సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ

సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ

మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీకి.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ సాయంత్రం 6గంటల నుంచి.. రేపు సాయంత్రం వరకు ప్రసాదం పంపిణీ జరగనుంది. చేప ప్రసాదం తీసుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం తరలివస్తున్నారు. నాంపల్లి గ్రౌండ్స్ కి వచ్చే పేషెంట్స్ కోసం మెట్రో ప్రత్యేక రైళ్ళు కూడా నడుపుతోంది.

బత్తిని మృగశిర ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 184 యేళ్ళుగా ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. రెండు రకాలుగా ఈ ప్రసాదం పంపిణీ చేస్తారు. వెజిటేరియన్స్ కు బెల్లంతో.. నాన్ వెజిటేరియన్స్ కు  చేపతో మందును ఇస్తారు. ఇందుకోసం కొరమీను చేప పిల్లల్ని మాత్రమే ఉపయోగిస్తారు.

ఈ ఏడాది లక్షా 60వేల కొర్రమీను పిల్లల్ని అందుబాటులో ఉంచింది మత్స్యశాఖ. 36 కౌంటర్లలో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వచ్చినవారి సందేహాలు తీర్చేందుకు.. బస్సులు, రైళ్ల సమాచారాన్ని తెలిపేందుకు మే ఐ హెల్ప్ యూ డెస్క్ ఏర్పాటు చేస్తున్నారు.

శాఖల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు అధికారులు. భద్రతకు ప్రాధాన్యమిస్తూ 60 సీసీ కెమెరాలు, 4 ఎల్ ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. గ్రౌండ్ లో ఆరు హెల్త్ క్యాంప్స్, మూడు ఫైరింజన్లు, మరో మూడు బుల్లెట్ శకటాలు, ఫైర్ కంట్రోల్ రూంలను అందుబాటులో ఉంచారు. గ్రౌండ్ లో, బయటా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.

ఉదయం నుంచి రోగులు, సహాయకులకు.. భద్రివిశాల్ పన్నాలాల్ ట్రస్ట్, అగర్వాల్  ట్రస్ట్, అగర్వాల్ సేవాదళ్, హైదరాబాద్ జైశ్వాల్  సేవా సమితిలు.. ఉచితంగా టిఫిన్లు, భోజనాలు సమకూరుస్తాయి. దీంతోపాటు అధికారులకు 5 రూపాయిలకే భోజనం అందించనున్నారు.

చేప ప్రసాదం కోసం ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు చేరుకుంటున్నారు ప్రజలు. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి.. అస్తమా రోగులు చేప మందు  తీసుకునేందుకు వచ్చారు.

ప్రసాదం తీసుకునే ఒక గంట ముందు, తీసుకున్న తర్వాత రెండు గంటల వరకు ఎలాంటి ఆహారం తీసుకోవద్దని చెబుతున్నారు బత్తిన సోదరులు. ఆదివారం సాయంత్రం ఆరింటి తర్వాత వచ్చే వారికి.. దూద్ బౌలిలో ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.