- జిల్లా ఎన్నికల పరిశీలకురాలు భారతి లక్పతి
మెదక్ టౌన్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో వ్యయం, మద్యం నియంత్రించాలని జిల్లా సాధారణ అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం మంబోజిపల్లి చెక్‌పోస్టును సందర్శించి వాహనాల తనిఖీని పరిశీలించారు.
జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మైక్రో అబ్జర్వర్ల మీటింగ్లో పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో పంచాయతీలకు 82 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించినట్లు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల విధులు కీలకమని చెక్ లిస్ట్ ప్రకారం తప్పకుండా విధులు నిర్వహించాలని సూచించారు.
పోలింగ్ ముగిసిన అనంతరం అబ్జర్వర్లు సాధారణ పరిశీలకులకు రిపోర్టులు సబ్మిట్ చేయాలన్నారు. పోలింగ్స్టేషన్లలో ప్రశాంతంగా నిబద్ధతతో పనిచేయాలని, పరిశీలనకు ప్రాధాన్యత ఉండాలని, విధుల పట్ల ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, డీపీవో యాదయ్య, డీఎస్వో రాజిరెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.

