ఇయ్యాల్టి నుంచి ప్రైవేట్ టీచర్లకు సన్న బియ్యం పంపిణీ

ఇయ్యాల్టి నుంచి ప్రైవేట్ టీచర్లకు సన్న బియ్యం పంపిణీ
  • లక్షా 13 వేల మందికి 25 కిలోల చొప్పున పంపిణీ
  • రేషన్ షాపుల వివరాలు ఇవ్వని 12 వేల మంది   
  • రూ.15.15 కోట్లు రిలీజ్ చేసిన సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బుధవారం నుంచి బియ్యం పంపిణీ ప్రారంభం కానున్నది. కరోనా కారణంగా ప్రైవేట్ స్కూళ్లు మూతపడడంతో రాష్ట్రంలో మొత్తం లక్షా 25 వేల మందికి రూ.2 వేలు, 25 కిలోల చొప్పున సన్న బియ్యం ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. అయితే మొదటి దశలో 1,13,587 మందికి బుధవారం నుంచి బియ్యం ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిగిలిన వారికి రెండో విడతలో పంపిణీ చేయనున్నారు. కాగా ఈ బియ్యం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం రూ.15.15 కోట్ల నిధులను మంగళవారం విడుదల చేసింది.

తొలి రోజు 1,12,843 మందికి డబ్బులు డిపాజిట్
సర్కారు సహాయం కోసం 2,09,873 మంది టీచర్లు, సిబ్బంది అప్లై చేసుకున్నారు. అయితే విద్యా శాఖ అధికారుల వెరిఫికేషన్‌‌లో యూడైస్‌‌లో లక్షా 25 వేల మంది పేర్లే ఉన్నాయని తేలడంతో వారికే రూ.2 వేల డబ్బులతో పాటు సన్న బియ్యం అందిస్తామని ప్రకటించారు. వారి అకౌంట్లలోనే డబ్బులు డిపాజిట్ చేసే ప్రక్రియ మంగళవారమే మొదలైంది. ఈ నెల 24 వరకు అందరికీ ఇస్తామని సర్కారు తెలిపింది. తొలిరోజు 1,12,843 మందికి డబ్బులు డిపాజిట్ చేసినట్లు అధికారులు చెప్పారు. మిగిలిన వారిలో కొందరి అకౌంట్‌‌ నంబర్లు, ఐఎఫ్ఎస్‌‌సీ కోడ్ మ్యాచ్ కాలేదని, వాటిని సరి చేసుకుని మనీ ట్రాన్స్‌‌ఫర్ పూర్తి చేస్తామన్నారు. కాగా, 1,13,587 మంది మాత్రమే రేషన్ షాపుల వివరాలు సక్రమంగా ఇవ్వడంతో వారికే బియ్యం అందించనున్నట్లు సివిల్ సప్లై అధికారులు  తెలిపారు. 33 జిల్లాల్లో ని 13,715 రేషన్ షాపుల పరిధిలో వారికి బియ్యం అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం 2,839.675 టన్నుల బియ్యం అందుబాటులో ఉంచామని తెలిపారు. కాగా, మిగిలిన12వేల మంది నుంచి రేషన్ షాపుల వివరాలు సేకరించి రెండో దశలో బియ్యం ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్​ జిల్లాలో 19,822 మంది, మేడ్చల్‌‌లో 17,708 మంది, రంగారెడ్డిలో 13,125 మంది బియ్యం తీసుకోబోతుండగా, అత్యల్పంగా ములుగులో 483 మంది బియ్యం తీసుకోనున్నారు.