజెక్టు గేట్ల దిగువ నుంచి మొదలయ్యే గోదావరి ఖానాపూర్ వరకు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఎగువ మహారాష్ట్ర నుంచి వరద పెరిగితే ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుంటారు.

ఒకేసారి లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో నది ఉప్పొంగుతుంటుంది. ఆ సమయంలో నదికి ఇరువైపులా ఉన్న పరివాహక గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ పల్లెలను వరద నుంచి కాపాడేందుకు ఇరిగేషన్​అధికారులు భద్రాచలం తరహాలో కరకట్టల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనిపై మూడేండ్ల కింద అప్పటి బీఆర్ఎస్ సర్కారుకు నివేదిక ఇచ్చారు.  

40 కిలోమీటర్ల మేర నదీ ప్రవాహం

సోన్ నుంచి ప్రారంభమయ్యే గోదావరి నది ఖానాపూర్ వరకు దాదాపు 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంటుంది. ఈ దూరాన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు మొత్తం నదికి ఇరువైపులా కరకట్టలు నిర్మించాలని భావించారు. ఇందుకోసం దాదాపు రూ.70 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. అయితే భద్రాచలంలోని కరకట్టలకు మరింత శాస్త్రీయతను జోడించి క్షేత్రస్థాయిలోని పరిస్థితులను బట్టి ఇక్కడ కరకట్టలు నిర్మించాల్సి ఉంటుందని చెబుతున్నారు. 
ప్రస్తుత సర్కారుపైనే ఆశలు 

గోదావరి పరివాహక ప్రాంతాలను వరద ముప్పు నుంచి కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కరకట్టల నిర్మాణ ప్రతిపాదనలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చి, ముంపు సమస్య నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. వరదల వల్ల జరుగుతున్న నష్టంపై సీరియస్ గా స్పందిస్తున్న ప్రభుత్వం కరకట్టల నిర్మాణ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

స్వర్ణ నది పరివాహక పల్లెలు కూడా..

ఏటా గోదావరి నది ఉధృతి కారణంగా సోన్ నుంచి మొదలుకొని కూచన్ పళ్లి, ధర్మారం, పార్ పల్లి, మునిపల్లి, చింతల్ చందా, మామడ మండలంలోని కమల్ కోట, పొన్కల్ ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ మేడమ్ పల్లి, బాదన్ కుర్తి, ఖానాపూర్ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.

వీటితోపాటు గోదావరి నదికి  ఉపనది అయిన స్వర్ణ నది పరివాహకంలోని పలు గ్రామాలు కూడా ముంపు బారిన పడుతున్నాయి. స్వర్ణ ప్రాజెక్టు నుంచి మాదాపూర్ వరకు గల గ్రామాలతోపాటు నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ కూడా ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి.