
- బాలసముద్రం ఇండ్ల పంపిణీకి కసరత్తు
- అంబేద్కర్ నగర్, జితేంద్ర సింగ్ నగర్ వాసుల ఎదురుచూపులకు మోక్షం
హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలోని గుడిసెవాసుల సొంతింటి కల నెరవేరబోతోంది.! గత ప్రభుత్వం ఓరుగల్లు నుంచే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినా.. పనులు పూర్తయిన ఇండ్లను అప్పటి లీడర్లు పంచకుండా పడావుపెట్టారు. దీంతో డబుల్ ఇండ్ల కోసం గుడిసెలు ఖాళీ చేసి జాగలిచ్చిన హనుమకొండలోని అంబేద్కర్ నగర్, జితేంద్రసింగ్ నగర్ జనాలను బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోక పదేండ్లుగా గుడిసెల్లోనే పడిగాపులుగాయాల్సి వచ్చింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చొరవతో గుడిసెవాసులకు ఇంటి యోగం కలగబోతోంది. ఆగస్టు 15వ తేదీలోగా గుడిసెవాసులకు ఇండ్లు పంచాలని టార్గెట్ పెట్టుకుని, దానికితగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గుడిసెవాసుల జాబితా ఫైనల్ చేసి, అర్హులైన పేదలకే ఇండ్లను పంచేందుకు చర్యలు చేపడుతున్నారు.
మాటిచ్చి వదిలేసిన కేసీఆర్..
హనుమకొండ బాలసముద్రంలోని అంబేద్కర్ నగర్, జితేంద్రసింగ్ నగర్ లో దాదాపు 160 నిరుపేద కుటుంబాలు 40 ఏండ్ల కిందట్నుంచే గుడిసెలు వేసుకుని ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 జనవరిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదటిసారి సీఎం హోదాలో వరంగల్ నగరంలో పర్యటించారు. మూడు రోజులపాటు ఇక్కడే బస చేసి, నగరంలోని స్లమ్ ఏరియాలన్నీ తిరిగారు. ఆ సమయంలో అంబేద్కర్ నగర్, జితేంద్రసింగ్ నగర్ లను సందర్శించి, ఇక్కడి గుడిసె వాసులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని మాట ఇచ్చారు.
కొద్దిరోజులకే లోకల్ లీడర్లు, ఆఫీసర్లు అక్కడున్న గుడిసెలన్నింటినీ ఖాళీ చేయించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు. గుడిసెలు ఖాళీ చేయించడంతో కొంతమంది ఇతర ప్రాంతాల్లో కిరాయికి వెళ్లగా, మరికొందరు ఆ ఇండ్ల నిర్మాణం పక్కనే గుడిసెలు వేసుకున్నారు. అంబేద్కర్ నగర్లో 37 బ్లాకుల్లో 16 ప్లాట్ల చొప్పున మొత్తంగా 592 డబుల్ బెడ్ రూంలను నిర్మాణ పనులు చేపట్టగా, ఆ వర్క్స్ 2018లోనే పూర్తి చేశారు. ఆ ఇండ్లను పంచుతామని ఆశ పెట్టి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేయించుకున్న గత సర్కారు తర్వాత లైట్ తీసుకుంది.
దీంతో గుడిసెవాసులు పలుమార్లు ఆందోళనలు చేపట్టగా, 2022 ఏప్రిల్ 20న వరంగల్ నగరానికి వచ్చిన అప్పటి మంత్రి కేటీఆర్ అంబేద్కర్ నగర్ కు చెందిన ఆరుగురికి డబుల్ ఇండ్ల అలాట్మెంట్ లెటర్లు ఇచ్చారు. మిగతా వాళ్లందరికీ ఇండ్లు పంచుతామని హామీ ఇచ్చి వెళ్లిపోగా, అప్పటి లీడర్లు గుడిసెవాసులను మభ్యపెడుతూ వచ్చారు. దీంతో ఇంతవరకు వారికి గృహప్రవేశ యోగం కలగలేదు.
అనర్హుల ఏరివేత, ఓపెనింగ్ కు ముస్తాబు..
గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల జాబితా రూపొందిస్తున్న పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇండ్లు కేటాయించారు. కొంతమంది దగ్గర రూ.3 లక్షల వరకు వసూలు చేసి, అనర్హులను కూడా లబ్ధిదారులుగా చేర్చారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీపై ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పలుమార్లు ఆఫీసర్లు, కాలనీవాసులతో సమావేశమై లబ్ధిదారుల జాబితాపై కసరత్తు చేశారు. తాజాగా లబ్ధిదారుల లిస్ట్ లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు ఆరోపణలు రాగా, విచారణ జరిపి, ముగ్గురు సర్కారు ఎంప్లాయిస్ ఉన్నట్లు గుర్తించి, జాబితా నుంచి తొలగించారు.
ఇటీవల ఇందిరమ్మ ఇండ్లు సాంక్షన్ అయిన వారిని కూడా బెనిఫిషరీస్ లిస్ట్ నుంచి తీసేశారు. లబ్ధిదారులకు పంచేందుకు ఇండ్ల మధ్య పెరిగిన చెట్లు, పిచ్చిమొక్కలను తొలగించి, పెయింటింగ్ వర్క్స్ చేయిస్తున్నారు. ఆ ఇండ్లకు వాటర్ సప్లై సిస్టంతోపాటు ఎలక్ట్రికల్ వర్క్స్ పెండింగ్ లో ఉండగా, వాటిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పంద్రాగస్టులోగా ఇండ్లు పంచేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో అంబేద్కర్ నగర్, జితేంద్రసింగ్ నగర్ గుడిసెవాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఆగస్టు 15 డెడ్ లైన్..
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అంబేద్కర్ నగర్, జితేంద్రసింగ్ నగర్ గుడిసెవాసులు తమ సమస్యను స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన జిల్లా ఇన్చార్జి మంత్రి, హౌజింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గుడిసెవాసులకు ఇండ్ల పంపిణీకి లైన్ క్లియర్ చేయించారు. ఆగస్టు 15వ తేదీలోగా గుడిసెవాసులతోపాటు అర్హులైన పేదలకు బాలసముద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు పంచేందుకు డెడ్ లైన్ పెట్టుకున్నారు.
మొదట ఆగస్టు 5న ఇండ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తామని ఎమ్మెల్యే నాయిని ప్రకటించినప్పటికీ ఈ నెల 9న లేదా ఆగస్టు 15న స్పోర్ట్స్ స్కూల్ ఓపెనింగ్ రోజునే చీఫ్ గెస్టుల చేతులమీదుగా లబ్ధిదారులకు అలాట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది.