
బీఎస్పీ అధినేత మాయావతి బీజేపీ, మీడియాపై మండిపడ్డారు. తనపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుడుగా చూపిందన్నారు. మాయావతి ఉత్తర ప్రదేశ్ సీఎం ఉన్నప్పుడు అంబేద్కర్, కాన్షీరాం తదితర దళిత నాయకుల విగ్రహాలతో పాటు తన విగ్రహాలు కూడా ప్రధాన ప్రాంతాల్లో పెట్టించారు. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్బంగా కోర్టు మాయావతిని ఉద్దేశించి ప్రజాధనంతో తన విగ్రహాలు పెట్టించుకున్న మాయావతి ఆ డబ్బును తిరిగి చెల్లించాలని వ్యాఖ్యానించింది. దీనిపై మాయావతి మాట్లాడుతూ మీడియా కోర్టు వ్యాఖ్యలను వక్రీకరించిందని అన్నారు. కోర్టు వ్యాఖ్యలను వక్రీకరించవద్దని తాను బీజేపీని, మీడియాను అభ్యర్ధిస్తున్నానని అన్నారు. ఈ కేసులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. దళిత, ఓబీసీ వర్గాల్లో జన్మించిన గురువులను విస్మరించామని… తాను వారి గౌరవార్ధం విగ్రహాలు పెట్టించి, పార్కులు నిర్మించానని మాయావతి చెప్పారు.