చేప పిల్లల పంపిణీ ఈ ఏడాది కూడా ఆలస్యమే

చేప పిల్లల పంపిణీ ఈ ఏడాది కూడా ఆలస్యమే
  • రాష్ట్రవ్యాప్తంగా 26,778 నీటి వనరుల ఎంపిక
  • గతేడాది పంపిణీలో తీవ్ర జాప్యం 
  • చేపపిల్లలు ఎదగక నష్టపోయిన మత్స్యకారులు

ఖమ్మం, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, రిజర్వాయర్లలో పెంచేందుకు ప్రభుత్వం ఉచితంగా చేపట్టే చేప పిల్లల పంపిణీ ఈ ఏడాది కూడా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. జులై నెల మూడో వారానికి కూడా టెండర్లను ఇంకా ఫైనల్ చేయకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేటుగా చెరువుల్లో పిల్లలను పోయడం వల్ల అనుకున్న స్థాయిలో చేపలు పెరగక తాము నష్టపోతున్నామని చెబుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 26,778 నీటి వనరుల్లో చేప, రొయ్య పిల్లలను వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. ఇందుకోసం 88.52 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు అవసరం అవుతాయని లెక్కలు వేశారు. మూడు వారాల క్రితం జిల్లాల వారీగా టెండర్లను ఆహ్వానించారు. కాంట్రాక్టర్లు దాఖలు చేసిన బిడ్డింగుల పరిశీలన నడుస్తోందని, ఒకట్రెండు రోజుల్లో ఫైనల్ అయ్యే అవకాశముందని ఆఫీసర్లు చెబుతున్నారు. గతేడాది టెండర్ల విషయంలో ఇలాగే కాలయాపన జరిగింది. రేట్ల విషయంలో కాంట్రాక్టర్లు సిండికేటుగా మారడంతో, మూడు నాలుగుసార్లు ప్రభుత్వం టెండర్లు పిలవాల్సి వచ్చింది. అప్పటికే ఆలస్యం కావడంతో చాలా చెరువుల్లో సెప్టెంబర్, అక్టోబర్​ నెలాఖరుకు చేప పిల్లలను వదిలారు. ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చెరువులు ఖాళీ అయ్యే సమయానికి ఆ పిల్లలను పట్టి చూస్తే ఒక్కొక్కటి 450 గ్రాములు కూడా ఎదగలేదు. కనీసం చెరువుల్లో 7 నుంచి 8, 9 నెలలు పెరగాల్సిన పిల్లలు ఐదారు నెలల్లోనే పట్టాల్సి వచ్చింది. చెరువుల్లో వేసిన పిల్లల్లో 35 నుంచి 40 శాతం వరకు చనిపోయాయని, మిగిలినవి అర కిలో సైజుకు కాస్త అటుఇటుగా మాత్రమే పెరిగాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో, కొన్నిచోట్ల ఈ ఎండాకాలం చేపలను పట్టకుండానే వదిలేశారు. ఈసారి కూడా టెండర్లు ఆలస్యమైతే, తమ పరిస్థితి మళ్లీ అదేవిధంగా మారుతుందని మత్స్యకార సంఘాల ప్రతినిధులు అంటున్నారు. నాణ్యమైన పిల్లలను పంపిణీ చేయకపోవడం, అవి ఎదిగేందుకు సమయం ఇవ్వకపోవడం వల్ల తమకు నష్టమేనని చెబుతున్నారు. 

నిధుల కొరతే కారణమా?
ఖమ్మం జిల్లాలో చెరువులు, కుంటలు కలిపి 1,129 నీటి వనరులున్నాయి. ఈ ఏడాది 3.94 కోట్ల చేప పిల్లలు, 33 లక్షల రొయ్య పిల్లలను వదలాలని జిల్లా ఆఫీసర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. 80 నుంచి 100 మిల్లీ మీటర్ల చేప పిల్ల ధర రూ.1.63, 35 నుంచి 40 మిల్లీమీటర్ల చేప పిల్లల ధర రూ.0.61గా నిర్ణయించారు. గత నెలలో టెండర్లను ఆహ్వానించగా ఖమ్మం జిల్లాకు చెందిన నలుగురు, ఏపీకి చెందిన ఆరుగురు టెండర్లు దాఖలు చేశారు. వాటిని గత వారం పరిశీలన కోసం ఉన్నతాధికారులకు పంపించారు. ప్రస్తుతం టెండర్లు దాఖలు చేసిన వారికి చేప పిల్లల నర్సరీలు ఉన్నాయా, లేదా, సకాలంలో పిల్లలను పంపిణీ చేయగలుగుతారా లేదా అని ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ప్రాసెస్​ పూర్తి కాగానే టెండర్లు ఫైనల్​చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా టెండర్ల ఫైనలైజ్​ కోసం ఈ ఏడాది రూ.100 కోట్లు అవసరం అవుతాయని, మత్స్యశాఖ దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల ప్రాసెస్ ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది. 

రెండు వారాల్లో పంపిణీ చేస్తాం
చేప, రొయ్య పిల్లల సప్లై కోసం నిర్వహించిన టెండర్లను పరిశీలన కోసం ఉన్నతాధికారులకు పంపించాం. ఈ రోజే టెండర్లు ఫైనల్​ అయ్యాయి. రెండు వారాల్లో చేప పిల్లల పంపిణీ షురూ చేస్తాం. 
– ఆంజనేయస్వామి, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఖమ్మం