అందుబాటులో విత్తనాలు, ఎరువులు : క్రాంతి వల్లూర్

అందుబాటులో విత్తనాలు, ఎరువులు : క్రాంతి వల్లూర్
  •    55 సెంటర్ల ద్వారా పంపిణీ
  •     ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు
  •     జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్

సంగారెడ్డి, వెలుగు: రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లాలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్ తెలిపారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వానాకాలం సీజన్ కు సంగారెడ్డి జిల్లాకు 5,881 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కేటాయించడం జరిగిందన్నారు. 

అందులో 2,217 క్వింటాళ్ల జీలుగు, 1,981 క్వింటాళ్ల జనుము విత్తనాలు కలిపి మొత్తం 4,198 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 55 సెంటర్ల ద్వారా విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు తప్పనిసరిగా రసీదు, పత్తి రకం, మోతాదు, లాట్ నెంబర్ విధిగా చూసుకోవాలని సూచించారు.

అధిక ధరలకు అవిక్రయిస్తే చర్యలు

విత్తన డీలర్లు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ క్రాంతి హెచ్చరించారు. ఎక్కువ ధరలకు విక్రయించే డీలర్లపై సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, డీఆర్ఓ పద్మజారాణి, వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు పాల్గొన్నారు.

నష్ట నివారణ చర్యలు చేపట్టాలి

సంగారెడ్డి టౌన్: రానున్న వర్షాకాలనికి సంబంధించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  జిల్లాలోని రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ, ఇంజినీరింగ్, నీటిపారుదల,  అటవీ, వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి మున్సిపాలిటీలో విపత్తు నిర్వహణ టీమ్ లను ఏర్పాటు చేయాలన్నారు. కల్వర్టులు, బ్రిడ్జిలు, రోడ్డులు, రోడ్డు డైవర్షన్లను అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలన సూచించారు.